Talpagiri Ranganatha Swamy Temple: శ్రీ తల్పగిరి రంగనాధస్వామి వారి ఆలయం - నెల్లూరు
శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలోని రంగనాయకులపేటలో పెన్నానది ఒడ్డున ఉంది.
ఆలయ స్థల పురాణం
పూర్వం కశ్యప మహాముని మహా పుణ్య క్షేత్రాల పర్యటనలో భాగంగా నెల్లూరుకు వచ్చి ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రాంతంలో పౌండరీక యాగం నిర్వహించాడు. కశ్యప ముని భక్తికి మెచ్చిన నారాయణుడు ఆ ప్రాంతం భక్తుల ఆదరణతో పరిఢవిల్లుతుందని అక్కడ శ్రీ రంగనాథస్వామిగా వెలిసినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది.
పౌరాణిక ప్రాశస్త్యం
మరో కథనం ప్రకారం, కశ్యప మహర్షి యజ్ఞంలో నుంచి ఉద్భవించిన త్రేతాగ్ని జ్వాలల్లో ఒకటి శ్రీరంగనాథ స్వామి ఆలయంగా, మరొకటి జొన్నవాడ కామాక్షమ్మ ఆలయంగా, మరోటి వేదగిరి నరసింహస్వామి క్షేత్రంగా వెలసినట్లు స్కంద పురాణం, వైష్ణవ సంహితలో ప్రస్తావన ఉంది. ఈ విధంగా అత్యంత ప్రాచీన ఆలయంగా తల్పగిరి శ్రీరంగనాయకుని ఆలయం ప్రసిద్ధి చెందింది. 12వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయంను మొదట శ్రీ వైకుంఠంగా పిలుచుకునేవారు. 17వ శతాబ్దం తరువాత ఈ దేవాలయం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది.
ఆలయ విశేషాలు
శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం గాలి గోపురం 7 అంతస్తులలో నిర్మితమై సుమారు 95 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ గాలి గోపురంపై భాగాన బంగారు పూత పూసిన 7 కలశములు ఉంటాయి. సా.శ. 7,8 శతాబ్దాల్లో సింహపురిని పాలించిన పల్లవ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది. తదనంతరం రాజరాజనరేంద్రుడు, ఉభయ కుళోత్తుంగ ఛోళుడు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లుగా తెలుస్తోంది.
శ్రీరంగం తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన శ్రీ తల్పగిరి రంగనాయకుని ప్రధానాలయం పశ్చిమాభి ముఖంగా ఉంటుంది. ఆలయంకు పశ్చిమ వైపున పెన్నా నది ప్రవహిస్తోంది. భక్తులు పెన్నా నదిలో స్నానం చేసి దైవ దర్శనానికి బయలుదేరుతారు. గర్భాలయంలోకి దక్షిణ ద్వారం నుంచి ప్రవేశించాలి. గర్భాలయంలో శేషతల్పంపై శయనముద్రలో శీరంగనాథుడు నయన మనోహరంగా దర్శనమిస్తాడు. స్వామి పాదాల వద్ద శ్రీదేవి, భూదేవిని దర్శించవచ్చును. ప్రదక్షిణ మండపంలో ఉత్తర భాగంలో శ్రీ రంగనాథుని పాదాలు, శ్రీ అనంత పద్మనాభ స్వామిని కూడా దర్శించుకోవచ్చు.
ఇతర ఉపాలయాలు
ఆలయ ప్రాంగణంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, ఆళ్వారుల విగ్రహాలు, గరుడాళ్వార్ ఆలయం, గోదాదేవి ఆలయం, అద్దాల మండపం వంటివి దర్శించుకోవచ్చు.
పూజోత్సవాలు
తల్పగిరి శ్రీ రంగనాథస్వామి ఆలయంలో ప్రతిరోజూ సుప్రభాతం మొదలుకొని ఏకాంతసేవ వరకు అన్ని ఉత్సవాలు శ్రీవైష్ణవ ఆగమ శాస్త్రానుసారంగా జరుగుతాయి. ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారి ఉత్తర ద్వారా దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. అలాగే ధనుర్మాసంలో 30 రోజులపాటు స్వామివారికి తిరుప్పావై ఘనంగా జరుగుతుంది. అలాగే ధనుర్మాసం చివరి రోజు జరిగే గోదా కల్యాణం వీక్షించడానికి రెండు కళ్ళూ సరిపోవు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుంచి స్వామి వారికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరునాళ్ళు పేరిట జరిగే జాతర కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు విశేషంగా తరలివస్తారు. శ్రీ మహావిష్ణువు రంగనాథుడుగా అవతరిస్తే ఆయనకు తల్పంగా అంటే పాన్పుగా ఆదిశేషుడే ఇక్కడ వెలిశాడని పురాణ వచనం. రంగనాథుని దర్శిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని, అవివాహితులకు శీఘ్రముగా వివాహం జరుగుతుందని విశ్వాసం.
- మహాకవి తిక్కన ఈ దేవాలయంలోనే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు.
- ఈ దేవాలయంలోని అద్దాల మండపం ఇక్కడికి వచ్చే భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ అద్దాల మండపంలో సీలింగ్ కు చిత్రించిన శ్రీ కృష్ణుని తైల వర్ణ చిత్రం మనం ఎటువైపు నిలబడి చూసినా మనవైపే చూస్తున్నట్లుగా మనల్ని మంత్ర ముగ్ధులను చేస్తుంది.
ఆలయ వేళలు :
ఉదయం 6:30 నుంచి 12 గంటలు తిరిగి సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8 గంటలు వరకు.
ఎలా వెళ్ళాలి :
నెల్లూరు బస్టాండ్ / రైల్వే స్టేషన్ నుండి 4 కి.మీ
చుట్టూ ప్రక్కల దర్శించవలసిన ఆలయాలు :
జొన్నవాడ మల్లికార్జున స్వామి ఆలయం - 14 కి.మీ
వేదగిరి నరసింహ స్వామి ఆలయం - 12 కి.మీ
నెల్లూరు మూలస్థానేశ్వర స్వామి ఆలయం - 4 కి.మీ
Comments
Post a Comment