- శివుని జ్ఞాన స్వరూపమే దక్షిణామూర్తి స్వరూపం.
- అందుకే జ్ఞానాన్ని కోరుకునే వారు దక్షిణామూర్తిని ఆశ్రయిస్తారు.
- వారంలోని ఐదవ రోజు, గురువారం బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది.
- ఏదైనా విద్యా ప్రయత్నాలను ప్రారంభించడానికి గురువారం శుభప్రదంగా భావిస్తారు.
- అనేక శైవక్షేత్రాలలో గురువారం నాడు దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు జరుగుతాయి.
- కొన్ని ఆలయ సంప్రదాయాలు పౌర్ణమి రాత్రులలో దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తాయి, ముఖ్యంగా గురు పూర్ణిమ రాత్రి దక్షిణామూర్తికి ఆరాధన సేవలకు తగిన సమయం.
జగద్గురువు దక్షిణామూర్తి
దక్షిణామూర్తి సకల జగద్గురు మూర్తి కనుక - స్వామి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుంది. ఐహికంగా - బుద్ధి శక్తిని వృద్ధి చేసి విద్యలను ఆనుగ్రహించే ఈ స్వామి పారమార్థికంగా తత్త్వ జ్ఞానాన్ని ప్రసాదించే దైవం.
ఆది గురువు
జ్ఞాన దక్షిణామూర్తి ఒక మర్రి చెట్టు కింద దక్షిణాభిముఖంగా కూర్చుని మనకు దర్శనమిస్తాడు. హిందూ గ్రంధాల ప్రకారం, ఒక వ్యక్తికి గురువు లేకుంటే, వారు దక్షిణామూర్తిని తమ గురువుగా భావించి పూజించవచ్చు.
దాక్షిణ్య భావం
ఏ దయవలన దుఃఖం పూర్తిగా నిర్మూలనమవుతుందో ఆ 'దయ'ను 'దాక్షిణ్యం' అంటారు. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే దాక్షిణ్యం భగవంతునికి మాత్రమే ఉంది. ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి. అన్ని దుఃఖాలకీ కారణం అజ్ఞానం. అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖవిమోచనం. ఆ అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన స్వరూపుని దాక్షిణ్య విగ్రహమే దక్షిణామూర్తి.
వశిష్టునికే గురువు
శ్రీరామునికి గురువుగా వ్యవహరించిన వశిష్ఠుడు కూడా తపస్సుతో దక్షిణామూర్తిని ప్రత్యక్షం చేసుకుని బ్రహ్మవిద్యను సంపాదించాడు. వశిష్ఠునకు దక్షిణామూర్తి సాక్షాత్కరించిన క్షేత్రమే 'శ్రీకాళహస్తి'. అందుకే ఇప్పటికీ ఆలయంలో ప్రవేశించగానే దక్షిణామూర్తి విగ్రహం కనబడుతుంది. ఇది జ్ఞానప్రధాన క్షేత్రం, ఇక్కడి శక్తి పేరు కూడా జ్ఞాన ప్రసూనాంబ కావడం విశేషం.
దక్షిణామూర్తి ఆలయాలు
ప్రతి శివాలయంలో దక్షిణామూర్తి విగ్రహాన్ని ప్రతిష్టించినప్పటికీ, దక్షిణామూర్తి ప్రధాన దైవంగా కొన్ని ఆలయాలు మాత్రమే ఉన్నాయి. దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి అయిన ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడైన దక్షిణామూర్తిగా విరాజిల్లుతున్నాడు. ఇది ఏకైక దక్షిణమూర్తి జ్యోతిర్లింగం కావడం వల్ల, ఇది శైవులకు జ్ఞాన క్షేత్రంగా ప్రాముఖ్యతను పొందింది.
ఆదిశంకర విరచిత దక్షిణామూర్తి స్తోత్రం
పరమ జ్ఞానమూర్తియైన ఈ ఆది గురువును స్తుతిస్తూ ఆదిశంకరులు రచించిన దక్షిణామూర్తి సోత్రము ఎంతో ప్రసిద్ధి చెందింది.
దక్షిణామూర్తి స్తోత్రం
'విశ్వం దర్పణ దృశ్యమాననగరీతుల్యం' అంటూ మొదలయ్యే దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పఠిస్తే జ్ఞానానికి లోటుండదని సాక్షాత్తూ ఆ ఆది శంకరులే సెలవిచ్చారు.
మృత్యుంజయుడు
దక్షిణామూర్తి దక్షిణాభిముఖంగా ఉంటాడు. సాధారణంగా దక్షిణ దిక్కు యమ స్థానం. అందుకే అకాల మృత్యు దోషాలు ఉన్నవారు, అప మృత్యు దోషాలతో బాధ పడేవారు, మొండి రోగాలతో జీవితంపై ఆశ వదిలేసుకున్నవారు దక్షిణామూర్తిని ఆశ్రయించి, ప్రతి గురువారం స్వామి సమక్షంలో దీపాన్ని వెలిగించి, దక్షిణామూర్తిని స్తోత్రాన్ని పఠిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం.
Comments
Post a Comment