పుష్య పౌర్ణమి పర్వదినాన చంద్రునితో పాటు లక్ష్మీనారాయణుడిని పూజిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఆచరించడంవల్ల కుటుంబంలో ఎలాంటి ఆటంకాలు రావని, జీవితాంతం ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈ పుష్య పూర్ణిమను శాకంబరి పూర్ణిమ అని కూడా పిలుస్తారు.
ఈ రోజున బ్రహ్మ ముహుర్తంలో నిద్రలేవాలి. గంగానదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయడంవల్ల సకల పాపాలు తొలగిపోతాయని శాస్త్రవచనం. నదిలో స్నానం చేసేందుకు వీలు కాని వారు ఇంట్లో ఉన్న నీటిలో కొంత గంగాజలం వేసి స్నానం చేయాలి. శుభ్రమైన బట్టలు ధరించి ఉపవాస వ్రతం ఆరంభించిన అనంతరం సింధూరం, ఎర్రని దారం, పసుపు రంగు పువ్వులు, పండ్లు, తీపి పదార్థాలు, పంచామృతాలతో లక్ష్మీ నారాయణులను పూజించాలి. శ్రీహరి భజనలో పాల్గొనాలి.
ఇదే రోజున సాయంత్రం పాలలో పంచదార, వండిన అన్నం కలిపి చంద్రునికి నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా చేయడంవల్ల లక్ష్మీదేవి తమ ఇంట్లో నివసిస్తుందని పురాణ వచనం. రాత్రి సమయంలో దక్షిణవర్తి శంఖంలో గంగాజలం, కుంకుమ కలిపి శ్రీహరికి అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కరుణించి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తుంది.
అంతేకాకుండా పిండిలో పంచదార కలిపి చీమలకు వేయాలి. ఇలా చేయడంవల్ల చేపట్టే ప్రతి పనిలో విజయం కలుగుతుంది. ఈ రోజున గజలక్ష్మీని పూజించడంవల్ల దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది.
పుష్య పూర్ణిమ రోజున అర్ధరాత్రి సమయంలో అష్టలక్ష్ములకు పూజ చేయాలి. లక్ష్మీదేవికి గులాబీ పువ్వులను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మానసిక ఒత్తిడి దూరమవుతుంది. సంపాదనకు ఎలాంటి ఆటంకాలు రావు. ఆదాయానికి లోటు ఉండదు.
తులసీ కోట ముందు దీపం వెలిగించి, తులసీ పూజ చేయడం ద్వారా శ్రీలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. అలాగే శివాభిషేకం చేయించిన వారికి సర్వశుభాలు చేకూరుతాయి. ఉసిరి కాయలపై ఆవు నేతితో తడిపిన వత్తులను ఉంచి దీపాలు వెలిగించడం మంచిది.
పుష్య పౌర్ణమి రోజు దేశవ్యాప్తంగా వివిధ తీర్థయాత్రలు , పవిత్ర నగరాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ రోజు భగవద్గీత , రామాయణం చదవడం కూడా కొందరు పాటిస్తారు. ఈ పుష్య పౌర్ణమి రోజు శ్రీకృష్ణుని ఆలయాలలో విలక్షణమైన ‘పుష్యాభిషేక యాత్ర’ ప్రారంభమవుతుంది.
2025 తేదీ: జనవరి 13.
Comments
Post a Comment