ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణం నుంచి 13 k.m దూరంలో అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం వెలసి ఉంది. అత్తిలి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య క్షేత్రంలో స్వామి స్వయంభువు మూర్తిగా వెలిశాడు
సర్ప రూపంలో సుబ్రహ్మణ్యుడు
చాలాకాలం క్రిందట ఇక్కడి చెరువు సమీపంలో ఒక పెద్ద పాముపుట్ట ఉండేదట. దివ్యమైన తేజస్సు గల ఒక సర్పం ప్రతిరోజూ ఆ పుట్టలోకి వెళ్లడం, రావడం చాలామంది చూసేవాళ్లు. అయితే దానిని చూడగానే పవిత్రమైన భావన కలగడం వల్ల, ఎవరూ కూడా దానికి హాని తలపెట్టలేదు. కాలక్రమేణా చెరువులో నీరు పెరగడం వలన ఆ పుట్ట కరిగిపోయింది. ఆ పాము విషయాన్ని కూడా అంతా మరిచిపోయారు.
కొంతకాలం తరువాత చెరువుకి సంబంధించిన మరమ్మత్తులు చేపట్టగా, గతంలో పుట్ట వున్న ప్రదేశంలో నుంచి ఏకశిలపై శ్రీ వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి సుందర మనోహర విగ్రహం బయట పడింది అని చెబుతారు. ఈ విగ్రహం సుమారు రెండు అడుగుల ఎత్తుతో స్పష్ట ఆకృతితో విరాజిల్లుతుంటుంది.
ఇదంతా స్వామివారి మహిమగా భావించిన గ్రామస్థులు, ఆలయాన్ని నిర్మించి ఆరాధించడం ఆరంభించారు. శిలారూపంలో గల స్వామి వారి విగ్రహం చిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. స్వామివారి దేహం సర్పం వలె పొలుసులతో కూడి ఉండటం ఈ విగ్రహం యొక్క ప్రత్యేకతగా చెబుతుంటారు.
మూలవిరాట్టు
మరో విశేషం ఏమిటంటే, రోజూ గర్భాలయంలోకి సోమసూత్రం గుండా సర్పం స్వామి మూల విరాట్ వద్దకు వస్తుందని, అది మరుసటి రోజు ఉదయం బయటకు వెళ్తుందని ఆలయ అర్చకులు చెబుతుంటారు. ప్రతీనెలా ఈ సర్పం గర్భగుడిలో గానీ, చెరువు గట్టుపై గానీ కుబుసం విడిచి వెళ్తుందని, దానిని స్వామి పాదాల వద్ద ఉంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారని స్థానికుల కథనం.
ఉపాలయాలు
అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ వల్లీ, దేవసేన సమేతంగా చాలా చిన్న విగ్రహ రూపంలో దర్శనం ఇస్తారు. ఆలయ ఆవరణలో స్వామి వారితో పాటు రామసమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి, గణపతి విగ్రహాలు మనకు దర్శనం ఇస్తాయి. స్వామి వారికి రోజు చేసే పూజా కార్యక్రమాలతో పాటు షష్టి రోజు చేసే వివిధ రకాల సేవలు ఎంతో ఆకట్టుకుంటాయి.
ఆరాధ్య దైవం
అత్తిలి వాసులకు శ్రీ వల్లీదేవసేన సమేత సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధ్య దైవం. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఆలయానికి పోటెత్తుతారు. అత్తిలి షష్ఠి అంటే ప్రతి భక్తుడికి ప్రీతి. అందుకు కారణం ఇక్కడ షష్టి ఉత్సవాలు చాలా ప్రత్యేకంగా నిర్వహించడమే
అభిషేక ప్రియుడు
అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి అభిషేక ప్రియుడిగా ప్రసిద్ధి చెందాడు. ప్రతి మంగళవారం, ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజున భక్తులు పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తూ తమ మొక్కులు తీర్చుకుంటారు. నాగ, కుజ దోషాలు ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శించి అభిషేకాలు చేస్తారు. సంతానం లేని వారు నాగుల చీర, ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకుంటారు. సంతానం కలిగాక తలనీలాలు, పటికిబెల్లం తూకం వేసి మొక్కులు తీర్చుకుంటారు. అత్తిలిలో ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా స్వామి దర్శనం చేసుకోవడం ఈ ప్రాంత ప్రజల ఆనవాయితీ.
పౌరాణిక నేపథ్యం
పౌరాణికంగా అత్తిలి గ్రామం అత్రి మహర్షి తపోభూమిగా ప్రసిద్ధి పొందింది. అత్రి మహర్షి పేరు మీదుగానే అత్తిలి పేరు ఏర్పడిందని అంటారు. మొదట్లో అత్రి అన్న పదమే తర్వాత కాలంలో అత్తిలిగా రూపాంతరం చెందింది. అత్రి మహర్షి ఆరాధించిన శివలింగమే ఉమా సిద్దేశ్వర స్వామి వారి ఆలయంలోని మూలవిరాట్ అని అంటారు.
పెద్ద పండుగ
సాధారణంగా అత్తిలిలో పెద్ద పండగ ఏది అని అడిగితే ఎవరైనా ముక్తకంఠంతో చెప్పే ఏకైక సమాధానం సుబ్రహ్మణ్య స్వామి షష్టి. 75 సంవత్సరాలుగా ఇక్కడ షష్ఠి తిరునాళ్లను చేస్తున్నారు. స్వామివారి కల్యాణం సహా 15 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున సాగుతుంటాయి.
Comments
Post a Comment