Lakshmi Jayanti: లక్ష్మి జయంతి
ఉత్తర ఫాల్గుణ ఉనక్షత్రంతో కూడిన ఫాల్గుణ పౌర్ణమిని లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజుగా పురాణాలు చెబుతున్నాయి.
క్షీరసాగర మథనంలో ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ, ఉత్తర ఫాల్గుణి నక్షత్రం నాడు లక్ష్మీదేవి ఉద్భవించింది. ఉత్తర ఫాల్గుణితో కూడిన పున్నమి ఉన్ననాడే లక్ష్మీ ఆవిర్భావ దినాన్ని ఆచరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
లక్ష్మీదేవి ఆవిర్భావానికి సంబంధించిన పురాణ గాధ ఒకటి ప్రచారంలో ఉంది. ఒకనాడు దూర్వాస మహర్షికి ఒక అప్సరస పూలమాలతో ఎదురుపడింది. ఆ పూల మాలను తనకు ఇమ్మని మహర్షి అడగగా, అప్సరస ఆ మాలను మహర్షికి ఇచ్చింది. పూల మాలను తీసుకున్న దూర్వాస మహర్షి స్వర్గమునకు వెళ్ళుతుండగా అప్పుడే ఐరావతంపై వస్తున్న ఇంద్రుడు ఎదురయ్యాడు. మహర్షికి నమస్కరించాడు. మహర్షి తన చేతిలోని మాలను ఇంద్రుడికి ఇచ్చాడు. ఇంద్రుడు ఆ మాలను వాసన చూసి ఐరావతం కుంభ స్థలంపై ఉంచాడు. ఐరావతం ఆమాలను తొండంతో తీసి కిందపడవేసింది. అది చూసి ఇంద్రునిపై ఆగ్రహించిన దూర్వాసుడు ఈ రోజు నుండి మూడు లోకాలలో లక్ష్మీ కనిపించకుండా పోతుందని శపించాడు.
లక్ష్మి అదృశ్యం కాగానే రాక్షసులు స్వర్గంపై దాడి చేసి ఆక్రమించుకున్నారు. రాజ్యం కోల్పోయిన ఇంద్రుడు ఇతర దేవతలో కలిసి తిరిగి స్వర్గాన్ని పొందడానికి రాక్షసులతో భీకర పోరాటం చేశారు. ఆ యుద్ధంలో దేవతలు ఓడిపోయారు. అప్పుడు దేవతలందరు కలిసి శ్రీహరిని వేడుకున్నారు. రాక్షసులతో సంధి చేసుకుని వారితో కలిసి క్షీరసాగరం చిలకమని శ్రీహరి సూచించాడు. అప్పుడు సాగరంలో నుండి వచ్చిన అమృతాన్ని సేవిస్తే మరణం ఉండదని చెబుతాడు.
సాగర మథనంలో మొదట వచ్చిన గరళాన్ని శంకరుడు సేవించాడు. అలాగే చంద్రుడు, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం, అప్సరసలు, కౌస్తుభమణి వంటివి వచ్చిన పిదప 'సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి ఉద్భవించింది. ఆ తరువాత వచ్చిన అమృతాన్ని దేవతలకు పంచాడు. ఇదంతా అమృతం కోసమే కాదని దూర్వాసుని శాపం వలన సముద్రంలో దాగి ఉన్న లక్ష్మీదేవిని బయటకు రప్పించడానికే అని ఓ పురాణ కథనం.
ఫాల్గుణ మాసంలో ఉత్తర ఫాల్గుణితో కూడి ఉన్న పున్నమి నాడు లక్ష్మీ అవిర్భావ దినాన్ని వైభవంగా జరుపుకుంటారు. లక్ష్మీదేవిని పాలతో అభిషేకం చేసి ఆరాధిస్తారు. లక్ష్మీదేవి శ్రీ స్తుతిని ప్రతి రోజు ఉదయం సాయంత్రం చదువుకుంటే అష్టశ్వర్యాలు కలుగుతాయి. కార్యజయం సిద్ధిస్తుంది. ఈ ఫాల్గుణ పూర్ణిమ నాడు ఉపవాసం ఉండి లక్ష్మీ నారాయణులను పాలతో అభిషేకించాలి. ఆ రోజు రాత్రి జాగరణ చేయాలి. ఇలా చేసినవారికి ఆయురారోగ్యాలు, సత్సంతానం, విశేష ఫలితాలు కలుగుతాయి.
2025: మార్చి 14.
Comments
Post a Comment