చైత్రశుక్ల దశమికే ధర్మరాజ దశమి అని పేరు. శ్రీరామనవమి మరుసటిరోజు వచ్చే ధర్మరాజ దశమి రోజు యముడిని పూజిస్తే మరణభయం తొలగిపోతుందని పెద్దలు, శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ధర్మరాజ దశమి రోజు నచికేతుడి కథ వినడం వలన మరణ భయం తొలగిపోతుందని శాస్త్రవచనం.
ఎవరీ నచికేతుడు?
పూర్వం గౌతమ మహర్షి వంశానికి చెందిన వాజశ్రవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతడినే ఉద్దాలకుడు అని కూడా అంటారు. ఈయన కొడుకే నచికేతుడు.
నచికేతుని కథ!
పూర్వం వజాశ్రవుడు ఒక యాగం చెయ్యాలి అనుకున్నాడు. ఆ యాగంలో తన దగ్గరున్న సంపదలు అన్నీ దానం చేసేయ్యాలి. కానీ వాజశ్రవుడు యాగం అయిపోయిన తరువాత అక్కడికి వచ్చిన వాళ్లకు తన దగ్గరున్న ఆవులలో పాలు ఇవ్వలేని, ఒట్టిపోయిన ఆవులను అందరికీ దానం చేస్తున్నాడు.
తండ్రికి అడ్డు చెప్పిన నచికేతుడు
తండ్రి చేసిన పని నచికేతుడికి నచ్చలేదు. అప్పుడు నచికేతుడు తన తండ్రితో "ఏదైనా దానం చేస్తే ఇతరులకు ఉపయోగపడాలి కానీ ఇలా ఉపయోగపడని వాటిని దానం చేస్తే ప్రయోజనం ఏంటి? ఒకపని చెయ్యండి నన్ను కూడా ఎవరికైనా దానం చేసేయండి" అని అన్నాడు నచికేతుడు. నచికేతుని మాటలను పిల్ల చేష్టలుగా భావించి వాజశ్రవుడు తనను విసిగించవద్దని మందలిస్తాడు.
పట్తు వదలని నచికేతుడు
వాజశ్రవుడు మందలించినా నచికేతుడు అదే మాట పదే పదే అడగడంతో చివరకు విసిగిపోయిన వాజశ్రవుడు "నిన్ను యముడికి ఇస్తాను" అని చిరాకుగా అంటాడు. ఆ తరువాత తప్పు తెలుసుకుని తాను తొందరపాటులో అన్నానని ఆ మాటలు పట్టించుకోవద్దని చెబుతాడు.
యముని వద్దకు వెళ్లిన నచికేతుడు
పవిత్రమైన యాగస్థలంలో తండ్రి వాజశ్రవుడు అన్న మాట వృధా కాకూడదని నచికేతుడు యముడి దగ్గరకు వెళ్ళాడు. కానీ అతనికి యముడి దర్శనం తొందరగా దొరకలేదు. ఆ తరువాత యముడు నచికేతుడితో విషయం కనుక్కున్నాక "మీ నాన్న ఏదో మాటవరుసకు అంటే నువ్వు వచ్చేసావా వెళ్లిపో! నీకు మూడు వరాలు ఇస్తాను" అన్నాడు.
నచికేతునికి యముడు ఇచ్చిన మూడు వరాలు!
యముడు మూడు వరాలు కోరుకోమని చెప్పగానే నచికేతుడు మూడు వరాలు కోరుకుంటాడు.
మొదటి వరం: నేను తిరిగి వెళ్తే మా నాన్న నామీద కోపం చేసుకోకూడదు అని అడుగుతాడు.
రెండో వరం: స్వర్గాన్ని చేరుకోవడానికి ఒక యజ్ఞాన్ని చెప్పమని యముని కోరుతాడు.
మూడో వరం: మరణం తరువాత ఏమి జరుగుతుంది? అని అడుగుతాడు.
మొదటి రెండు వరాలు అనుగ్రహించిన యముడు
నచికేతుడు కోరిన మొదటి వరానికి యముడు ఒప్పుకుంటాడు. రెండో దానికి ఒక యజ్ఞం గురించి చెప్పి దానికి నచికేత యజ్ఞం అనే పేరు పెడతాడు.
మూడో వరానికి నిరాకరించిన యముడు
మూడో వరంగా నచికేతుడు మరణానంతరం ఏమి జరుగుతుందో చెప్పమని అడిగాడు. యముడు నచికేతుడు చిన్న పిల్లవాడు అని అతనికి ఇప్పుడే ఇవన్నీ అవసరం లేదని అంటాడు.
మొండి పట్టు పట్టిన నచికేతుడు
నచికేతుడు మొండిపట్టు పట్టడంతో యముడు అతనికి బ్రహ్మజ్ఞానం భోదిస్తాడు. అదే ఆత్మజ్ఞానంగా పెద్దలు చెబుతారు. ఆత్మజ్ఞానం కలిగినవాడు మరణాన్ని గురించి భయపడడు.
మరణ భయాన్ని తొలగించే నచికేత యజ్ఞం
ధర్మరాజ దశమి రోజు నచికేత యజ్ఞం చేసినవారికి మరణ భయం ఉండదని శాస్త్రవచనం. యజ్ఞం చేయలేకపోయినా కనీసం ఈ కథ విన్నాసరే మరణభయం ఉండదని పెద్దలు అంటారు. అందుకే ఈ ధర్మరాజ దశమి ఎంతో ప్రాముఖ్యం పొందింది. ఒకసారి స్వామి వివేకానంద నచికేతుడి లాంటి పదిమంది శిష్యులను నాకు ఇస్తే ఈ దేశాన్ని మార్చేస్తాను అని అన్నాడు. అంటే నచికేతుడు గుణంలోనూ, పట్టుదలలోనూ ఆలోచనల్లోనూ ప్రశ్నించే గుణంలోనూ ఎంతో గొప్పవాడని ప్రత్యేకంగా చెప్పాలా? రానున్న ధర్మరాజ దశమి రోజు నచికేతుని కథను చదువుకుందాం. మరణ భయాన్ని తొలగించుకుందాం.
2025: ఏప్రిల్ 7
No comments:
Post a Comment