గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షితో "ఓ జహ్నువూ! చూసావుగా! మాఘమాసం ఎంతటి విశిష్టమైనదో! ధర్మ సాధనకు ఉపయోగపడే అన్ని సాధనములలోకెల్లా మాఘమాస వ్రతం అమిత శ్రేష్టమైనది. మాఘ మాస వ్రతం సర్వవిధ తపస్సుల సారం. కోటి అశ్వమేధ యాగాల ఫలం మాఘమాస వ్రతంతో కలుగుతుంది. శ్రీహరికి, పరమశివునికి ప్రీతికరమైనది మాఘమాసం. మాఘమాస వ్రత ప్రభావం గురించి వినడానికి నీవు ఆసక్తి చూపించావు కాబట్టి నీకు వివరించాను. శ్రీహరి భక్తులు ఏ ధర్మాన్ని నిర్వహింపకపోయినా ఒక్క మాఘ మాస వ్రతాన్ని నిర్వహిస్తే చాలు సకల ధర్మాలను నిర్వర్తించిన ఫలం కలుగుతుంది. మాఘమాసంలో మాఘ పురాణాన్ని భక్తిశ్రద్దలతో చదివినా, విన్నా సమస్త పాపముల నుంచి ముక్తిని పొంది వైకుంఠాన్ని చేరుతారు." అని గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షికి మాఘమాస వ్రతమహాత్యాన్ని వివరించాడు.
శివపార్వతులు సంవాదం
కైలాసంలో పరమశివుడు పార్వతితో "పార్వతీ! సకల ధర్మవిదురుడైన గృత్సమద మహర్షి చెప్పిన మాఘమాస ప్రభావమును జహ్ను మహర్షి విని మాఘ వ్రతాన్ని ఆచరించి మోక్షాన్ని పొందాడు. ముల్లోకాలలో మాఘ వ్రతంతో సమానమైన వ్రతం ఇంకొకటి లేదు. ఇది బహురహస్యమైన విషయం. నీవు నాకు అర్ధాంగివి కాబట్టి నీకు ఈ విషయాన్ని తెలియజేశాను." అంటూ శివుడు పార్వతితో మాఘమాస వ్రత మహాత్యాన్ని చక్కగా వివరించాడు.
సూత ఉవాచ
నైమిశారణ్యంలో శూత మహాముని "శౌనకాది మహా మునులారా! కైలాసంలో వెండికొండపై ఉన్న పరమశివుడు తన అర్ధాంగి పార్వతితో చెప్పిన మాఘమాస వ్రతమహాత్యాన్ని భక్తిశ్రద్ధలతో వినడానికి ఆసక్తి చూపిన మీకందరకూ వివరించాను. మాఘవ్రతం సమస్తమైన పుణ్యాలను ఇస్తుంది. సకల సంపదలను, సత్కీర్తిని, దీర్ఘాయుష్షుని ఇస్తుంది. మాఘ మాస వ్రతాన్ని ఆచరించిన వారికి రోగ భయం, మరణ భయం ఉండదు. భక్తిశ్రద్ధలతో శ్రీహరిని మనసున నిలిపి మాఘ వ్రతాన్ని ఆచరించిన వారికి ఇహలోకంలో సకల భోగాలు, అంత్యమున విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఎవరైతే భక్తిశ్రద్ధలతో ఈ మాఘ పురాణాన్ని వినడం కానీ చదవడం కానీ చేస్తారో వారి సకల అభీష్టములు నెరవేరును. శ్రీహరిపై భక్తి లేని వారికి ఈ మాఘ పురాణం వినిపించరాదు. సద్గుణ శీలులకు మాత్రమే మాఘ పురాణం వినిపించాలని శాస్త్రం చెబుతోంది. ఇది సత్యం" అని సుతుడు శౌనకాది మహామునులకు మాఘ పురాణం మహత్యాన్ని వివరించాడు.
ఈ రోజుతో మాఘ పురాణం సంపూర్ణం అయింది.
ఇతి స్కాందపురాణే! మాఘమాస మహాత్యే! ఏకోన త్రింశాధ్యాయ సమాప్తః
No comments:
Post a Comment