Magha Puranam Telugu: మాఘ పురాణం 29వ అధ్యాయం - కోడల్ని హింసించి సర్పాలుగా మారిన క్రూర దంపతులు- మాఘ వ్రతంలో మోక్షం ప్రాప్తి


 గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షుల సంవాదం

గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షితో "ఓ జహ్నువూ! మాఘమాస వ్రతమహాత్యాన్ని వివరించే మరో కథను చెబుతున్నావు శ్రద్ధగా వినుము" అంటూ మాఘ పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయమును ఈ విధంగా చెప్పసాగెను.

శూద్ర దంపతుల కథ

ద్వాపరయుగంలో విదేహదేశమందు క్రూర అనే పేరుగల ఓ శూద్ర స్త్రీ ఉండేది. ఆమె ఒక రైతు భార్య. మిక్కిలి కోపస్వభావం కలిగిన ఆమె మిక్కిలి పరాక్రమవంతురాలు కూడా! ఆ దంపతులకు సదాచారుడై, సర్వభూతములయందు దయ కలిగిన పుణ్యమూర్తి అయిన ఓ కుమారుడు ఉండేవాడు ఇతనికి నిత్యం భర్త అత్తమామలను సేవిస్తూ, దైవభక్తి పరాయణురాలై మహాపతివ్రత అయిన భార్య ఉండేది.

కోడలిపై క్రూర దాష్టీకం

అత్త అయిన క్రూర తన భర్తతో కలిసి ప్రతినిత్యం అకారణంగా తన కోడలిని తిడుతూ, కొడుతూ హింసిస్తూ ఉండేది. అత్తమామలు పెట్టే హింసలు భరిస్తూ కూడా ఆ కోడలు మౌనంగా ఉంటూ అత్తమామలకు, భర్తకు సేవలు చేస్తుండేది. ఆమె భర్త కూడా తల్లిదండ్రులకు ఎదురు చెప్పలేక మౌనంగా ఉండేవాడు.

తల్లిదండ్రులకు హితోపదేశం చేసిన కుమారుడు

ఒకనాడు తన తల్లిదండ్రులు తన భార్యను పెట్టే బాధలు చూడలేక క్రూర కుమారుడు తన తల్లిదండ్రులతో "తల్లీ! తండ్రీ! మీకు నమస్కారం! నా భార్య ఏమి నేరం చేసిందని ఆమెను ఇలా హింసిస్తున్నారు? ఒక్కరోజు కూడా ఆమె చేసే సేవలలో లోపం లేదు కదా! నిత్యం కలహించుకుంటూ ఉండడం వల్ల ఏమి సాధిస్తారు? కలహాల వల్ల సర్వ సంపదలు నశించిపోతాయి. ఇంటి కోడలిని హింసిస్తే పుట్టగతులు ఉండవు. ఈ విషయం మీకు తెలియదా! ఎందుకు ఇలాంటి పాపానికి ఒడిగడుతున్నారు? ఇకనైనా మీ కలహాలు మాని కోడలిని ప్రేమగా చూసుకోండి" అని హితోక్తులు పలికిన కుమారుని మాటలకు ఆ క్రూరకు ఆగ్రహం వచ్చింది.

కోడలిని బంధించిన క్రూర

పట్టరాని ఆగ్రహంతో ఆ క్రూర కుమారుని ఏమీ అనలేక కోడలిని దూషిస్తూ, విపరీతంగా కొట్టి ఒక గదిలో బంధించివేసింది. జరిగినదంతా చూసి కూడా కుమారుడు ఏమీ అనలేక నిస్సహాయుడై కోపాన్ని నిగ్రహించుకొని తనలో తాను ఇలా అనుకున్నాడు. "తల్లిదండ్రులను తిట్టువాడు మరల జన్మలేని మహానరకంలో పడిఉంటాడు. స్త్రీకి భర్తయే దైవం. కానీ పురుషులకు తల్లిదండ్రులను సేవించడం వలననే మోక్షం వస్తుంది. కాబట్టి ప్రస్తుతం నేను నా తల్లిదండ్రులకు ఎదురుచెప్పడం మంచికాదు" అని మిన్నకుండెను. కానీ అతనికి మాత్రం బంధించబడిన భార్య ఎలా ఉందో అని విచారంగా ఉండేది.

