మానవ జీవితం ముఖ్యంగా ప్రకృతిపై ఆధారపడి వుంటుంది. ఈ ప్రకృతిలోని మార్పులను జ్యోతిషశాస్త్రం ఆధారంగా గుర్తించి, గ్రహ నక్షత్రాదుల ప్రభావాలను పరిశీలిస్తూ, కాలానుగతికమైన పండుగలను ధర్మశాస్త్రం నిర్ణయిస్తుంది. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకోవడం పండుగల ఏర్పాటులో ముఖ్యమైన ఉద్దేశం. నోములు, వ్రతాలు, ఉత్సవాలు, పర్వాలు, పండుగలు అంటూ వాటికి మనం పేర్లు పెట్టుకుంటున్నాం. ఈ దేశంలో సంవత్సరం మొత్తం ఏదో రూపంలో ఏదో ఒక పర్వం నిర్వహిస్తూనే వుంటారు.
పండుగలు జరుపడంలో మహిళల దే ప్రముఖ పాత్ర. మహిళలు అధికసంఖ్యలో ఐకమత్యంతో పాల్గొని చురుకుగా చేసే పండుగల్లో బోనాలు, బతుకమ్మ, గొబ్బెమ్మ లు అగ్రస్థానంలో నిలుస్తాయ. శ్రావణమంగళ, శుక్రవారాల్లో నోచే నోములకూ ప్రముఖస్థానమే.
మాసాలపరంగా ఆలోచిస్తే మన పండుగల్లో మొట్టమొదటి చైత్రశుద్ధ పాడ్యమినాడు నిర్వహించే 'ఉగాది' పండుగ. తెలుగువారికే ఇది ప్రత్యేకమైన పండుగ. ఈరోజు ఆరు రుచులతో కూడుకున్న వేపపువ్వు పచ్చడిని ఆరగించిన తర్వాతనే మిగిలిన పనులు ప్రారంభిస్తాము. ప్రకృతికి నమస్కరించే తెలుగువారి మొదటి పండుగ ఇది.
సంక్రాంతి తెలుగువారు నిర్వహించుకునే మరో ప్రత్యేకమైన ప్రకృతికి అనుగుణమైన ఉత్సవం. సూర్యుని సంక్రమణాన్ని అందులోను ఉత్తరాయంన్ని ఆనందించే పండుగ ఇది. ఆంధ్ర, తెలంగాణలోను ముగ్గులతో గృహ ప్రాంగణం అలంకరించుకోవడం, గంగిరెద్దుల సంబరాలు, కోళ్ల పందేలు, పతంగులు ఏగరేయడం చేస్తారు. పత్తి, నూనె, నెయ్యి, జీలకర్ర వంటి వస్తువులతో నోములు నోచుకుంటారు. భోగి మంటలు, గోదా కళ్యాణాలు, కనుమనాడు పశువులకు పూజ చేయడం తెలుగువారి సంప్రదాయంలోని వైశిష్ట్యం. శ్రావణ మాసంలో పూర్ణిమనాడు చేసుకునే ఉత్సవం రాఖీ పూర్ణిమ సోదరులకు వారి చెల్లెళ్లకు రాఖీలు కట్టి ఆత్మీయతను పంచుకుంటారు. ఇది కుటుంబ వాతావరణంలో ఆనందాన్ని, అనుబంధాన్ని పెంచడంవల్ల ఈ పండుగకు విశేషమైన గుర్తింపు తెలుగువారికి కూడా ఏర్పడింది.
హోళికోత్సవం ప్రకృతికి సంబంధించిన మరో గొప్ప ఉత్సవం. దీనిని వసంతోత్సవం అంటారు. రంగులు చల్లుకోవడం, ముందురోజు కామదహనం వుంటుంది. కాముడు అంటే మన్మథుని భావాలను అంటే కోరికలను దహనం చేసే విధానం ఈ పండుగలోని అంతరార్థం. ఈ పండుగలు కాక మిగిలిన పండుగల్లో పూర్తిగా దైవభావన మిళితమై వుంటుంది. శ్రీరామనవమి, హనుమత్ జయంతి, నృసింహ జయంతి, తొలి ఏకాదశి, వ్యాసపూర్ణిమ (గురుపూర్ణిమ), వినాయకచవితి, దసరా నవరాత్రి ఉత్సవాలు, దీపావళి, కార్తీక దీపోత్సవాలు, దత్త జయంతి, ముక్కోటి ఏకాదశి, రథసప్తమి మొదలైన ఉత్సవాలన్నీ దైవాలకు అనుబంధంగా నిర్వహించుకునే పండుగలు.
