మాఘ పురాణం పదహారవ అధ్యాయం
శ్రీహరి పరమశివుని గొప్పతనాన్ని వివరించుట
బ్రహ్మ మహేశ్వరుల కలహాన్ని తీరుస్తూ శ్రీహరి ముందుగా బ్రహ్మ గొప్పతనాన్ని తెలియజేసిన తర్వాత పరమ శివుని వంక చూస్తూ "ఓ మహేశ్వరా! సూర్యచంద్రులు రెండు నేత్రాలుగా, అగ్ని మూడో నేత్రంగా భాసిల్లే నువ్వు యోగీశ్వరులందరికి పూజనీయుడవు. అసలు నీకు నాకు ఎలాంటి భేదం లేదు నేనే నువ్వు! నువ్వే నేను! నువ్వు శాశ్వత పరబ్రహ్మ స్వరూపుడవు! ఈ లోకమంతటా వ్యాపించిఉన్న సూక్ష్మరూపుడవు...
శివుడే ప్రణవ స్వరూపం
"ఓ రుద్రసంభూతా! నీవు ప్రణవ స్వరూపం. ఈ చరాచరజగత్తును లయం చేసే లయకారుడవు. గతంలో నీ దర్శనం కోరి నారదుడు తపస్సు చేసినప్పుడు నువ్వు నారదునికి ప్రత్యక్షమయ్యావు. అప్పుడు నారదుడు నిన్ను స్తుతిస్తూ చేసిన స్తోత్రం యోగిపుంగవులకు, మునీశ్వరులకు స్తోత్రనీయమైనది. రజోగుణ ప్రభావం చేత నీకు బ్రహ్మకు కలహం ఏర్పడింది. ఇక మీరు ఈ కలహాన్ని వీడండి. మీరు ఇద్దరు ఎవరికి వారు గొప్పవారే! కావున మీ కలహమును కట్టిపెట్టి సఖ్యంగా ఉండండి". అన్న శ్రీహరి మాటలకు బ్రహ్మ శివుడు తమ కలహమును వీడి వారి వారి స్వస్థానాలకు వెళ్లిపోయారు.
గృత్స్నమదమహర్షి జహ్నువుతో "జహ్నువు! మాఘ మాసంలో శ్రీహరి తెలియజేసిన బ్రహ్మ మహేశ్వరుల గొప్పతనాన్ని తెలిపే మాఘపురాణంలోని ఈ అధ్యాయాన్ని చదివిన వారు, విన్నవారు విష్ణు సన్నిధానమును చేరుతారు" అంటూ గృత్స్నమదమహర్షి పదహారవ అధ్యాయాన్ని ముగించాడు.
ఇతి స్కాందపురాణే! మాఘమాస మహాత్యే! షోడశాధ్యాయ సమాప్తః
No comments:
Post a Comment