Margashira Vratam: మార్గశిర లక్ష్మివార వ్రతం

మార్గశిర మాసంలో వచ్చే గురువారం లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మివార వ్రతము అంటారు. ఈ పూజను ఆచరించడము సర్వశ్రేష్టము. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతమును ఆచరించుటవల్ల ఋణ సమస్యలు తొలగి, శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం.

మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయమునే నిద్రలేచి ఇళ్ళు శుభ్రం చేసి, తలస్నానం చేయవలెను. ప్రత్యేకించి పూజ ముగిసే వరకు, తలకు నూనే రాసుకొనుట, దువ్వుకోనుట చేయరాదు. చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహంను పూజకు సిద్ధం చేసుకోవాలి 

మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయవలెను. గణపతి పూజ అనంతరం, లక్ష్మీ అమ్మవారికి అధాంగ, షోడశోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి. నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి. మార్గశిర లక్ష్మీ పూజ, కథ చదువుకొని అక్షతలను శిరస్సున ధరించాలి. లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురవారం చేస్తారు. కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో లో వుంటాయి కానీ ఈ లక్ష్మి పూజ పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేయాలి అదే ఇక్కడ విశేషం.

మార్గశిర లక్ష్మివార వ్రతం సమయంలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యములు:

1 వ గురువారం - పులగం 

2 వ గురువారం - అట్లు, తిమ్మనం 

3 వ గురువారం - అప్పాలు, పరమాన్నము 

4 వ గురువారం - చిత్రాన్నం,గారెలు 

5 వ గురువారం - పూర్ణం బూరెలు

మార్గశిర లక్ష్మివార వ్రత కధ:

పూర్వం కళింగ దేశంలో ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి సుశీల అనే కుమార్తె ఉంది. ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో సవతి తల్లి వచ్చింది. ఆమెకు పుట్టిన సంతానాన్ని ఆడించమని సుశీలకు అప్పగించేది సవతి తల్లి. అందుకోసం బెల్లం ఇచ్చేది. ఆ సమయంలో సవతి తల్లి చేస్తున్న లక్ష్మీపూజను చూసిన సుశీల మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆకులు, పూలతో పూజచేసి..తనకి ఇచ్చిన బెల్లం నైవేద్యంగా సమర్పించేది. కొన్నాళ్లకి సుశీలకు పెళ్లి జరిగింది. తనతో పాటూ లక్ష్మీదేవి బొమ్మను కూడా పుట్టింటినుంచి తీుసుకెళ్లింది సుశీల. అప్పటినుంచి మెట్టినిల్లు వృద్ధి చెందింది కానీ పుట్టినిల్లు పూర్తిగా దారిద్ర్యంలో మునిగిపోయంది. విధిలేక సవతి తల్లి తన కుమారుడిని సుశీల ఇంటికి పంపించి ఏమైనా తీసుకురమ్మని చెప్పింది. 

పుట్టింటి పరిస్థితి తెలుసుకున్న సుశీల..సోదరుడు వచ్చిన ప్రతిసారీ బోలెడు వరహాలు ఇచ్చి పంపించేది. ఓసారి వెదురుకర్రలో పెట్టి వరహాలు ఇచ్చింది, మరోసారి మూటకట్టి..ఇంకోసారి గుమ్మడి పండు తీసుకొచ్చి దానిలోపల గుజ్జు తీసేసి వరహాలు నింపి పంపించింది. అయితే ప్రతిసారీ మార్గమధ్యలో సేదతీరుతున్న సమయంలోనో, చెరువులో నీళ్లు తాగేందుకు వెళ్లే సమయంలోనూ  ఆ ధనాన్ని పోగొట్టుకుని ఇంటికి చేరుకునేవాడు సుశీల సోదరుడు. ఈ పరిస్థితిలో మార్పు రాదేమో అని బాధపడిన సవతి తల్లి స్వయంగా కూతురి ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది. మార్గశిర గురువారం నోము నోచుకుంటే దారిద్ర్యం తీరిపోతుందని ఆమెకు చెప్పిన సుశీల..విధిగా నోమునోచుకుందాం అంది. పాటించాల్సిన నియమాలన్నీ చెప్పుకొచ్చింది..అన్నిటికీ సరే అందామె.

తెల్లవారేసరికి పిల్లలకు చద్దన్న పెడుతూ నోటిలో ఓ ముద్ద వేసుకుంది..ఆ వారం నోము నోచుకునే అదృష్టానికి దూరమైంది.

రెండోవారం పిల్లల తలకు నూనె రాస్తూ ఆ చేతిని రాసుకుంది...రెండో వారం నోము నోచుకునే అవకాశం లేకుండాపోయింది.

మూడోవారం ఏదో ఆటంకం వచ్చి వ్రతం చేసుకునే అవకాశం రాలేదు. మూడువారాలు కుమార్తె మాత్రమే నోము నోచుకుంది. ఇక నాలుగోవారం స్వయంగా రంగంలోకి దిగిన సుశీల..సవతి తల్లి ఎలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తలు తీసుకుని దగ్గరుండి లక్ష్మివారం వ్రతం పూర్తిచేయించింది. అయినప్పటికీ లక్ష్మీ  కటాక్షం సిద్ధించలేదు. 

అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నమస్కరించిన సుశీల..ఏం జరిగింది? నోము నోచినా కానీ కటాక్షం సిద్ధించలేదని బాధపడింది. అప్పుడు లక్ష్మీదేవి వాక్కులు వినిపించాయి. నీ చిన్నప్పుడు నా బొమ్మలతో ఆడుకుంటున్న సమయంలో నీ సవతి తల్లి చీపురుతో కొట్టింది. లక్ష్మీసమానురాలైన ఆడపిల్లను..లక్ష్మీరూపంగా భావించే చీపురుతో కొట్టడం వల్ల ఆ ఇంట సంపదలేదని చెప్పింది. క్షమించమని ప్రార్థించిన సుశీల.. మరోసారి తల్లితో భక్తిశ్రద్ధలతో వ్రతం చేయించింది. అప్పుడు ఆ ఇంట దారిద్ర్యం తీరిపోయి సిరిసంపదలు కలిగాయి.  

Comments

Popular posts from this blog

Puri Ratha Yatra: పూరీ జగన్నాధుని రథయాత్ర

Ashada Month 2025: ఆషాడ మాసం

Ashada Navratri 2025: ఆషాడ నవరాత్రి, వారాహి నవరాత్రి

Amrutha Lakshmi Vrat: అమృత లక్ష్మీ వ్రతం

Pandharpur Yatra 2025: పండరీపుర్ యాత్ర – భక్తి, ఐక్యతకు ప్రతిరూపం

Angaraka Chaturdasi: కృష్ణ అంగారక చతుర్దశి

Jyestha Amavasya: జ్యేష్ఠ అమావాస్య

Skanda Panchami: స్కంద పంచమి

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Srisailam Temple: శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం - శ్రీశైలం