శ్రీరామనవమి చైత్రశుద్ధ నవమినాడు తెలంగాణలోని భద్రాచలంలో కళ్యాణోత్సవం, తెలుగు ప్రాంతాల్లో వాడవాడలా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. వసంత నవరాత్రుల చివరి రోజున శ్రీరాముని పూజించడం, ఆయన భావాలు స్వీకరించడం ఈ పండుగలో ముఖ్య ఉద్దేశం. హనుమత్ జయంతి చైత్ర పూర్ణిమనాడు నిర్వహిస్తారు.
వైశాఖ మాసంలో శుద్ధ చతుర్దశి నాడు నృహింహ జయంతి తెలుగు ప్రాంతాల్లో ముఖ్యంగా తెలంగాణలో అత్యధికంగా నృసింహ క్షేత్రాలుండడంవల్ల దేవాలయాలలో నిర్వహిస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణు దర్శనం చేస్తున్నారు. పవిత్ర నదుల్లో స్నానాలు చేయడం ఉపవాసాలుండడం తెలుగువారు నిర్వహిస్తున్న విధి. ఆషాఢ పూర్ణిమనాడు వ్యాసపూర్ణిమను గురుపూర్ణిమగా నిర్వహించి తమ గురువులను సన్మానిస్తూ, సాయిబాబా, దత్తాత్రేయ, దక్షిణామూర్తి, హయగ్రీవ స్వాములకు పూజలు నిర్వహిస్తారు.
ఆషాఢమాసంలో తెలంగాణలో బోనాల ఉత్సవాన్ని నిర్వహించి గ్రామదేవతలైన అమ్మవార్లకు నైవేద్యంగా భోజనాన్ని, తొట్టెలను సమర్పించడం పోతురాజు విన్యాసాలు నిర్వహిస్తారు. స్ర్తిలు సామూహికంగా బోనం కుండలను తలపై పెట్టుకుని వాటిపైన దీపాలు వుంచుకుని అమ్మవారికి గుడికి వెళతారు. శ్రావణమాసంలో స్ర్తిలు మంగళవారాల్లో మంగళగౌరీ వ్రతాలు, రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలను ఆనందంగా జరుపుకుంటారు. ఈ మాసంలో వనభోజనలకు వెళ్లే సంప్రదాయం కూడా వున్నది.
భాద్రపద మాసంలో శుద్ధ చవితినాడు వినాయకచవితి ఉత్సవాన్ని తెలుగు ప్రాంతాల్లో వైభవంగా నిర్వహిస్తారు. బాల గంగాధర్ తిలక్ ప్రభావంతో స్వాతంత్య్ర సమర కాలం నుంచి వాడవాడల్లో గణపతి హోమాలు, అన్నదానాలు భజనలు ఈ ఉత్సవంలో నిర్వహిస్తున్నారు. అనంత పద్మనాభ చతుర్దశినాడు వినాయక నిమజ్జనం కూడా ప్రత్యేక ఉత్సవంగా చేస్తున్నారు.
భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో పితృపక్షాలు నిర్వహించడం సంప్రదాయం. అమావాస్యనాడు మరణించిన పెద్దలకోసం అనేక రూపాల్లో బ్రాహ్మణులకు దానధర్మాలు ఆచరించే సంప్రదాయం తెలుగువారిలో కొనసాగుతున్నది. భాద్రపద మాసంలో అమావాస్యనాడే తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగ ఆడే సంప్రదాయం కనిపిస్తుంది. పుష్పాలతో బతుకమ్మను తయారుచేసి, దానిపై పసుపుతో గౌరమ్మను చేసిపెట్టి అందరూ ఒకచోట చేరి మధ్యలో వుంచి చుట్టూ తిరుగుతూ చేసే ఉత్సవం తెలంగాణకు తలమానికమైన పండుగ ఇది. ఒకరకంగా అరోమా థైనపీ (పుష్పవాసనలతో కూడిన వైద్యం. భాద్రపద అమావాస్య నుంచి ఆశ్వీజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) వరకు పండుగ నిర్వహిస్తారు. తొమ్మిదవ నాడు సద్దుల బతుకమ్మగా భావనచేసి 9 రకాల సద్దులను (పిండి వంటలను) నైవేద్యంగా సమర్పిస్తారు. గౌరమ్మకు స్వాగతం, వీడుకోలు ఈ తొమ్మిది రోజుల్లో చెబుతారు.