కోడలి దిక్కులేని చావు

క్రూర మాత్రం కోడలిని గదిలో బంధించి ఆమె నీరు, ఆహరం ఇవ్వకుండా ఎవరిని గదిలోకి వెళ్లనీకుండా కఠినంగా వ్యవహరించింది. ఇలా ఏడు రోజులు గడిచాయి. ఏడవరోజు ఆ కోడలు తీవ్రమైన దుఃఖంతో, తిండి నీరు లేక శుష్కించి మరణించింది. ఆ కుమారుడు మాత్రం తల్లికి భయపడి భార్య గదిలోకి వెళ్లలేకపోతాడు. చివరకు ఎలాగో ధైర్యం చేసి 12వ రోజు తల్లికి తెలియకుండా గది తలుపులు తెరచి చూసేసరికి భార్య మరణించి ఉంది.

క్రూర కపట ఏడుపు

భార్య మరణంతో తీవ్రమైన దుఃఖంతో ఆ కుమారుడు మూర్చిల్లుతాడు. అప్పుడు క్రూర వచ్చి ఏడుపు రాకపోయినా కుమారుని ముందు కపట ఏడుపులు ఏడవడం మొదలు పెట్టింది. బంధువులు మిత్రుల అందరు వచ్చి చూసి క్రూరను అనేక రకాలుగా నిందిస్తారు. ఆ కుమారుడు దుఃఖంతో ఎలాగో భార్యకు దహన సంస్కారాలు నిర్వహిస్తాడు.

శ్రీహరిని చేరిన కుమారుడు

భార్య మరణంతో వైరాగ్యం చెందిన ఆ కుమారుడు ఇల్లు విడిచి గంగాతీరానికి చేరుకుంటాడు. కొంతకాలం అక్కడే గడిపి చివరకు మరణించి శ్రీహరి సాయుజ్యాన్ని చేరుకుంటాడు.

నరకానికి చేరిన క్రూర దంపతులు

ఇక్కడ క్రూర అతని భర్త బంధువులచే అనేక నిందలు పడి కుమారుని మరణం గురించి తెలిసి పుత్రశోకంతో కుమిలిపోతూ ఆదరించే వారు లేక దిక్కులేని చావు చస్తారు. చివరకు యమదూతలు వచ్చి ఆ క్రూర దంపతులను నరకానికి తీసుకెళ్లారు.

సర్పాలుగా జన్మించిన శూద్ర దంపతులు

శూద్ర దంపతలు నరకంలో 64 యుగాల పాటు భయంకరమైన నరకబాధలు అనుభవించి తరువాత భూలోకంలో సర్పములై జన్మించి చంపానదీ తీరంలోని ఒక రావిచెట్టు తొర్రలో నివసిస్తూండేవారు.

రావిచెట్టు కింద మాఘవ్రతాన్ని ఆచరించిన సాధువులు

ఒకానొక మాఘమాసంలో ధీరుడు, ఉపధీరుడు అనే ఇద్దరు సాధువులు చంపనదిలో మాఘ స్నానం చేసి ఆ రావిచెట్టు కింద మంటపాన్ని ఏర్పరచి శ్రీహరిని ఫలపుష్పాలతో పూజించారు. అనంతరం మాఘపురాణాన్ని ఆ సాధువులు తమ శిష్యులకు వినిపించసాగారు.

క్రూర దంపతులకు మోక్షం

రావిచెట్టు తొర్రలో సర్ప జన్మలో ఉన్న శూద్ర దంపతులు మాఘ పురాణ ప్రవచనాన్ని సాధువుల ద్వారా విని వారి సర్ప రూపాలను విడిచి దివ్యమైన దేహాలను ధరించి వెంటనే చంపానదిలో మాఘ స్నానం చేసి శ్రీహరిని పూజించి దివ్యమైన పుష్పక విమానాన్ని ఎక్కి వైకుంఠాన్ని చేరుకుంటారు. ఈ విధంగా మాఘవ్రత మహత్యంతో ఆ శూద్ర దంపతులకు నీచ జన్మల నుంచి విముక్తి కలిగింది.

గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షుల సంవాదం

చూసావుగా జహ్నువూ! మాఘ మాసంలో చేసే నదీ స్నానం, శ్రీహరి పూజ, మాఘ పురాణ శ్రవణం ఎంతటి పాపాలనైనా పోగొట్టి పవిత్రులను చేస్తుంది అని చెబుతూ ఇరవై తొమ్మిదో అధ్యాయాన్ని ముగించాడు.

ఇతి స్కాందపురాణే! మాఘమాస మహాత్యే! అష్టావింశాధ్యాయ సమాప్తః

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి