Angaraka Chaturdasi: కృష్ణ అంగారక చతుర్దశి
బహుళ పక్షంలో వచ్చే చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వస్తే దానిని కృష్ణ అంగారక చతుర్దశిగా వ్యవహరిస్తారు. ఈ తిథికి సూర్యగ్రహణంతో సమానమైన శక్తి ఉంటుంది. సూర్యగ్రహణం రోజు స్నానం, దానం, పితృ కార్యాలు చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ తిథి రోజున స్నానం, దానం చేస్తే అలాంటి ఫలితాలే కలుగుతాయని పంచాంగకర్తలు చెబుతున్నారు.
కృష్ణ అంగారక చతుర్దశి రోజు రుణ విమోచన అంగారక స్తోత్రం చదివితే తీవ్రమైన అప్పులతో బాధపడుతున్నవారు ఆ బాధలనుండి ఉపశమనం పొందుతారు. చదవలేనివారు ఎవరితోనైన చదివించుకొని విన్నాకూడా ఎంత పెద్ద అప్పులైనా తీరిపోతాయి. “ఓం అం అంగారకాయ నమః" అనే మంత్రాన్ని స్మరించుకున్నా మంచి ఫలితాలుంటాయి.
ఇవి పాటించినా శుభమే:
కృష్ణ అంగారక చతుర్దశి రోజు స్నానం చేసే నీటిలో గంగాజలం కలిపి చేస్తే మంచిది. గంగాజలం లేకపోతే స్నానం చేసేటప్పుడు గంగను ఆవాహన చేసి స్నానం చేసినా మంచిదే. దానం చేసినా మంచి మంచి ఫలితాలుంటాయి. గ్రహ దోష తీవ్రత కూడా తగ్గుతుంది. ఆరోజున గోధుమలను దానం చేస్తే మరీ మంచిది.
ఈ తిథి రోజున యమధర్మరాజుకు తర్పణం ఇచ్చినా మంచి జరుగుతుంది. సూర్యునికైనా తర్పణం ఇవ్వవచ్చు.
ఈ రోజు కందులు దానం ఇస్తే సొంతింటి కల నెరవేరుతుంది. అలా కుదరని పక్షంలో కందులను నానబెట్టి. బెల్లం కలిపి గోమాతకు తినిపించినా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహ స్వామి ఆలయాలను దర్శిస్తే శ్రేష్ఠం. అలాగే సుబ్రహ్మణ్య అష్టకం చదివినా, నరసింహ కరావలంబం స్తోత్రం చదివినా విశేష ఫలితాలుంటాయి.
2025: జూన్ 24.
Comments
Post a Comment