హిందూ పురాణాల ప్రకారం దేవుడు సర్వాంతర్యామి అయినప్పటికీ ఆలయాల్లో, తీర్థ స్థలాల్లో త్వరగా అనుగ్రహిస్తాడని విశ్వాసం. అందుకే దేవాలయ సందర్శనం, తీర్థయాత్రలు చేయడం హిందూ సంస్కృతిలో భాగం. అయితే దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించడం వెనుక శాస్త్రీయ కోణం కూడా ఉంది.
పూర్వీకులు, పీఠాధిపతులు, మఠాధిపతులు దేవాలయాలు నిర్మించేటప్పుడు ఆ స్థలానికి ఉన్న సానుకూల శక్తులను పరిశీలిస్తారు. ఎక్కడైతే సానుకూల శక్తుల ప్రభావం అధికంగా ఉంటుందో ఆ ప్రదేశంలోనే దేవాలయాలను నిర్మించేవారు. దేవాలయాలను నిర్మించి మూలవిరాట్టును ప్రతిష్టించే ముందు పీఠం కింద వేదమంత్రాలు లిఖించిన రాగి రేకును ఉంచి దాని పైన మూలవిరాట్టును ప్రతిష్టించడం ఆనవాయితీ.
రాగికి భూమి లోపలి శక్తి తరంగాలను ఆకర్షించి పరిసరాలలో విడుదల చేసే అద్భుతమైన శక్తి ఉంటుంది. దైవదర్శనం కోసం గుడికి వెళ్ళినప్పుడు ఆయా సానుకూల శక్తి తరంగాలు భక్తులపై ప్రసరించడం వలన పాజిటివ్ ఎనర్జీ, మానసిక ప్రశాంతత కలుగుతాయి. అందుకే దైవదర్శనం కోసం ఆలయాన్ని సందర్శించిన తర్వాత మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.
ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణాలు చేయడం పరిపాటి. ఆలయంలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు గర్భాలయంలో ప్రతిష్టించిన విగ్రహం కింద నిక్షిప్తం చేసిన మంత్రపూర్వక రాగిరేకు విడుదల చేసే శక్తి తరంగాలు మనపై ప్రసరించడం వలన శారీరక, మానసిక ఆరోగ్యాలు చేకూరుతాయని విశ్వాసం. అందుకే ఆలయంలో చేసే ప్రదక్షిణాలకు ప్రాధాన్యత ఉంది.
మన పూర్వీకులు, పెద్దలు సంవత్సరానికి ఒకసారైనా కొండకు వెళ్లి దైవ దర్శనం చేసుకోమంటారు. సాధారణం దేవుళ్ళ ఆలయాలు కొండపైనే ఉంటాయి. సాధారణ మైదానాల మీద లభించని స్వచ్ఛమైన గాలి, గాలిలోని నైట్రోజన్ కొండ ప్రాంతాలలో ఎక్కువగా లభిస్తుంది. సైన్స్ ప్రకారం చూస్తే నైట్రస్ ఆక్సైడ్‌కు లాఫింగ్ గ్యాస్ అనే పేరుంది. అంటే మనసుకు స్వాంతన చేకూర్చే ప్రశాంతత కొండ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది కాబట్టే సంవత్సరానికి ఒక్కసారైనా కొండకు వెళ్ళమని అంటారు.
హిందూ సంప్రదాయం ప్రకారం, పౌర్ణమి రోజు నదీస్నానం చేయడం శ్రేష్ఠం. శాస్త్రీయ పరంగా చూస్తే సాధారణంగా ప్రవహించే నదులలో ఔషధులు ఉంటాయి. ఈ ఔషధులు రాత్రిపూట చంద్రుని కిరణాలతో సంయోగం చెంది ఔషధీ తత్వాన్ని సంతరించుకుంటాయి. అందుకే ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో నదీస్నానం చేయడం ఆరోగ్యకరమని పెద్దలు ఈ నియమాన్ని పెట్టారు. దేవాలయ సందర్శనం, పుణ్యక్షేత్రాలు దర్శించడం, తీర్థ యాత్రలలో పవిత్ర స్నానాలు చేయడం మన సంప్రదాయంలో భాగం. అయితే ఈ సంప్రదాయాల వెనుక ఉన్న శాస్త్రీయతను తెలుసుకొని వాటిని పాటించడం ద్వారా ఇటు పుణ్యానికి పుణ్యం, ఆరోగ్యానికి ఆరోగ్యం.
No comments:
Post a Comment