స్వామిమలై తమిళనాడులో గల తంజావూర్ జిల్లాలో కుంభకోణం సమీపంలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో ఐదవది. ఇక్కడ ప్రణవ రహస్యాన్ని పరమిశివుడికి చెప్పాడు సుబ్రహ్మణ్యుడు.. స్వామిమలై అంటే 'దేవుని పర్వతం' అని అర్థం. స్వామిమలైని 'తిరువేరకం' అని కూడా పిలుస్తారు.
ఇది కావేరి నది ఒడ్డున ఉన్నది.
స్థల పురాణం
పూర్వం ఒకనాడు చతుర్ముఖ బ్రహ్మ కైలాసం వైపు వెడుతూ వుండగా, సదా చిద్విలాసంతో ఉండే సుబ్రహ్మణ్యుడు, బ్రహ్మని ఆపి "బ్రహ్మమనగా ఏమి?, ప్రణవమునకు అర్థం తెలుసా?” అని అడిగాడట. అంత చిన్న పిల్లాడి నుంచి అంతటి క్లిష్టమైన ప్రశ్నను ఊహించని చతుర్ముఖ బ్రహ్మ అనాలోచితంగా “బ్రహ్మము అనగా నేనే" అని సమాధానం చెప్పాడట కొద్దిపాటి అహంకారం అతిశయం నిండిన గొంతుతో చిద్విలాసంగా నవ్వుతూ. వెంటనే కార్తికేయుడు, మీరు నాలుగు ముఖాలతో వేదాలు చెప్తున్నారు కాని, బ్రహ్మము అర్థం కాలేదు అని బ్రహ్మ గారిని బంధించాడట. వెంటనే పరమశివుడు వచ్చి, "బ్రహ్మకి జ్ఞానంలో కించిత్ దోషం ఉండవచ్చు, అంత మాత్రాన బంధించకూడదు. ఆయనని విడిచి పెట్టేయి" అని చెప్పగా,సుబ్రహ్మణ్య స్వామివెంటనే బ్రహ్మని విడిచి పెట్టాడట. పరమేశ్వరుడు తన కుమారుడిని “ఇంతకీ నీవేమి చెబుతావు ప్రణవమనేదానికి అర్థాన్ని?” అని అడిగాడట కుతూహలంగా. అప్పుడు కుమారస్వామి ఏమాత్రం తటపటాయించక పరమశివునికి ప్రణవ మంత్రార్థాన్ని ఉపదేశం చేశాడట స్వామిగా. కుమారుడు చెప్పేది వినేందుకు పరమశివుడు వంగి కుమారస్వామి నోటి వద్దకి తన చెవిని చేర్చాడట. అతను చెప్పినదంతా ఆసక్తికరంగా ఆలకించాడట. ఇది ఎంతో చిత్రంగా ఉంటుంది, శంకరుడు సకల జ్ఞానాలకు ఆలవాలం. 'ఈశానః సర్వ విద్యానాం' అంటారు కదా. ఇక్కడ దీని అంతరార్థం ఏమిటంటే, ఏ తండ్రి అయినా తన కొడుకు చేతిలో ఓడిపోవడం ఇష్టపడతాడు. కొడుకు చేతిలో తండ్రి ఓడిపోతే అది తనకి గొప్ప సన్మానముగా భావిస్తాడు తండ్రి. లోకానికంతటికీ జ్ఞానమునిచ్చే తండ్రికి, తన తేజస్సుతో పుట్టిన పుత్రుడు జ్ఞాన బోధ చేయడం అనేది ఎంతో ఆనందదాయకమైన విషయం. కుమారుడి తెలివితేటలకు,జ్ఞానసంపదకు పొంగిపోయిన పరమేశ్వరుడు అతడిని అమాంతం ఎత్తుకుని తన మెడల మీద కూర్చోబెట్టుకున్నాడట వాత్సల్యంతో.
