ఉత్తర్‌ప్రదేశ్‌లోని నైమిశారణ్యం పురాణాలు పుట్టిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నైమిశారణ్యంలో ఋషులు, మునులను తపస్సు చేసుకోవాలని ఆదేశించినట్లుగా స్కాంద పురాణంలోని కార్తీక మహత్యం ద్వారా తెలుస్తోంది. ఇంతటి పావన ప్రదేశమైన నైమిశారణ్యంలో దధీచి కుండం ఉంది. ఈ దధీచి కుండంలోని నీటిని తలపై చల్లుకున్నా, స్నానం చేసినా 88 వేల నదులలో స్నానమాచరించిన ఫలితం దక్కుతుందని, సమస్త పాపాలు నశించి పుణ్యరాశి పెరుగుతుందని శాస్త్ర వచనం.
ఘనత వహించిన మన మహర్షులు
మన దేశం ఇంత సుభిక్షితంగా తేజోమయంగా ఉంది అంటే దానికి కారణం ఎంతో మంది మహర్షులు ఈ గడ్డపై జన్మించటమే అని చెప్పాలి. వాళ్ళు చేసిన యాగాలు, వారు ధారపోసిన తపస్సుల ఫలితమే దేశ సుభిక్షానికి కారణం. భూమి మీద ఆధ్యాత్మికత వెల్లివిరిస్తోంది అంటే ఇంకా ఇలాంటి మహర్షుల ఆశీర్వాదాలు మన మీద ఉండబట్టే అనటంలో సందేహం లేదు. ఇలాంటి మహనీయుల గురించి తెలుసుకోవడం మన కనీస కర్తవ్యం.
ఎవరీ దధీచి?
దధీచి మహర్షి అథర్వణ ఋషికి, చితికి కలిగిన సంతానం. చిన్నతనం నుంచే ఆయనకు భగవంతుని పట్ల అపారమైన భక్తి ప్రపత్తులు కలిగి ఉండటం వల్ల సరస్వతి నది ఒడ్డున ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని తపస్సు చేసుకుంటూ ఉండేవారు. దధీచి విష్ణువుని ప్రసన్నం చేసుకుని తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణించేలా వరాన్ని పొందుతాడు.
సురాసురుల యుద్ధం
ఒకసారి రాక్షసులు వృతాసురుని ఆధ్వర్యంలో స్వర్గాధిపతి ఇంద్రునిపై యుద్ధానికి వెళ్లారు. దేవతల వద్ద ఉన్న అస్త్రశస్త్రాలను దోచుకోవాలన్న ఉద్దేశ్యంతో వారు చేసిన ఈ భీకర యుద్ధంలో వృత్తాసురుడిని ఎదుర్కొనే బలం లేక దేవతలు స్వర్గం నుంచి బయటకి పరుగులు తీసి దధీచి దగ్గరకు వచ్చి వారి అస్త్రశస్త్రాలను జాగ్రత్తగా దాయమని ఇచ్చి వాళ్ళు తిరిగి పరుగులు తీస్తారు. దధీచి దగ్గరకు వచ్చి ఆయన తేజస్సుని ఎదుర్కొనే ధైర్యం లేక రాక్షసులు వెనక్కి వెళ్ళిపోతారు.
అస్త్రశస్త్రాలను అవపోసిన పట్టేసిన దధీచి
దధీచి మహర్షి దేవతలు వచ్చి వారి అస్త్రశస్త్రాలను తిరిగి తీసుకెళ్తారని ఎంతో కాలం ఎదురుచూసి వాళ్ళు రాకపోవటంతో ఆ అస్త్రశస్త్రాలను తన కమండలంలో కరిగించి వాటిని ఆయనే అవపోసన పట్టేస్తారు.
శ్రీ మహావిష్ణువును ఆశ్రయించిన ఇంద్రాది దేవతలు
వృత్తాసురుడి బారి నుండి తమను రక్షించమని ఇంద్రాది దేవతలు శ్రీ మహావిష్ణువుని కోరుతారు. దానికి విష్ణుమూర్తి దధీచి మహర్షి శరీరంలో ఉన్న ఎముకలను ఆయుధంగా మార్చి దానితో సంహరిస్తే వృత్తాసురుడు మరణిస్తాడని చెపుతారు.
దధీచిని వేడుకున్న దేవతలు
దేవతలందరూ దధీచి దగ్గరకు వెళ్లి వాళ్ల కోరికను విన్నవించుకున్నారు. దధీచి తన వల్ల ఎంతో మందికి మంచి జరుగుతుందనే ఉద్దేశ్యంతో వాళ్ల కోరికను నెరవేరుస్తానని మాట ఇస్తాడు. అయితే చనిపోయే ముందు తనకి భూమి మీద ఉన్న అన్ని నదులలో స్నానం చేయాలని ఉందని ఇంద్రుడికి చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు నైమిశారణ్యంలో తగిన ఏర్పాట్లు చేసి దధీచి కోరికను తీరుస్తాడు. ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణించే వరం ఉన్నందువల్ల దధీచి తన ప్రాణాలను విడిచిపెడతాడు. అప్పుడు కామదేనువైన ఆవు వచ్చి దధీచి శరీరాన్ని తన నోటితో రాస్తూ మాంసాన్ని మొత్తం తీసి ఎముకలను బయటకు తీస్తుంది. అలా వచ్చిన ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేసి దానితో వృత్తాసురుడిని చంపుతాడు ఇంద్రుడు.
దధీచి కుండం ఇలా ఏర్పడింది!
లోక కల్యాణం కోసం దధీచి మహర్షి తన శరీరాన్ని వదిలేయడానికి సిద్ధపడిన సమయంలో ఆయన కోరిక మేరకు ఇంద్రాది దేవతలు 88 వేల నదీ జలాలతో ఆయనకు స్నానం చేయించారు. అలా ఆయనకు స్నానం చేయించిన నీటితో ఏర్పడినదే 'దధీచి కుండం'.
పాపనాశిని దధీచి కుండం
నైమిశారణ్యం వెళ్లినవారు ఈ కుండంలోని నీటిని 'గంగతో సమానమైనవిగా భావిస్తుంటారు. దధీచి కుండంలోని నీటిని తలపై చల్లుకున్నా, స్నానం చేసినా 88 వేల నదులలో స్నానమాచరించిన ఫలితం దక్కుతుందని చెబుతారు. సమస్త పాపాలు నశించి పుణ్యరాశి పెరుగుతుందని అంటారు.
Comments
Post a Comment