ఆశ్వీజ మాసం ప్రారంభం నుంచి తొమ్మిది రోజులు శరన్నవరాత్రులు తెలుగు ప్రాంతాల్లో నిర్వహించి చాలామంది దీక్షాపరులై అమ్మవారిని వేర్వేరు రూపాల్లో పూజిస్తారు. చండీహోమాలు, ఆయుధ పూజ, సామూహిక అన్నదానాలు, పదవరోజు పాలపిట్ట దర్శనం, జమ్మి చెట్టుకు పూజ చేస్తారు.
శివునికి ప్రీతికరమైన కార్తీక మాసంలో అభిషేకాదులు, దీపోత్సవాలు అన్ని ప్రాంతాల్లో ఆధ్యాత్మిక చైతన్య మాసంగా నిర్వహిస్తారు. గురువు ప్రాదాన్యం విస్తరించడంవల్ల దత్తాత్రేయ జయంతిని మార్గశిర పౌర్ణమి నాడు కోరల పూర్ణిమగా చేస్తారు. ఈరోజు దత్త ఆరాధన చేస్తారు. కొన్ని వంటకాలను కుక్కలకోసం చేసి పెడితే నరక బాధలుండవని ఒక భావన. జంతువులపై చూపే ప్రేమ కూడా ఈ పండుగలో అంతర్భాగమే.
కాల పరిణగణనలో తెలుగువారిది చాంద్రమానం. వైకుంఠ ఏకాదశి సౌరమానం ప్రకారం జరిపే పండుగ. ధనుర్మాసం మొదలైన తర్వాత శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా నిర్ణయిస్తారు. ఇది మార్గశిరంలో, పుష్యంలోగాని వస్తుంది. వైష్ణవులకు, రామానుజ, మాధ్వ మతస్తులకు ఇది చాలా ముఖ్యమైనది. ఉత్తర ద్వారం నుంచి వైకుంఠవాసుడైన విష్ణువు యొక్క రూప దర్శనంవల్ల మోక్షప్రాప్తి అనే భావనవల్ల ఈ పర్వదినాన్ని భక్తితో జరుపుకుంటారు. మాఘమాసంలో శ్రీపంచమి, రథసప్తమి, భీష్మైకాదశి, శ్రీపంచమిన అమ్మవారు పుట్టినరోజుగా భావించగా, రథసప్తమినాడు సూర్యునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భీష్మైకాదశినాడు విష్ణుపూజలు చేస్తారు. ఇక ఈ మాసంలో నిర్వహించే ఉత్సవం మహాశివరాత్రి. తెలుగువారు భక్తి శ్రద్ధలతో, ఉపవాసాలతో, రుద్రాభిషేకాలతో, జాగారాలతో శివుని కళ్యాణాలను నిర్వహిస్తారు.
ప్రకృతికి అనుగుణంగా జీవించడం, మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు దైవపూజలు నిరంతరం చేస్తుండడం, అందరితో ఆనందంగా గడపడం, అందరికీ పండుగల సమయాల్లో ఆహారాదులు, ధనం, వస్తువులను పంచుకుంటూ వుండడం, ఉన్నతిని కోరుకుంటూ వుండడం తెలుగువారి పండుగల నిర్వహణలో ముఖ్య ఉద్దేశం. ఆ ఆనందాన్ని మరింతగా కొనసాగిస్తూ, వానిలోని చిన్నచిన్న దోషాలను పరిహరిస్తూ ముందుకు వైజ్ఞానికంగా కొనసాగాలని ఆశిద్దాం.
Comments
Post a Comment