శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దర్శనం తరువాత ఆలయ ప్రాంగణంలో ఉన్నది ఈ వృద్ధ మల్లికార్జున స్వామి ఉపాలయం. ఈ లింగం కొన్ని వేల సంవత్సరాల నాటిది అని చెబుతారు.
శ్రీశైలం ఆలయంలో వెలసిన వృద్ధ మల్లికార్జున స్వామికి రోజూ ఉ. 6.30 గంటలకు అభిషేకం జరుగుతుంది.
వృద్ధ మల్లికార్జున స్వామి పురాణ గాథ: పురాణ గాథల ప్రకారం ఒక రాజకుమారి శివుని భక్తురాలు. ఆమెకు శివునిపై అనురాగం పెరిగింది. శివుని వివాహం చేసుకోవాలనే ఆలోచన ఆమె మదిలో మెదిలింది. దీనితో రాజకుమారి శివలింగం వద్దనే ఎక్కువగా కాలం గడిపేది. ఒకరాతి శివుడు ఆమెకు కలలో దర్శనమిచ్చి తెల్లవారగానే ఒక నల్ల తేనెటీగ కనిపిస్తుందని, దాని వెంట బయలుదేరి రావాలని , తాను వచ్చే వరకు ఆ ఈగ ఎక్కడ ఆగితే అక్కడే ఉండాలని ఆదేశించాడు. మరుసటి ఉదయం రాజకుమారికి నల్లటి తేనెటీగ కనిపించింది. ఆమె దాని వెంట ప్రయాణం కట్టింది. ఈగ శ్రీశైలం కొండ చేరుకొని అక్కడ ఒక మల్లెపొదపై ఆగిపోయింది. దీనితో రాజకుమారి శివుని కోసం అక్కడే ఆగిపోయింది. ఆమె శివుని పూజిస్తూ రోజులు గడపసాగింది. అక్కడ కొందరు గిరిజనులు రాజకుమారికి రోజూ అన్నపానీయాలు సమకూర్చసాగారు.
చివరకు శివుడు రాజకుమారికి ఒక వృద్ధుని వేషంలో కనిపించాడు. తాను ఆమె కోసం వెదుకుతున్నానని చెప్పాడు. ఆమె అతనిని వివాహమాడింది. ఇంతకు మునుపు ఆమెకు ఆహారం సమకూర్చిన గిరిజనులు దంపతులను విందుకు ఆహ్వానించారు. వారు రాజకుమారికి, వృద్ధుని రూపంలో ఉన్న శివునికి మధువు, మాంసం సమకూర్చి ఆరగింపమని కోరగా శివుడు వాటిని తిరస్కరించాడు. రాజకుమారి వాటిని స్వీకరింపమని ఒత్తిడి చేసింది. దీనితో శివుడు ఆ స్థలం వదలి వెళ్లిపోయాడు..రాజకుమారి అతనిని పెక్కుమార్లు పిలిచినా అతడు వినిపించుకోలేదు. అప్పుడు ఆమె అతనిని రాయి కావాలని శపించింది. దీనితో శివుడు లింగాకారంతో శిల అయ్యాడు. శివుడు ముదుసలిగా మారి, వృద్ధ మల్లికార్జునుడయ్యాడు. రాజకుమారి చేసిన పనికి పార్వతి ఆగ్రహించి ఆమె ఈగ వెంట ఇక్కడికి వచ్చినందుకుగాను భ్రమరం (తూనీగ) కావాలని శపించింది.
Comments
Post a Comment