శివ పార్వతుల సంవాదం
పరమ శివుడు పార్వతితో "పార్వతి! మాఘమాసంలో శుద్ధ దశమి రోజు శ్రీహరిని పూజించినవారు చక్రవర్తి అవుతారు. ఆ పూజా విధానం వివరిస్తాను ఆలకింపు" అంటూ ఇలా చెప్పసాగెను.
మాఘ శుద్ధ దశమి పూజా విధానం
మాఘ శుద్ధ దశమి రోజు సూర్యోదయంతోనే నదీ స్నానం చేసి నదీతీరంలో కానీ స్వగృహంలో కానీ మంటపాన్ని ఏర్పాటు చేసి, ఆ మంటపాన్ని గోమయంతో అలంకరించి అష్టదళ పద్మం వేసి దానిపై కలశం ఉంచి కలశం మధ్యలో లక్ష్మీనారాయణ ప్రతిమను ప్రతిష్టించి, పీఠం మధ్యలో సాలగ్రామం ఉంచి తులసి దళాలతో, మేలుజాతి పుష్పరకాలతో లక్ష్మీనారాయణుని షోడశోపచారాలతో పూజించాలి. అనంతరం పాయసం, భక్ష్యభోజ్యాలు నివేదించాలి. బ్రాహ్మణులకు బియ్యం, బెల్లం, ఉప్పు దానం ఇవ్వాలి. తరువాత పూజాక్షితలను శిరస్సున ధరించి భక్తితో మాఘ పురాణం శ్రవణం చేయాలి. ఇలా చేసినవారికి జన్మాంతర పాపాలు నశిస్తాయి. అలాగే ఈ వ్రతమును చేస్తున్న వారికి ధనసహాయం చేసినవారికి కూడా ఉత్తమగతులు కలుగుతాయి. పూర్వం ఈ వ్రతం చేస్తుండగా చూసి ఓ కుక్క చక్రవర్తిగా ఎలా మారిందో వివరిస్తాను వినుము' అంటూ శివుడు పార్వతికి ఈ కథను వినిపించసాగాడు.
కుక్క చక్రవర్తిగా మారిన కథ
పూర్వం సమస్త శాస్త్ర కోవిదుడగు గౌతముడను మహర్షి అనేక మంది శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేయుచు కృష్ణవేణి నదీతీరానికి చేరుకున్నాడు. అది మాఘమాసం కావడం చేత గౌతముడు కృష్ణ నదీతీరంలో ఆశ్రమం ఏర్పరుచుకొని ప్రతిరోజూ కృష్ణా నదిలో మాఘ స్నానం చేస్తూ నది ఒడ్డునే లక్ష్మీనారాయణులను పూజిస్తూ, మాఘ పురాణ ప్రవచనం చేస్తుండేవాడు.
మూడు సార్లు ప్రదక్షిణ చేసిన కుక్క
ఆ రోజు మాఘ శుద్ధ దశమి. గౌతముడు ప్రతి రోజులాగే మాఘ స్నానం చేసి నది ఒడ్డున ఉన్న అశ్వత్థ వృక్షం కింద మంటపాన్ని ఏర్పరచి ఫలపుష్పాలతో మంటపాన్ని అలంకరించి శ్రీహరిని పూజించి మాఘపురాణ ప్రవచనం చేయుచుండెను. ఆ సమయంలో ఒక కుక్క అక్కడకు వచ్చి కూర్చుంది. పూజా ప్రదేశంలో ప్రవేశించే అర్హత కుక్కకు లేదు కనుక గౌతముని శిష్యులు కుక్కను అదిలించగా ఆ కుక్క అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేసి తిరిగి అదే స్థానంలో కూర్చుంది. శిష్యులు మళ్ళీ అదిలించగా తిరిగి అలాగే చేసింది.
చక్రవర్తిగా మారిన కుక్క
ఈ విధంగా కుక్క మూడు ప్రదక్షిణాలు పూర్తి చేసింది. మాఘశుద్ధ దశమి, ఆదివారం రోజు అశ్వత్థ వృక్షానికి లక్ష్మీ నారాయణునికి ముమ్మారు ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం చేత కుక్క తన దేహాన్ని విడిచి సకల ఆభరణ భూషితుడైన చక్రవర్తిగా మారాడు. ఆ చక్రవర్తి గౌతమునికి నమస్కరించి నిలిచెను.
