ఉత్తరాఖండ్‌లోని నైనీతాల్‌లో నైనా దేవి ఆలయం ఉంది. శక్తి పీఠాలలో ఒకటిగా భాసిల్లుతున్న ఈ ఆలయం అమ్మవారిని దర్శిస్తే చాలు ఎలాంటి నేత్ర రోగాలైనా తగ్గిపోతాయని విశ్వాసం.
నైనా దేవి ఆలయం
వ్యాస మహర్షి రచించిన శివ పురాణం ప్రకారం దక్ష ప్రజాపతి తాను చేసిన యజ్ఞానికి తన కుమార్తె సతీదేవి, శివుని ఆహ్వానించలేదు. శివుడు వారిస్తున్నా వినకుండా పుట్టింటిపై మమకారంతో దక్ష యజ్ఞానికి వెళ్లిన సతీదేవి అక్కడ శివనింద భరించలేక తనకు, తన భర్తకు జరిగిన అవమానాన్ని సహింపలేక యోగాగ్నిలో ప్రవేశించి ప్రాణత్యాగం చేస్తుంది. జరిగిన సంఘటన తెలుసుకున్న పరమ శివుడు ఆగ్రహంతో దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. సతీదేవి మరణాన్ని తట్టుకోలేని శివుడు ఆమె శరీరంతో తాండవం చేసిన సమయంలో విష్ణువు తన సుదర్శన చక్రంతో అమ్మవారి శరీరాన్ని ఖండ ఖండాలుగా ఖండించాడు. అమ్మవారి శరీర భాగాలు భూమిపై పడిన ప్రాంతాలు శక్తి పీఠాలుగా ఆవిర్భవించాయి. అలా అమ్మవారి నేత్రం పడిన ప్రదేశం లో వెలసిన ఆలయమే నైనా దేవి ఆలయం. ఈ ప్రదేశంలో సతీదేవి నేత్రం పడిందని , తదనంతరం ఇక్కడ దేవత స్మారకార్థం ఆలయాన్ని నిర్మించారని నమ్ముతారు. 'నైనా' అంటే 'కళ్ళు' అని అర్థం కాబట్టి ఈ దేవతను నైనా దేవిగా పూజిస్తారు.
ఆలయ విశేషాలు
నైనీతాల్ సరస్సుకు ఉత్తర భాగంలో నైనా దేవి మందిరం ఉంది. నైనా దేవి నైనీతాల్ ప్రజల ప్రధాన ఆరాధ్య దేవత. గర్భాలయంలో నైనా దేవి తో పాటు గణేశుని విగ్రహం కూడా దర్శించుకోవచ్చు. అలాగే అమ్మవారి మరో రూపం కాళీ దేవిని కూడా దర్శనం చేసుకోవచ్చు.
మనోభీష్టాలు నెరవేర్చే ఎర్రని వస్త్రం
నైనా దేవి ఆలయంలో ఉండే రావిచెట్టు నింగికి నేలకు నిచ్చెన వేసినట్లు ఎత్తుగా ఉంటుంది. అమ్మవారి పూజలో పెట్టి ఇచ్చిన ఎర్రని వస్త్రాన్ని ఈ చెట్టుకు కడితే మనోభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం.
బంగారు నేత్రాలు
ఎవరైనా నేత్ర సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటే నైనాదేవి ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని మొక్కుకున్న తర్వాత నేత్రవ్యాధులు నయమయ్యాక అమ్మవారికి బంగారు నేత్రాలు సమర్పించడం ఆనవాయితీ.
ఉత్సవాలు - వేడుకలు
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో నంద అష్టమి రోజున నైనా దేవి మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు ఎనిమిది రోజుల పాటు సాగుతాయి. ఈ సమయంలో ఉదయం బ్రహ్మ ముహూర్త సమయంలో భక్తుల దర్శనం కోసం నైనా దేవిని ఉంచిన ఉయ్యాలను ఆలయ ప్రాంగణంలో ఉంచుతారు. ప్రతిరోజూ పూజలు నిర్వహించి ఐదు రోజుల తర్వాత ఊయలను నగరం చుట్టూ ఊరేగింపుగా తీసుకెళ్లి రాత్రి నైనీతాల్ సరస్సులో నిమజ్జనం చేస్తారు. ఈ సందర్భంగా సమీపంలోని మైదానంలో నైనా దేవి జాతరను నిర్వహిస్తారు. ఈ జాతరను చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు నైనీతాల్కు చేరుకుంటారు. అలాగే ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి.
ఎలా చేరుకోవాలి ?
దేశ రాజధాని దిల్లీ నుంచి కత్గోడం స్టేషన్ వరకు రైలులో వెళ్లి అక్కడ నుంచి టాక్సీలో కానీ, బస్సులో కానీ 35 కిలోమీటర్లు ప్రయాణం చేసి నైనీతాల్కు చేరుకోవచ్చు.
Comments
Post a Comment