శ్రీ రంగనాథుడు నెలకొన్న దివ్య ఆలయం..దేశంలో ప్రసిద్ధి చెందిన వైష్ణవ ఆలయాల్లో ఒకటి. శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందిన శ్రీ రామానుజాచార్యులు ప్రతిష్టించిన విశిష్ట ఆలయం శ్రీరంగంలో రంగనాథుడు. 108 వైష్ణవ క్షేత్రాల్లో మొదటిదైన శ్రీరంగం..విష్ణు అంశతో జన్మించిన ఆళ్వారులకు నిలయం.
తమిళనాడు రాష్టం తిరుచురాపల్లి నుంచి సుమారు 12 కి.మీ దూరంలో ఉన్న శ్రీరంగం ప్రధాన రాజగోపురం 21 అంతస్తులు. 236 అడుగుల ఎత్తులో.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద రాజగోపురం ఉన్న ఆలయంగా వినతి కెక్కింది. ఇక్కడ రాజగోపురం బంగారంతో కప్పబడి ఉంటుంది. రాజగోపురంపై కనిపించే దేవతామూర్తుల శిల్పాలు భక్తిభావంతో కట్టిపడేస్తాయి. 156 ఎకరాల విస్తీర్ణంలో తూర్పు, పడమర, ఉత్తర దిశల్లో 3 రాజగోపురాలుగా విభజించారు.
సప్త ప్రాకారాలుగా నిర్మించిన శ్రీరంగ నాధుడి ఆలయంలో ఏడో ప్రాకారం దగ్గర ప్రధాన రాజగోపురం ఉంటుంది. ప్రధాన రాజగోపురాన్ని దాటి లోపలకు అడుగుపెడితే ఆలయ ప్రాంగణంలో 55 ఉపాలయాలు ఉంటాయి. శ్రీరంగంలో స్వామి వేద స్వరూపం కాబట్టి ఆ గోపురం వేద ప్రణవం. ఇక్కడుంటే ఏడు ప్రాకారాలు ఏడు ఊర్థ్వలోకాలకు..ఏడో ప్రాకారం భూలోకానికి సంకేతం. ఒకప్పుడు ఊరు మొత్తం ఈ 7 ప్రాకారాల లోపలే ఉండేది. ఒక్కో ప్రాకారానికి ఒక్కో పేరు..
మొదటి ప్రాకారం ధర్మవర్మన్ - సత్య లోకానికి గుర్తు
రెండో ప్రాకారం రాజమహేంద్ర చోళుడిది - తపోలోకానికి గుర్తు
మూడోది కులశేఖరుడి ప్రాకారం - జనోలోకానికి గుర్తు
నాలుగోది తిరుమంగై ప్రాకారం - మహర్లోకానికి గుర్తు
ఐదోది కిళి చోళుని ప్రాకారం - సువర్లోకానికి గుర్తు
ఆరోది త్రివిక్రమ చోళుడి ప్రాకారం - భువర్లోకానికి గుర్తు
ఏడో ప్రాకారం భూలోకానికి గుర్తు
దీర్ఘచతురశ్రాకారంలో ఉండే రంగమండపం ప్రాచీన వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ మండపంలోనే స్వామివారి వాహన మండపం కూడా ఉంది. రంగవిలాస మండపానికి చేరువలోనే శేషరాయ మండపం ఆ కాలం రాజసానికి దర్పణంగా నిలుస్తుంది. ఈ మండపానికి అభిముఖంగా వేయికాళ్ల మండపం అత్యద్భుతం. శేషరాయ మండపానికి పక్కనే ఉడయవరుల సన్నిధి, రామానుజుల సన్నిధి ఉంటాయి. రంగవిలాస మండపానికి ఎడమవైపు శ్రీ చక్ర తాళ్వార్ సన్నిధి ఉంది..ఇక్కడ స్వామిని దర్శించుకునే భక్తులు ఆలయ వెలుపల ఉన్న దీపాలు తీసుకెళ్లి స్వామి సన్నిధిలో వెలిగిస్తారు. ఈ మండపానికి సమీపంలోనే ప్రాంగణంలో పెద్ద వృక్షం ఉంది..సంతానం లేని స్త్రీలు ఈ చెట్టుకి ఊయల కడితే ఇంట్లో చిన్నారుల సందడి ఉంటుందని భక్తుల విశ్వాసం. శ్రీ వేణుగోపాలస్వామి వారి సన్నిధి పక్కనే రంగనాధుడి పాదరక్షలు భద్రపరిచారు.
శ్రీ రంగనాధుడి ఈ ఆలయంలో అమ్మవారిది శ్రీదేవి రూపం. స్వామివారికి అమ్మవారికి జరిగే నిత్యోత్సవాలకు నందనవనం నుంచి తీసుకొచ్చిన పుష్పాలను మాత్రమే వినియోగిస్తారు..ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన పూలను పూజకు అనుమతించరు.
ఏటా ఫాల్గుణమాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలు ఇక్కడ అత్యంత ప్రత్యేకం. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవారిని ఏక సింహాసనంపై వేంచేపు చేస్తారు. ఈ దృశ్యం ఏడాదికి ఓసారి మాత్రమే కనిపిస్తుంది.
శ్రీరంగంలో ఉండే పుష్కరిణి చుట్టూ గోడలపై వివిధ ఆకృతులతో నాగశిలలు, వాటి మధ్య శ్రీకృష్ణుడి లీలా విశేషాలు కనిపిస్తాయి. శ్రీరంగనాధుడి దర్శనం అత్యంత పుణ్యఫలం.. శ్రీ రంగాన్ని నిత్యం స్మరించని శ్రీ వైష్ణవుడు లేడు. రంగనాథుడి దర్శనం సకల పాప క్షయకరం, సర్వ శుభంకరం.
Comments
Post a Comment