- ఈ తిరువెంబావైని రచించిన వారు మాణిక్యవాచకర్. ఆయన రచించిన తిరువాచకం అనే కావ్యంలోనిది ఈ తిరువెంబావై.
- తిరువెంబావై మాణిక్యవాచకర్ శివభక్తికి స్పందన.
- మధురైకి సమీపంలోని తిరువాదపూర్ వీరి జన్మస్థలం.
- మాణిక్యవాచకర్ పాండ్యరాజుల కొలువులో మంత్రిగా ఉండేవారు.
- తిరువాచకం 51 ప్రకరణాల గ్రంథం. ఇందులోని ఏడవ ప్రకరణం - తిరువెంబావై.
మాణిక్య వాచకర్ గానం చేస్తూఉండగా స్వయంగా శివ దేవుడే దీనిని రాసినట్టుగా కూడా చెప్పబడుతోంది. పాండ్యరాజు ఆస్థానంలో మంత్రిగా ఉన్న మాణిక్యవాచకుల ఇంటికి ఒక రోజు నటరాజస్వామి బ్రాహ్మణ పండితుడి వేషములో వచ్చాడు. ఆ సమయంలో మాణిక్య వాచకర్ భక్తిపారవశ్యంతో తిరువాచకాన్ని గానంచేస్తూ ఉండగా ఆ బ్రాహ్మణుడు వాటిని తాళపత్రాలపై రచించారు. ఈ విషయం మాణిక్య వాచకర్కు తెలియదు. మరుసటి రోజు ఉదయాన్నే అర్చకులు చిదంబరంలోని శ్రీ నటరాజస్వామి వారి ఆలయాన్ని తెరువగా.. గర్భాలయం గడప వద్ద తిరువాచకం దర్శనమిచ్చింది. మాణిక్య వాచకర్ పాడుతూ ఉంటే తాను వ్రాసినట్లుగా తెలుపుతూ నటరాజస్వామి వారి ముద్రదానిపై దర్శనమిచ్చింది. దీనితో ప్రజలందరూ మహోత్సాహంతో మాణిక్యవాచకర్ వారిని ఆలయానికి తీసుకొని వచ్చి గౌరవించారు. అందరూ చూస్తుండగానే మాణిక్య వాచకర్ చిదంబరేశ్వరడిలో లీనమైనట్లు కథనం.
తిరువాచకంలోని ఏడవ ప్రకరణంలో ఉన్న తిరువెంబావైలో 20 పాశురాలు ఉన్నాయి. ప్రతి పాశురం “ఏలోరెంబావై” అనే మకుటంతో ముగిస్తుంది. ఏలోరెంబావైలోని "ఏల్" అంటే మేలుకో, “ఓర్” అంటే ధ్యానించు, “ఏం"అంటే మా, “పావై” అంటే ఓ అమ్మాయి అని అర్థం. అంటే నిద్రిస్తున్న యువతిని తెల్లవారుజామునే నిద్రనుంచి మేల్కొల్పి పరమాత్మను ధ్యానించమని చెప్పడమే తిరువెంబావై.
తిరువెంబావైలో ఇరవై పాశురాలు వున్నాయి. దీనిలోని మొదటి ఎనిమిది పాశురాలలో నిద్రిస్తున్న వారిని మేల్కొల్పడం... నిద్రలేచిన యువతులు స్నాన ప్రాధాన్యత వంటి వాటిని గురించి సంభాషించడం,తొమ్మిదవ పాశురం నుంచి ఇరవై వరకు శివున్ని కీర్తిస్తూ... “ఆయన దివ్య పాదాన్ని స్మరించండి.... పాతాళము చొచ్చుకుపోయిన, సభా స్థలాన్ని అతిక్రమించి సాగిపోయినా శివ రూపాన్ని ధ్యానించండి.... కనిపిస్తున్న ఆకాశమంతా ఆయన జటాజూటంలో కొంత భాగమే... ఆయన వేదవేద్యుడు . ఆయన పాదమే ఈ జగత్తు అంతటికీ సర్వస్వం" అంటూ ఆ దివ్య పాదాన్ని సేవించి తరించాలని ప్రబోధించడం కనిపిస్తుంది
అంతేకాకుండా సనాతనులలో కెల్లా సనాతనుడు.. నిత్య యవ్వనుడు అయిన శంకరుడిముందు ధనిక, పేద కుల, మత భేదాలు లేవని ఆయన పాదాలను సేవించే భక్తులందరూ ఒకే కుటుంబ సభ్యులని.. శివుడి భక్తులందరూ ఒకరికొకరు బంధవులు అనే అనే సామాజిక ఐక్యతా భావన తిరువెంబావైలో ఉంది. సూర్యుడు ఉదయిస్తే చీకటి తొలగి, నక్షత్రాలన్నీ వెలవెల పోయినట్లు శివుడి ముందు అజ్ఞానం నిలవదని.. శివుడు జ్ఞాన ప్రదాత అని, పంచభూతాత్మకమైన శివుడు అందరిలోనూ ఉన్నాడని చెబుతూ భగవంతుని ముందు అందరూ సమానులే అనే భావన తిరువెంబావైలో చెప్పబడింది.
Comments
Post a Comment