కార్తీక మాస శుక్ల పక్ష అష్టమిని గోపాష్టమి అంటారు. ఈ రోజు కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఇది కృష్ణుడు గోవును పూజించిన శుభదినం. ఈ పవిత్ర దినం దీపావళి అమావాస్య ఎనిమిదో రోజున వస్తుంది. శ్రీకృష్ణుడు ఈ రోజున గోవుకు పూజ చేయడం మంచిదని తెలిపినట్టు పురాణాలు చెబుతున్నాయి. చెప్పడమే కాదు శ్రీకృష్ణుడు కూడా ఈ రోజున గోపూజలు చేసేవాడట.
గోవు పరదేవతా స్వరూపము. గోవులకు అధిష్ఠాన దేవత సురభీదేవి. కామధేనువు పరాశక్తియైన లక్ష్మీస్వరూపం. ఆవులో 33 కోట్ల దేవతలు కొలువైవుంటారు. గోవుకే 'మాత' అనే హోదాను ఇచ్చారు. అలాంటి అమ్మలాంటి గోమాతను పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పెద్దలు చెబుతారు.
గోపాష్టమి రోజున గోవులను శుభ్రమైన నీటితో కడిగి, పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. గోమాతకు అరటిపండ్లు నైవేద్యంగా పెట్టాలి. హారతులిచ్చి గోవు చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేయాలి. గోవు తోక భాగాన్ని స్పృశించి నమస్కరించాలి.
ఈ రోజున కృష్ణుడి వెంట ఆవులను అడవికి పంపినట్లు అనేక పురాణగాధలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున ఆవులను ప్రత్యేకంగా పూజించుకుంటారు.
గోవు సకల దేవతా స్వరూపం కనుక గోవును పూజిస్తే సకల దేవతలు తృప్తి చెందుతారు.
గోవులకు గోపాష్టమి రోజున గ్రాసం, ఆకుపచ్చని బఠాణీలు, గోధుమలను పెడితే అన్ని కోరికలు నెరవేరుతాయని శాస్త్ర వచనం. అమ్మలాంటి గోమాతను పూజించే వారికి అష్టశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతారు.
మాయాపూర్ దేవాలయం, బృందావనమ్ లో బ్యాంకే బిహర్జి దేవాలయం, మథుర లో శ్రీ కృష్ణ ఆలయాలలో గోపాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయి.
2024 తేదీ: నవంబర్ 09.
Comments
Post a Comment