ఎమ్మిగనూరులో నీలకంఠేశ్వరుడి రథోత్సవం నెలరోజుల పాటు ఘనంగా జరుగుతుంది. ఆంధ్ర - కర్ణాటక సరిహద్దు ప్రాంతాల ఇలవేల్పు ఎమ్మిగనూరు నీలకంఠేశ్వర స్వామి. ఏటా పుష్యమాసంలో స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతాయి. అటు కర్ణాటకలోని బళ్లారి, రాయచూరు ప్రాంతాల నుంచీ ఇటు తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా నుంచీ వేలాది భక్తులు తరలివస్తారు. కర్నూలు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఒకటైన ఎమ్మిగనూరు ఒకప్పుడు కుగ్రామం. చేనేతకళకు ప్రసిద్ధి పొందింది.
ఇక్కడి నీలకంఠేశ్వరుణ్ణి నేతకార్మికులే కాశీ నుంచి తెచ్చి ప్రతిష్ఠించినట్లు చెబుతారు. స్వామి స్వయంభువని మరో ఐతిహ్యం కూడా ఉంది. మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానాధీశులకు ఎమ్మిగనూరు నీలకంఠేశ్వరుడు ఇష్టదైవం. వారే స్వామికి రథోత్సవ సంప్రదాయాన్ని ప్రారంభించారు. వీరప్ప అనే శిల్పి 30 అడుగుల ఎత్తుతో స్వామి రథాన్ని రూపొందించాడు. నీలకంఠేశ్వర స్వామి ఆలయం వెలసిన ప్రాంతాన్ని ఒకనాడు ఎనమలూరుగా పిలిచేవారు. పూర్వం ఈ ఊరి సంతలో ఎనుములను (గేదెలు) భారీగా విక్రయించేవారు. ఇప్పటికీ ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా పెద్ద పశువుల సంత జరుగుతుంది. శ్రీకృష్ణదేవరాయలు నీలకంఠేశ్వరుని సన్నిధిలో ఒక యజ్ఞం నిర్వహించాడని, చెన్నకేశవస్వామిని ప్రతిష్ఠించాడని చరిత్ర. ఇక్కడికి సమీపంలోని సంతనాగలాపురాన్ని కూడా రాయలే అభివృద్ధి పరిచాడు.
ఈ జాతరలో మొదటి అయిదు రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
ఈ సంవత్సరం జనవరి 13 నుండి జాతర మొదలుకానుంది.
ముఖ్య తేదీలు
జనవరి 13 - పుష్య పౌర్ణమి, పుష్ప రథారోహణ మహోత్సవం, శివపార్వతుల కల్యాణోత్సవం.
జనవరి 14 - ప్రభావళి మహోత్సవం
జనవరి 15 - మహా రథోత్సవం , అన్నదానం
జనవరి 16 - స్వామి వ్యాహ్యాళి మహోత్సవం
ఫిబ్రవరి 17 - తీర్థవాలి వసంతోత్సవం, మహేశ్వర బ్రాహ్మణ సన్మాన మహోత్సవం.
ప్రతి రోజు ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
ఎలా వెళ్ళాలి :
కర్నూల్ నుండి 68 కి.మీ
ఆదోని నుండి 30 కి.మీ
అమరావతి నుండి 380 కి.మీ
Comments
Post a Comment