స్వామినాథస్వామి ఆలయం
ఈ ఆలయానికి 60 మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఈ మెట్లు ఒక మానవుని జీవితకాలంలోని 60 సంవత్సరాలకి ప్రతీకగా ఒక్కో సంవత్సరానికి ఒక్కో మెట్టు చొప్పున నిర్మించారని చెబుతారు.మరికొందరేమో ఈ అరవై మెట్లు అరవై సంవత్సరాలకి ప్రతీకలనీ, ఆసంవత్సరాధిదేవతలు ఈ రూపంగా స్వామిని సేవిస్తున్నారనీ అంటారు. ప్రతి మెట్టు దగ్గర గోడమీద ఆ సంవత్సరం పేరు వ్రాసి వుంటుంది తమిళంలో. ఈ మెట్ల దోవ మధ్యలో,
32 మెట్లు ఎక్కగానే కుడివైపున కుమారస్వామి తన తండ్రికి ఉపదేశం ఇస్తున్న అద్భుత శిల్పం కనబడుతుంది. స్వామిమలై ఆలయానికి మూడు గోపురాలు,మూడు ప్రాకారాలు ఉంటాయి. అయితే ఆలయ ప్రాకారాలు విచిత్రంగా ఉంటాయి. మొదటి ప్రాకారం గుట్ట (కొండ అని కూడా పిలుస్తారు) అడుగుభాగంలో ఉన్నది. రెండవ ప్రాకారం గుట్ట మధ్యభాగంలో ఉన్నది. మూడవ ప్రాకారం కొండపై ఆలయం చుట్టూ నెలకొని ఉన్నది. ఇక్కడి ఆలయం బావిని వజ్రతీర్థం అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని కార్తవీర్యార్జునుడనే హైహయ వంశానికి చెందిన రాజు కట్టించాడు. గర్భగుడి బయట వసారాలో ఈయన విగ్రహాన్ని చూడవచ్చు.
వేదమంత్రాలు చదువుతూ అనేకవిధాలైన పూజాసామాగ్రితో పూజలు సలుపుతూ ఈ స్వామి అభిషేకం సుమారు 60 నిముషాలు జరిపిస్తారు. ఈ ఆలయ మధ్యభాగం అంతా నడవటానికి వీలుగా ఉంటుంది. చుట్టూరా చిన్నచిన్న శివుని ఆలయాలు ఉన్నాయి.
అసాధారణ పరిస్థితుల్లో, దైవకార్యానికై ఉదయించిన కారణజన్ముడు కుమారస్వామి. కృత్తికా దేవతల స్తన్యంతో పెరిగి పెద్దయిన కార్తికేయుడు ఆరుముఖాలతో, పన్నెండు చేతులతో విరాజిల్లే షణ్ముఖుడు. మహా తేజో మూర్తి. దేవసేనానిగా పేరుపొంది తారకాసుర సంహారం గావించిన కుమారస్వామిని సుబ్రహ్మణ్యస్వామి అని, ఆర్ముగమనీ కూడా పిలుస్తారు. అనితర సాధ్యమైన పరాక్రమంతో పాటు ఆత్మజ్ఞానంలోనూ మిన్న ఈ శివసుతుడు. ప్రణవనాదంలోని మర్మాన్ని గురువులకే గురువైన తండ్రి చెవిలో ఉపదేశించిన చిన్నారి గురువు కార్తికేయుడు. సర్వజగతికి స్వామియైన పరమేశునికే ఉపదేశం చేసినవాడు వాడు గనుకనే సుబ్రహ్మణ్యస్వామిని స్వామినాథుడని కూడా అంటారు.
స్వామినాథ అంటే గురు స్వరూపం. అసలు స్వామి అనే మాట అమరకోశం ప్రకారం ఒక్క సుబ్రహ్మణ్యుడిదే. ఎందుచేతనంటే “దేవసేనాపతీ, శూరః, స్వామీ, గజముఖానుజః “ అని అర్థంగా ఇవ్వబడింది. అందుకే సుబ్రహ్మణ్యేశ్వరస్వామి అని పిలిచినా, కేవలం స్వామీ అని పిలిచినా అది సుబ్రహ్మణ్యుడికే చెందుతుంది అని చెప్పింది అమరకోశం. అటువంటి మహానుభావుడు స్వామిమలైలో వెలిసి ఉన్నాడు.
