ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోటకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో సామర్లకోట నుంచి అనవర్తికి వెళ్లే మార్గంలో బిక్కవోలు ఉంది.
9-10 శతాబ్దాలలో ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన చాళుక్యరాజుల రాజధాని నగరంగా బిక్కవోలు విరాజిల్లింది. ఈ సమయంలో బిక్కవోలుకు బిరుదాంకినవోలు, బిరుదాంకపురం అనే పేర్లు ఉండేవని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. బిరుదాంకినవోలు అనేది కాలక్రమంలో ప్రజల వాడుకలో మార్పు చెంది బిక్కవోలు అయింది.
స్థల పురాణం
పూర్వం ఈ ప్రాంతంలో ఒక మోతుబరి రైతు నివసిస్తుండేవాడు. వ్యవసాయం, పశుపాలన వంటి వృత్తులను నిర్వహిస్తూ పరోపకారం చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాదు. ఆయనకు ఆవులమంద ఒకటి ఉండేది. దానిని పశువుల కాపరి ఒకడు, ప్రతిరోజు పచ్చిక బయళ్లకు తోలుకొని పోయి మేపుకుని వస్తూ ఉండేవాడు. అందులో ఒక అవు మంద నుంచి విడిపోయి.. కొంతదూరం గడ్డి మేస్తూ వెళ్లి ఒక ఎత్తైన ప్రాంతానికి చేరుకొని పాలు జారవిడిచి తిరిగి మండలో వచ్చి కలిసేది, సాయంత్రం ఇల్లు చేరిన ఆవు ప్రతిరోజు పాలు ఇవ్వకపోవడంతో రైతుకు అనుమానం కలిగి ఆవును గమనించవలసినదిగా పశువుల కాపరికి తెలిపాడు. పశువుల కాపరి మరునాడు మేతకు ఆవులను తోలుకొని పోయి గమనించసాగాడు. కొద్దిసేపటికే ఆవు మంద వదిలి దూరంగా వెళ్లి ఒక చోట పాలు జారవిడవడం పశువుల కాపరి కంటపడింది. అవుల మందను సాయంత్రం తోలుకొని వచ్చిన పశువుల కాపరి జరిగిన విషయాన్నంతా యజమానికి వివరించాడు. మరుసటి రోజు ఉదయాన్నే కొందరు గ్రామస్తులను వెంటబెట్టుకొని యజమాని ఆవు పాలు జారవిడుస్తూ ఉన్న ప్రాంతానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలో ఆవు పాలు జారవిడుస్తూ ఉందంటే భూమిలోపల దేవతా విగ్రహం ఉంటుండని గ్రామస్తులంతా భావించారు. ఆ ప్రాంతంలో భూమిని తవ్వాలని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి భూమిని తవ్వగా శివలింగం ఒకటి కనిపించింది. దానిని బయటకు తీసి ప్రతిష్ఠించారు. అయితే ఆలయం కట్టే స్తోమత, ఆర్థిక స్థితిలేక ఆలయాన్ని నిర్మించలేకపోయారు. కానీ స్వామికి నీడగా ఉండడం కోసం ఒక పందిరి ఏర్పాటు చేశారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చివరికి ఆ ప్రాంతాన్ని పరిపాలించే మహారాజుకు తెలిసింది. స్వతహాగా దైవభక్తుడై నూటికి పైగా తాను సాధించిన విజయాలకు చిహ్నంగా ఆలయాలను
నిర్మింపజేసిన రాజు శివుడికి ఆలయాన్ని నిర్మించాలని భావించాడు. శుభముహూర్తాన వేదపండితుల చేత పూజాకార్యక్రమాన్ని జరిపించి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఆలయ నిర్మాణం కోసం తప్వుతూ ఉండగా ఒక పుట్ట బయటపడింది. దానిని తొలగించినా ఆ మరుసటి ఉదయానికే మళ్లీ పుట్ట ప్రత్యక్షమవుతూ ఉండేది. ఈ విధంగా అనేకసార్లు జరగడంతో చివరికి అదే గొప్ప మాహాత్యంగా భావించి పుట్ట అలాగే ఉంచి ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. మరోచోట పునాదుల కోసం తవ్వకాలు జరుగుతుండగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం, వినాయకుడి విగ్రహం బయటపడ్డాయి. వీటన్నిటికీ మహారాజు ఆలయాలను నిర్మించి ప్రతిష్ఠ చేసినట్లు స్థలపురాణం వెల్లడిస్తోంది. కాగా గోవు పాలు జారవిడిచిన ప్రాంతంలో శివుడు బయటపడడం వల్ల ఆయనకు గోలింగేశ్వరస్వామి అనే పేరు ఏర్పడింది. కాగా వినాయకుడు లక్ష్మీగణపతి పేరుతో పూజలు అందుకుంటున్నాడు. ఈ రకంగా బిక్కవోలులో లక్ష్మీగణపతి స్వయంభువుగా కొలువుదీరినట్లు స్థలపురాణం వెల్లడిస్తోంది.
బిక్కవోలులో విశాలమైన ప్రాంగణంలో ప్రాచీన కట్టడాలతో ఆలయం దర్శనమిస్తుంది. ప్రధానాలయం తూర్పుకు అభిముఖంగా ఉంది. ప్రధాన గర్భాలయంలో శ్రీ గోలింగేశ్వరస్వామి కొలువుదీరి పూజలందుకుంటుండగా లక్ష్మీగణపతి ఆగ్నేయ అభిముఖంగా కొలువుదీరి పూజలందుకుంటున్నాడు. కాగా ఒకప్పుడు చిన్నగా ఉన్న స్వామి రోజురోజుకూ పెరుగుతూ ప్రస్తుతం అరడుగులకు పైగా ఎత్తున్నాడని చెబుతారు. మహారాజఠీవి ఉట్టిపడేలా వెనుకకు కొద్దిగా అంటే అనుకుని కూర్చున్నట్లుగా వినాయకుడు దర్శనమిస్తారు. స్వామివారిని దర్శించి పూజించి మనసులో ఉన్న కోరికను విన్నవించుకుంటే త్వరలోనే అవి నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం
ఈ ఆలయంలో ప్రతి నెల ఉభయ చవిత రోజుల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో తొమ్మిది రోజులపాటు వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇంకా మహాశివరాత్రి, ఆశ్వయుజమాసంలో దేవీనవరాత్రుల సందర్భంగానూ ప్రత్యేక అలంకారాలు, ఉత్సవాలు జరుగుతాయి.
Comments
Post a Comment