గృత్స్నమద మహర్షి, జహ్ను మహర్షుల సంవాదం
గృత్స్నమదమహర్షి, జహ్ను మహర్షితో "జహ్నువు! సకల శాస్త్రాలు చదివిన విప్రుడు దుష్ట సాంగత్యం వలన ఎంతటి కష్టాలను అనుభవించాడో తెలిపే కిరాతుని కథను చెబుతాను జాగ్రత్తగా వినుము" అంటూ ఈ విధంగా చెప్పసాగాడు.
కిరాతుని కథ
పూర్వం కళింగ దేశంలో ఒక కిరాతుడు ఉండేవాడు. వాడు పరమ క్రూరుడు. ప్రతిరోజూ ఆయుధాలు ధరించి అడవికి వేటకు వెళ్లి అనేక జంతువులను వేటాడి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. ఈ విధంగా వాడు చాలా ధనం సంపాదించాడు. ఒకనాడు కిరాతుడు అడవిలో వేటలో నిమగ్నమై ఉన్న సమయంలో వేదవేదాంగ తత్వవిద్యా విశారదుడగు ఒక విప్రుడు ఆ అటవీమార్గంలో ప్రయాణిస్తూ మార్గమధ్యంలో ప్రయాణ బడలిక తీర్చుకోడానికి ఒక మర్రిచెట్టు నీడలో కూర్చుని ఉండెను. కిరాతుడు విప్రుని చూసి అతని వద్ద ఉన్న వస్త్రములు, దండకమండలాలు, పాదుకలు, గొడుగు మొదలగు వస్తువులను అపహరించి ఇంకా విప్రునితో ఇట్లనెను. "ఓ బ్రాహ్మణుడా! నీ వద్ద ఉన్న ధనం మొత్తం నాకు ఇవ్వు లేకుంటే ఈ కత్తితో నిన్ను చంపేస్తాను" అని బెదిరించాడు.
బ్రాహ్మణ హత్య చేసిన కిరాతుడు
కిరాతుని మాటలకు బ్రాహ్మణుడు "అయ్యా! నేను చాలా పేదవాడిని. ఇప్పటికే నా దగ్గర ఉన్న అన్ని వస్తువులు తీసుకున్నావు. నా దగ్గర కొంచెం కూడా ధనం లేదని" చెప్పగా, అందుకు ఆ కిరాతుడు ఆగ్రహించి తన వద్ద ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుని శిరస్సు ఖండించాడు.
కంసాలి దుష్ట సాంగత్యం
ఇలా ఉండగా కిరాతుడు ఉండే ఊరిలో ఓ కంసాలి ఉండేవాడు. అతడు ప్రజలకు ఆభరణాలు చేసి ఇచ్చే క్రమంలో వారి నుంచి అన్యాయంగా బంగారాన్ని దొంగిలిస్తూ మోసం చేస్తూ విపరీతంగా డబ్బు సంపాదించాడు. కిరాతుడు దొంగిలించిన బంగారం కూడా ఈ కంసాలి కొంటూ, వాడిని కూడా ఎంతో కొంత మోసం చేస్తుండేవాడు. ఈ విధంగా ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. అదే ఊరిలో ధనవంతుడు, స్త్రీ లోలుడు, ధర్మహీనుడైన ఓ శూద్రుడు కూడా ఉండేవాడు. ఈ శూద్రుడు వేశ్యాలోలుడు, కామాతిశయుడై వావివరుస లేకుండా విచ్చలవిడిగా సంచరిస్తుండేవాడు. ఎలాగో వీరి ముగ్గురికి మంచి స్నేహం కుదిరింది.
విశృంఖలుని కథ
అదే ఊరిలో విశ్రుంఖలుడు అనే బ్రాహ్మణుడు పేదరికంతో ఉదరపోషణ జరుపుకోలేక ఆ కిరాతుని ఆశ్రయించి వాడు చెప్పిన పనులు చేస్తుండేవాడు. పతివ్రత అయిన తన భార్యను కూడా విడిచిపెట్టి నిత్యం కిరాతుని వద్దనే ఉంటూ వాడు చెప్పిన అన్ని పనులు చేస్తుండే ఈ బ్రాహ్మణుడు సావాసదోషం వలన స్నాన, సంధ్యాదులు విడిచిపెట్టి కిరాతుని వలే క్రూరుడుగా మారిపోయాడు.
విశృంఖలుని చెడు సావాసదోషం
మహాపాతకులతో సంపర్కం వలన విశ్రుంఖలుడు కూడా భ్రష్టు పట్టిపోయాడు. బ్రాహ్మణుడు దుష్టులతో స్నేహం చేయడం, వారిని స్పృశించడం, వారితో శయనించడం, కలిసి భోజనం చేయడం వలన వాని బ్రాహ్మణత్వం నశిస్తుంది. ఇక నిత్యం దుష్టులతో సహవాసం చేస్తూ వారితోనే సంచరిస్తూ వారు చెప్పిన పనులు చేస్తూ తిరిగే బ్రాహ్మణుడు పాపఫలాన్ని అనుభవించి మరణించిన తరువాత బ్రహ్మరాక్షసి వలే చెట్లు పుట్టలు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు.
బ్రాహ్మణోత్తముని కలుసుకున్న విశ్రుంఖలుడు
కిరాతునితో స్నేహం చేసిన విప్రుడు వాడితో రెండు ఏళ్ళు గడిపిన తర్వాత విధివశాత్తు కిరాతుడు చెప్పిన పని పూర్తి చేయడానికి పక్క ఊరికి వెళ్ళాడు. అక్కడ ఈ విప్రుడు రుద్రాక్షమాలాధరుడై, పుణ్యతీర్థములను సేవిస్తూ నిరంతరం నారాయణ స్మరణ చేసే వీరవ్రతుడను బ్రాహ్మణుని కలుసుకున్నాడు. కిరాతుని సహవాసంతో దుష్టుడైన విశ్రుంఖలుడు వీరవ్రతునికి నమస్కరించి ఏమి మాట్లాడకుండా మౌనంగా నిలుచున్నాడు. దుష్టసహవాసంతో బ్రాహ్మణ తేజస్సు కోల్పోయిన విశృంఖలుని చూసి వీరవ్రతుడు ఆశ్చర్యపోయి "ఓయి నీవు ఎవరవు? చూడటానికి బ్రాహ్మణుని వలే ఉన్నప్పటికినీ నీ బ్రాహ్మణ తేజస్సు మాయమైంది. నీ పేరేమి? అని ప్రశ్నించాడు.
విశృంఖలుని నిజ వృత్తాంతం తెలుసుకున్న వీరవ్రతుడు
విశృఖలునితో వీరవ్రతుడు "మహానుభావా! నేను బ్రాహ్మణుడను. నా పేరు విశ్రుంఖలుడు. జీవనం గడవడం దుర్బలమై నేనొక కిరాతుని ఆశ్రయించి, వాడు చెప్పిన పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాను" అని పలికిన విశృంఖలని మాటలు విన్న వీరవ్రతుడు కళ్ళు మూసుకొని ధ్యానంలో విశృంఖలుని నిజ వృత్తాంతం తెలుసుకుని ఈ విధంగా పలికాడు.
ఈ కథను ఇక్కడివరకు చెప్పి గృత్స్నమదమహర్షి 24వ అధ్యాయాన్ని ముగించాడు.
ఇతి స్కాందపురాణే! మాఘమాస మహాత్యే! చతుర్వింశాధ్యాయ సమాప్తః - ఓం నమః శివాయ
No comments:
Post a Comment