ఆలయ విశేషాలు
ఈ క్షేత్రం ఎత్తైన ఒక కొండ మీద ఉంటుంది. పైకి ఎక్కాలంటే విశాలమైన 60 రాతి మెట్లు ఎక్కాలి. గుడి కింది భాగంలో పార్వతీ పరమేశ్వరుల మంటపాలు వున్నాయి. వీరి పేర్లు మీనాక్షీ సుందరేశ్వర్, మీనాక్షి. పాండ్య రాజైన వరగుణుడు ఒకసారి మధుర నుంచి పుణ్యక్షేత్రమైన తిరువిడైమరుదూర్ కు వెళ్తూ ఈ ఆలయంలో ఒక రాత్రి గడిపాడట. ఆయన కుల దైవమైన మీనాక్షీ సుందరేశ్వరుని ఆరాధించటానికి ఈ మంటపాలనేర్పరచాడు. తర్వాత అరుణాచల చెట్టియార్ ఇక్కడ రాతి కట్టడాలు కట్టించాడు. ధ్వజస్తంభం దగ్గర వున్న వినాయకుడిగుడి కూడా చాలా మహిమ కలది. ఇక్కడ కుమార తరై, నేత్ర పుష్కరిణి అనే రెండు పుష్కరిణులు వున్నాయి. కొండ ప్రాంతంనుంచి వచ్చిన పుట్టుగుడ్డి అయిన ఒక భక్తుడు ఈ రెండు పుష్కరిణులలో స్నానం చేసి స్వామి సన్నిధానానికి వస్తుంటే ఈవినాయకుడి గుడి దగ్గరకు వచ్చేసరికి ఆయనకి కన్నులు కనిపించాయట. అందుకే ఈ వినాయకుణ్ణి నేత్ర వినాయగర్ అంటారు.
ఆలయంలో ఆర్జిత సేవలు
ప్రతీరోజూ స్వామి వారికి అభిషేకం చేస్తారు. ఆ సమయంలో స్వామి వారిని అలంకరణ లేకుండా చిన్న కౌపీనం మాత్రం ఉంచి వేద మంత్రాలు చదువుతూ, పంచామృతాలతో అద్భుతంగా చేస్తారు ఈ అభిషేకం. ఈ అభిషేకం దర్శనం కోసం తగిన రుసుము చెల్లించాలి. ఇక్కడ స్వామినాథ స్వామి చిన్న కౌపీనంతో తన చేతిలో శక్తి ఆయుధం పట్టుకుని చిన్న పిల్లవాడిలా ముద్దుగా దర్శనమిస్తాడు. సమయం, అవకాశం ఉన్న వారు తప్పకుండా చూడవలసినది
ఇక్కడే అగస్త్య మహర్షికి ద్రవిడ వ్యాకరణం బోధించారు. సుబ్రహ్మణ్యుడు. స్వామిమలైలో సుబ్రహ్మణ్య స్వామి వారి మందిరం పైన ఉంటుంది, క్రింద, మీనాక్షి, సుందరేశ్వరుల మందిరాలు ఉంటాయి.
ఉత్సవాలు
అనేక ప్రసిద్ధ పండుగలు స్వామిమలై లో జరుగుతాయి. వాటిలో ఆలయ రథోత్సవం సాధారణంగా ఏప్రిల్ నెలలో, స్కంద షష్టి పండుగ అక్టోబర్ లో, విసాకం పండుగ మే నెలలో 'పంగుని ఉత్తిరం' పండుగ మార్చి నెలలో జరుగుతాయి.
సందర్శన సమయాలు
ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు
సాయంత్రం 4 నుండి రాత్రి 10 గంటల వరకు.
Comments
Post a Comment