Magha Puranam Telugu: మాఘ పురాణం 17వ అధ్యాయం - సంతానం కోసం కఠోర తపస్సు - శ్రీహరి అనుగ్రహంతో ప్రాప్తి - HINDU DHARMAM

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Sunday, February 16, 2025

demo-image

Magha Puranam Telugu: మాఘ పురాణం 17వ అధ్యాయం - సంతానం కోసం కఠోర తపస్సు - శ్రీహరి అనుగ్రహంతో ప్రాప్తి

Responsive Ads Here

 

lord%20vishnu%202

గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షుల సంవాదం

జహ్ను మహర్షి గృత్స్నమదమహర్షితో తనకు తత్వోపదేశం చేయమని ప్రార్ధించగా గృత్స్నమదుడు శ్రీహరి అనుగ్రహంతో విప్రదంపతులు పుత్రసంతానం పొందిన విధానాన్ని వివరిస్తూ పదిహేడవ అధ్యాయాన్ని ప్రారంభించాడు.

మాఘ పురాణం పదిహేడవ అధ్యాయం

గృత్స్నమదమహర్షి జహ్నువుతో "ఓ జహ్నువూ! నీ బుద్ధి చాలా మంచిది. అందుకే నీకు శ్రీహరి కథల పట్ల ఆసక్తి కలిగింది. మాఘవ్రత పుణ్యం వల్ల కలుగు తత్వమును బోధిస్తున్నాను జాగ్రత్తగా వినుము" అంటూ ఈ విధంగా చెప్పసాగెను.

సంతానం కోసం విప్రదంపతుల ఆరాటం

పూర్వం గంగా తీరంలో ఒక బ్రాహ్మణుడు తన భార్యతో కలిసి నివసిస్తుండేవాడు. అతను వేదవేదాంగుడు, సదాచార సంపన్నుడు. కానీ ఆ బ్రాహ్మణునికి సంతానం లేకుండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు సంతానం లేక విచారిస్తున్న తన భార్యతో "దేవీ! నేను తీవ్రమైన తపస్సు చేసి శ్రీహరిని మెప్పించి అతని అనుగ్రహంతో సంతానాన్ని పొందుతాను" అని చెప్పి గంగా తీరానికి వెళ్లాడు.

శ్రీహరి అనుగ్రహం కోసం కఠోర తపస్సు

ఆ బ్రాహ్మణుడు శ్రీహరి కోసం గంగా తీరంలో తన ఎడమకాలి బొటనవేలిపై నిలబడి సూర్యుని వంక తీక్షణంగా చూస్తూ నిద్రాహారాలు మాని కఠోర తపస్సు చేయడం మొదలుపెట్టాడు.

శ్రీహరి సాక్షాత్కారం

విప్రుని తపస్సుకు మెచ్చిన ఆ శ్రీహరి ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తనకు ఇహంలో పుత్ర సంతానం కావాలని, పరంలో మోక్షం కావాలని కోరుకున్నాడు. అంతట దయామయుడైన ఆ శ్రీహరి అతనికి పుత్ర సంతానం కలుగుతుందని వరం ఇచ్చాడు.

విప్రునికి సంతానప్రాప్తి

శ్రీహరి ఇచ్చిన వరంతో సంతోషంతో బ్రాహ్మణుడు ఇంటికి చేరుకున్నాడు. కొన్ని రోజులకు బ్రాహ్మణుని భార్య గర్భం దాల్చి నెలలు నిండక మగ పిల్లవానికి జన్మనిచ్చింది. శ్రీహరి వర ప్రభావంతో జన్మించిన ఆ పుత్రుని చూసి విప్రదంపతులు మురిసిపోయారు. ఆ పిల్లవాడిని అల్లారుముద్దుగా పెంచసాగారు. ఆ బాలుడు కూడా ఉదయిస్తున్న భానుని వలే దినదినాభివృద్ధి చెందసాగాడు.

నారదుని రాక

ఒకరోజు పుత్రుని ఆటపాటలు ముద్దు మురిపాలతో ఆనందంగా గడుపుతున్న విప్ర దంపతుల ఇంటికి నారదుడు వచ్చాడు. నారదుడు ఆ బాలుని చూసి అతని తండ్రితో "విప్రోత్తమా! నీ కుమారునికి పన్నెండు సంవత్సరాలు మాత్రమే అయుష్హు ఉంది. ఆ తరువాత అతడు మరణిస్తాడని చెప్పి వెళ్లిపోయాడు.

విప్రదంపతుల శోకం

నారదుని మాటలకు ఆ విప్రదంపతులు పుత్రశోకంతో కంటిమంటికి ఏకధారగా విలపించసాగారు. విప్రుడు శోక సాగరంలో మునిగి ఆలోచిస్తుండెను. అతని భార్య కుమారుని ఒళ్లో కూర్చోబెట్టుకుని "అయ్యో! నా భర్త ఎంతో కష్టపడి తపస్సు చేసి ఈ పుత్రుని పొందాడు. ఇప్పుడు ఈ బాలుడు అల్పాయుష్కుడయ్యాడు" అని అనుకుంటూ దుఃఖించసాగెను. చూస్తుండగానే బాలునికి పన్నెండేళ్ల వయసు వచ్చింది. విప్రుడు తన కుమారునికి ఉపనయనాది కర్మలు యధావిధిగా జరిపించాడు.

విప్రుని జ్ఞానబోధ

విప్రుని భార్య మాత్రం త్వరలో రాబోవు పుత్ర శోకాన్ని ఎలా భరించగలమా అని దుఃఖించసాగెను. ఆమె తన భర్తతో "నాధా! నేను ఈ పుత్ర శోకాన్ని భరించలేని. మీరు నాకు ఆజ్ఞ ఇవ్వండి. నేను నదిలో దూకి ప్రాణత్యాగం చేసుకుంటాను" అని పలికింది. తన భార్య మాటలు విని విప్రుడు ఆమెను సమీపించి ఆమెకు జ్ఞానబోధ చేయదలచి ఈ విధంగా ఆత్మజ్ఞానాన్ని చెప్పడం ప్రారంభించాడు. గృత్స్నమద మహర్షి ఇక్కడి వరకు చెప్పి పదిహేడవ అధ్యాయాన్ని ముగించాడు. 

ఇతి స్కాందపురాణే! మాఘమాస మహాత్యే! సప్తదశోధ్యాయః సమాప్తః

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages