పొయిగై ఆళ్వారు ప్రస్తుత తమిళనాడు రాష్ట్రంలో చెన్నై నగరానికి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో దేవాలయాల నగరంగా, ప్రసిద్ధిచెందిన కాంచీపురంలో అవతరించారు.
వీరి తల్లిదండ్రులు ఎవరో, వీరి కులమేమిటో అనే విషయం తెలియదు. వీరిని అయోనిజుడిగా చెబుతారు.
కాంచీపురంలోని ఆలయాల్లో శ్రీ యోథత్కరీ స్వామివారి ఆలయం ఒకటి. ఈ ఆలయానికి 'తిరువెక్కా' అని పేరు. ఈ ఆలయానికి ఉత్తరం వైపున పుష్కరిణి వుంది. ఈ పుష్కరిణిలోని పద్మంలో పొయిగై ఆళ్వారు అవతరించినట్లు కథనం.
పొయిగై ఆళ్వారు ఈ పుష్కరిణిలో సిద్ధార్థినామ సంవత్సరం సౌరమాసమైన తులామాసంలో అంటే చాంద్రమాన ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్ష అష్టమి మంగళవారం నాడు శ్రవణానక్షత్రంలో పద్మంలో అవతరించాడు.
'పొయై' అంటే సరోవరం అని అర్థం. పుష్కరిణిని సరోవరం అని కూడా అంటారు. సరోవరంలో అవతరించిన ఆళ్వారు కనుక ఈయనకు పొయైగై ఆళ్వారు అనే పేరు వచ్చినట్లు కథనం. అంతేకాకుండా, సరోవరంలో ఆవిర్భవించిన వారు కావడం వల్ల వీరికి 'సరోయోగి', 'కాసోయోగి' అనే బిరుదులు వచ్చాయి. వీరు ఆళ్వారులలో మొదటి వారుగా చెప్పబడుతూ వుండటం వల్ల పొయైగై ఆళ్వారుకు 'ఆదియోగి' అనే పేరు కూడా బిరుద నామంగా ఏర్పడింది.
జ్ఞానముద్ర కలిగిన పొయై ఆళ్వారు విష్వక్సే నుల వారి శిష్యుడుగా చెప్పబడుతోంది. ఈయనకు విష్వక్సేనులవారే పంచసంస్కారాలను చేసినట్లు కథనం.
ముదలాళ్వారులుగా పేరుపొందిన ముగ్గురు ఆళ్వారులలో పొయ్ గై ఆళ్వారు ఒకరు. కాగా, పూదత్తాళ్వారు, పేయళ్వారులు మిగతా ఇద్దరు. వీరి ముగ్గురిని ముదళ్వారులు అనే పేరుతో పాటు మొదలాళ్వారులు, యోగిత్రం అని కూడా వ్యవహరి స్తారు. వీరు ముగ్గురు సమకాలీకులుగా చెప్ప బడతారు.
శ్రీ మహావిష్ణువు పంచాయుధాలలో ఒకటైన పాంచజన్య శంఖమే పొయ్ గై ఆళ్వారుగా అవతరించినట్లు కథనం. పొయ్న్గై ఆళ్వారు ఈ భూమండలంలో వున్న తిరువరంగం (శ్రీరంగం), తిరువెగ్కీ (శ్రీయధోక్త కారి స్వామి ఆలయం, కాంచీపురం), తిరేవేంగడం (తిరుమల) క్షేత్రాలు దర్శించి స్వామివార్లను కీర్తిస్తూ పాశురాలను రచించి మంగళాశాసనం చేశారు. అంతేకాకుండా పరలోకంలోని తిరుప్పార్కడల్, పరమపదాలను మనోనేత్రంతో దర్శించి, స్వామివారిని ప్రత్యక్షంగా సేవించి, పాశు రాలను రచించి మంగళాశాసనం చేశారు.
ఈవిధంగా పొయ్ గై ఆళ్వారు మొత్తం 100 పాశురాలను రచిం చారు. పొయ్ గై ఆళ్వారు రచించిన వంద పాశురాలు వున్న ప్రబంధానికి 'మొదల్ తిరువందాది' అని పేరు. "భూమిని ప్రమిదగా, సముద్రాన్ని నూనెగా, సూర్యుడిని దీపంగా చేసిన సుదర్శన చక్రాన్ని ఆయుధంగా ధరించిన శ్రియఃపతి శ్రీపాదారవిందాలకు, దుఃఖమయమైన ఈ భౌతికప్రపంచ సంసార నివృత్తి కోసం శబ్దమాలిక అయిన మొదటి తిరువందాదిని అలంకారంగా సమర్పిస్తున్నాను" అనే అర్ధం వచ్చే పావురంలో తిరువందాది రచన ప్రారంభమవుతుంది.
పొయిగై ఆళ్వారు దృష్టిలో పరమపదంలోని శ్రీ మహావిష్ణువుకు,దశావతారమూర్తులకు, దివ్యదేశాల్లో ఆవిర్భవించిన అర్చామూర్తులకుతేడా లేదు. అందువల్లనే, కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామిలో శ్రీ నరసింహస్వామిని, ముల్లోకాలను ఆక్రమించిన వామనుడిని, మారీచుడిని మట్టుపరిచిన శ్రీరామచంద్రమూర్తిని, శ్రీకృష్ణపరమాత్మను కూడా దర్శించిన పొయై ఆళ్వారు వివిధ భంగిమలలోవున్న శ్రీ మహావిష్ణువును దర్శించి, సేవించడం వల్ల కలిగే ఫలాలనుకూడా తన పాశురాల్లో వివరించారు.
సాధారణంగా శ్రీ మహావిష్ణువు వైష్ణవ దివ్యదేశాల్లో మూడు భంగిమలలో అర్చామూర్తులుగా కొలువుదీరి పూజలందుకుంటూ దర్శనమిస్తారు. శయనభంగిమలో, ఆసీన భంగిమలో, స్థానక భంగిమలో అంటే నిలుచున్న భంగిమలో కొలువుదీరి దర్శనమిస్తారు. ఈ భంగిమలలో కొలువు దీరి వున్న స్వాములను దర్శించడం వల్ల నిలుచుని చేసిన పాపం, కూర్చుని చేసిన పాపం, నడుస్తూ చేసిన పాపాలు నశిస్తాయని పొయై ఆళ్వారులు ప్రబోధించారు. అంటే దివ్యదేశాల దర్శనమే మానవులను ముముక్షువులను చేస్తుందని చాటిచెప్పిన ఆళ్వారు పొయై ఆళ్వారు.
ఆళ్వారును ప్రార్థించడం వల్ల శ్రీ మహావిష్ణువును ప్రార్థించిన ఫలం కలుగుతుందని కథనం. ఆళ్వారులను నిత్యం ప్రార్థించే శ్లోకాన్ని 'నిత్యతనియన్' అని పిలుస్తారు. అలాగే జన్మ నక్షత్రం నాడు ప్రార్థించే శ్లోకాన్ని 'తిరునక్షత్ర తనియన్' అని పిలుస్తారు.
Comments
Post a Comment