ఏలూరు పట్టణం నుంచి 42 కిలోమీటర్ల దూరంలోనున్న శేషాద్రి కొండపైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు "ద్వారకా తిరుమల"లో కొలువుదీరి ఉన్నారు. ఇక్కడ శ్రీనివాసుడు స్వయంభువుగా వెలసినందున ఈ ప్రాంతాన్ని చిన్న తిరుపతి అని పిలుస్తారు. అలాగే ఏ కారణం చేతనైనా తిరుమల వెళ్ళి మొక్కులు చెల్లించుకోలేని వారు ద్వారకా తిరుమలలో మొక్కులు చెల్లించుకోవచ్చు.
ద్వారకుని తపస్సు - దక్షిణముఖంగా వెలసిన స్వామి
ఆలయ స్థల పురాణం ప్రకారం ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామి వారి పాద సేవను కోరారట. దాంతో స్వామి వారి పాదాలు మాత్రమే పూజించే భాగ్యం అతడికి దక్కింది. అందుకే మనకు నేడు స్వామి వారిపై భాగం మాత్రమే దర్శనమిస్తుంది. ద్వారకుడు ఉత్తరాభి ముఖుడై తపస్సు చేశాడట. అయితే ఆ మునికి ప్రత్యక్షమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు దక్షిణాభి ముఖుడై ఉన్నాడట. అందుకనే ఈ ఆలయంలో మూలవిరాట్టు దక్షిణ ముఖంగా ఉండటం విశేషంగా చెప్పవచ్చు. అలాగే ఒకే విమాన శిఖరం క్రింద రెండు విగ్రహాలు ఉండటం ఇక్కడి మరో విశేషం. ఒక విగ్రహం సంపూర్ణమైనదిగా, రెండవది స్వామి వారిపై భాగం మాత్రమే కనిపించేటట్లుగా ఉండే అర్థ విగ్రహం ఉంటుంది.
రామానుజాచార్య ప్రతిష్టిత ధృవ మూర్తి
విశిష్టాద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి భక్తులందరి విన్నపాలను స్వీకరించి, స్వామికి పాద పూజ చేసుకొనే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త ధృవ మూర్తికి వెనుకవైపు పీఠంపై వైఖానస ఆగమ ప్రకారం ప్రతిష్టించారని చెబుతుంటారు.
మోక్షం కోసం ఒకటి- పురుషార్ధాలు కోసం మరోటి
స్వయంభువుగా వెలసిన, అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే శ్రీ వేంకటేశ్వర ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందని, ఆ తరువాత ప్రతిష్టించిన పూర్తిగా కనిపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్థ కామ పురుషార్ధములు సమకూరుతాయని భక్తుల విశ్వాసం.
ఆలయ స్థల పురాణం
బ్రహ్మపురాణం ఆధారంగా, శ్రీరామచంద్రుడి తాతగారు అజమహారాజు తన వివాహం కోసం స్వామివారిని సేవించారు. ఆయన ఇందుమతి స్వయంవరానికి వెళ్తూ మార్గమధ్యంలో ఉన్న ద్వారకా తిరుమలలో ఆగి స్వామివారిని దర్శించుకోకుండానే వెళ్లిపోయారట. ఇందుమతి అజ మహారాజును పెళ్లి చేసుకున్నప్పటికీ, స్వయంవరానికి వచ్చిన ఇతర రాజులు ఆయనపై దాడి చేస్తారు.
తాను మార్గమధ్యలో స్వామివారిని దర్శించుకోకుండా వెళ్లినందుకే ఇలా జరిగిందని భావించిన అజమహారాజు శ్రీ వేంకటేశ్వరుని క్షమించమని ప్రార్థిస్తాడు. అంతటితో ఆ అలజడి ఆగిపోయిందట. అత్యంత ప్రాచీన చరిత్రగల ఈ ఆలయం కృతయుగం నుంచి ఉందనేందుకు ఇదో చక్కని నిదర్శనంగా చెప్పవచ్చు.
అభిషేకాలు లేని స్వామి
ఈ ఆలయంలో స్వామికి అభిషేకాలు జరపరు. ఎందుకంటే, స్వామివారిపై ఒక చిన్న నీటి బొట్టు పడినా అది స్వామి వారి విగ్రహం క్రింద ఉండే ఎర్ర చీమలను కదుల్చుతుందని అభిషేకం చేయరు.
ఏడాదికి రెండుసార్లు కల్యాణోత్సవం
గుడి సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ, ఆశ్వయుజ మాసాలలో రెండు కళ్యాణోత్సవాలు జరుపుతుంటారు. ఎందుకంటే స్వామి వారు స్వయంభువుగా వైశాఖ మాసంలో దర్శనమిచ్చారనీ, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజ మాసంలో ప్రతిష్టించిన కారణంగా అలా చేస్తుంటారు.
ఆలయ విశేషాలు
ఆలయంలోకి ప్రవేశించగానే కళ్యాణ మండపం వస్తుంది. ప్రధాన ద్వారం లోపలి రెండువైపులా, గర్భగుడికి అభిముఖంగా ద్వారకా ముని, అన్నమాచార్యుల విగ్రహాలున్నాయి. ద్వారం లోపలి పై భాగాన సప్తర్షుల విగ్రహాలు, గర్భగుడి చుట్టూ ఉండే ప్రదక్షిణ మార్గం వెంట ప్రహరీని ఆనుకుని 12 మంది ఆళ్వారుల ప్రతిమలు ఉన్నాయి.
శ్రీనివాసుని సుందర విగ్రహాలు
గర్భగుడిలో స్వయంభువు శ్రీ వేంకటేశ్వర స్వామి అర్ధ విగ్రహం, రామానుజులు ప్రతిష్టించిన వేంకటేశ్వరస్వామి ప్రతిమలు కన్నులపండువగా దర్శనమిస్తాయి. ఆ ప్రక్కనే కుడివైపు అర్ధ మంటపంలో తూర్పు ముఖంగా మంగతాయారు, ఆండాళ్ అమ్మవార్లు కొలువై ఉన్నారు. శుక్రవారం అమ్మవార్లకు విశేష కుంకుమ పూజను నిర్వహిస్తుంటారు.
స్వామి పుష్కరిణి
ఆలయం పశ్చిమాన స్వామివారి పుష్కరిణి ఉంది. దీనిని సుదర్శన పుష్కరిణి అని అంటారు. ఈ దేవస్థానంలో నిత్యాన్నదానం, గోసంరక్షణ పథకాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మ పురాణం ప్రకారం కృష్ణ, గోదావరి నదులతో పవిత్రమైన ఈ క్షేత్రం చాలా ప్రభావవంతమైనది. అందుకే స్వామివారి కటాక్ష వీక్షణాలకై దూర ప్రాంతాల నుంచి భక్తులు ద్వారకా తిరుమలకు తరలివస్తుంటారు.
తిరుమల మొక్కు ఇక్కడ
తిరుమల స్వామి వారికి మ్రొక్కిన మ్రొక్కును చిన్న తిరుపతిలో తీర్చుకున్నా అది తీరినట్లే అని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడ స్వామివారిని కలియుగ వైకుంఠ వాసునిగా భావించి తిరుపతికి వెళ్లలేని భక్తులు తమ ముడుపులను, తలనీలాలను, మొక్కుబడులను ఇక్కడ సమర్పిస్తే తిరుపతి స్వామివారికి చెందుతాయని భావిస్తారు.
Comments
Post a Comment