కుక్క చక్రవర్తిగా మారడం చూసిన గౌతముడు ఆశ్చర్యంతో "నీవు ఎవరవు? గంధర్వుడవా! చక్రవర్తివా! నీ పూర్వజన్మ వృత్తాంతమేమిటి? అని ప్రశ్నించగా ఆ చక్రవర్తి గౌతమునికి నమస్కరించి ఇలా చెప్పసాగాడు.
చక్రవర్తి పూర్వజన్మ వృత్తాంతం
"ఓ మునిపుంగవా! నేను వంగదేశపు రాజును. నా పేరు వేగరథుడు. చంద్రవంశమున పుట్టిన నేను ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలిస్తూ ఉండేవాడిని. ధర్మం మీద ఆసక్తితో ఎన్నో దానధర్మాలు చేశాను. చెరువులు బావులు తవ్వించాను. మహర్షులకు యజ్ఞయాగాదులు చేసుకోడానికి అవసరమైన ద్రవ్యాన్ని సమకూర్చాను. ఎన్నో గుళ్లను నిర్మించాను. ఇన్ని చేసినా నాకు సద్గతులు కలుగలేదు. అందుకు కారణం ఏంటో చెప్తాను. ఒకనాడు నా వద్దకు పైంగలుడు అనే ముని వచ్చి తాను చేస్తున్న యజ్ఞానికి అవసరమైన ద్రవ్యాన్ని కోరాడు.
చక్రవర్తిగా ఆ మునిని నేను యథాశక్తి సత్కరించాను. అప్పుడు ఆ ముని నాతో 'రాజా! నీకొక రహస్యం చెపుతున్నాను. మాఘ మాసంలో సూర్యోదయం వేళ నదీ స్నానం చేసి, మాఘ వ్రతాన్ని ఆచరించి, మాఘ పురాణం శ్రవణం చేస్తే అశ్వమేథ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. విష్ణు సాయుజ్యం కలుగుతుందని' చెప్పాడు.
కర్మవశాత్తు ముని మాటలను నేను ధిక్కరించాను. ఆ మునితో నేను చలి బాధలను తట్టుకోలేనని, చలికి మరణిస్తానని, మరణించాక నేను ఏ ధర్మాలు ఆచరించలేనని చెప్పి మాఘస్నానం చేయడానికి ఒప్పుకోలేదు. ఆ మహర్షి నాకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా నేను వినిపించుకోలేదు. ఆ పాప ఫలంగా ఆ తరువాత నేను 100 జన్మలు గాడిదగా పుట్టాను. తరువాత నాలుగుసార్లు కుక్కగా పుట్టాను. ఇప్పుడు నాకు ఈ చక్రవర్తి రూపం తిరిగి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. నా సందేహాన్ని తీర్చండి" అని రాజు గౌతమ మహర్షిని కోరాడు.
మాఘ స్నానంతో తరించిన రాజు
రాజు మాటలు విన్న గౌతముడు "ఓ రాజా! నేడు మాఘ శుద్ధ దశమి. పరమ పవిత్రమైన ఈ రోజు కృష్ణా నది తీరంలో జరుగుతున్న మాఘ వ్రతాన్ని కళ్లారా చూసావు. నా శిష్యులు అదిలించడంతో మూడుసార్లు అశ్వత్థ వృక్షానికి, లక్ష్మీ నారాయణునికి ప్రదక్షిణాలు చేసావు. మాఘ పురాణాన్ని విన్నావు. దీనితో నీ పాపం పోయి చక్రవర్తి రూపం తిరిగి వచ్చింది. ఇప్పుడైనా కృష్ణా నదిలో మాఘ స్నానం చేసి తరించు అనగా ఆ రాజు నదిలో మాఘ స్నానం చేసి తరించాడు.
ఇంతలో ఆ అశ్వత్థ వృక్షం తొర్రలో నుంచి ఒక కప్ప కిందపడి అటు ఇటు పొర్లి తన రూపాన్ని విడిచి సుందరాంగియగు స్త్రీ రూపం ధరించి గౌతముని ముందు నిలిచింది. గౌతముడు ఆ స్త్రీని చూసి నువ్వు ఎవరవు అని అడిగాడు. పరమ శివుడు ఇక్కడ వరకు చెప్పి నాలుగో అధ్యాయాన్ని ముగించాడు.
ఇతి స్కాందపురాణే! మాఘమాస మహాత్యే! చతుర్దధ్యాయ సమాప్తః
No comments:
Post a Comment