మాఘ పురాణం పదిహేనవ అధ్యాయం
బ్రహ్మమహేశ్వరుల కలహంపూర్వం బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు రజో తమో గుణాలకు లోబడి ఒకరికంటే మరొకరు గొప్పవారని అహంభావంతో కలహించుకోసాగిరి. పరమశివుడు బ్రహ్మతో "నేను అన్ని లోకాలకు అధిపతిని! ఈ పదునాల్గు లోకాలలో నన్ను మించిన వారు లేరు" అనగా బ్రహ్మదేవుడు కూడా తన ఆధిపత్యాన్ని తెలియజేశాడు. ఈ విధంగా వెయ్యి సంవత్సరాల పాటు వారి కలహం కొనసాగింది.
శ్రీహరి విశ్వరూపం
బ్రహ్మ మహేశ్వరుల కలహాన్ని నివారించడానికి ఆ శ్రీహరి సహస్రాక్ష సహస్రపాదుడుగా అంటే అనంతమైన శిరసులు, నేత్రాలు, చేతులు, పాదాలు కలిగిన వాడై దివ్యమైన శరీరం కలిగిన తన విశ్వరూపంతో బ్రహ్మమహేశ్వరుల ముందు సాక్షాత్కరించాడు.
శ్రీహరి ఆద్యంతాలు కనుగొనలేకపోయిన బ్రహ్మమహేశ్వరులు
ఈ ప్రపంచాన్ని మొత్తం ఆక్రమించిన ఆ శ్రీహరి విశ్వరూపం ఆద్యంతాలు కనుగొనడానికి బ్రహ్మమహేశ్వరులు బయల్దేరారు. కానీ ఆద్యంతరహితుడైన ఆ శ్రీహరి ఆది, అంతం కనుగొనడంలో వారు విఫలమయ్యారు. చివరకు వారు 'వెయ్యి సంవత్సరాలు వెతికినా ఆ శ్రీహరిని కనుగొనలేకపోయాము. అప్పుడు బ్రహ్మ మహేశ్వరులు మనం భగవంతులం, కర్తలం కానేకాదు. ఈ జగత్తు అంతా వ్యాపించిన ఆ శ్రీహరియే అందరికంటే గొప్పవాడు.' అని తలచి ఆ శ్రీహరిని శరణు వేడారు.
శ్రీహరిని స్తుతించిన బ్రహ్మమహేశ్వరులు
శ్రీహరి కన్నా గొప్పవాడు లేదని గ్రహించిన బ్రహ్మమహేశ్వరులు "శ్రీహరీ! ఓ త్రిమూర్తి స్వరూపా! నీకు శతకోటి వందనాలు. సకల దేవతలయందు, సకల ప్రాణులయందు ఉన్న నిన్ను కనుగొనలేక అజ్ఞానంతో మాలో మేమే కలహించుకోసాగాం. లోకాధిపత్యం మాదంటే మాదే అని వేల సంవత్సరాల నుంచి కలహించుకుంటున్నాం. నీవే స్వయంప్రభుడవై దయాస్వరూపుడవై మా కలహం పోగొట్టడానికి ఇట్లు సంకల్పించావు. నీ దివ్య దర్శనంతో మాకు పరిశుద్ధమైన బుద్ధి కలిగింది. ఇక సామాన్య రూపం ధరించి మమ్మల్ని దయతో చూడుము" అని పరిపరి విధాలుగా తనను స్తుతిస్తున్న బ్రహ్మమహేశ్వరులు చూసి శ్రీహరి ఈ విధంగా పలికాడు.
బ్రహ్మమహేశ్వరులకు శ్రీహరి ప్రబోధ
"ఓ మహేశా! బ్రహ్మదేవా! మీ కలహమునకు కారణం తెలిపి కలహాన్ని తీర్చడానికే నేను విశ్వరూపం ధరించాను. నా దివ్యరూపం చూసే సమర్థత లేకనే మీరు మీ కలహాన్ని కట్టిపెట్టి ప్రసన్నవదనులై నన్ను స్తుతించారు. మీ కలహానికి సత్వ తమో రజో గుణాలే కారణం. ప్రకృతి వలన ప్రాప్తించిన ఈ మూడు గుణాలే మీ కలహానికి కారణమయ్యాయి. నేను గొప్పవాడను! గొప్ప ధనాన్ని సంపాదించాను! నా వంటి గొప్పవాడు ఈ లోకంలో లేడు అని అనుకోవడం సత్వ తమో రజో గుణాల ప్రభావం. ఈ గుణ మహిమ వలన మీ కలహం వేయి సంవత్సరాలు సాగింది.
బ్రహ్మను స్తుతించిన విష్ణువు
ఈ ప్రపంచమంతా వ్యాపించిన నేనే మూడు రూపాలుగా సృష్టి స్థితి లయమనే కార్యాలు నిర్వహిస్తున్నాను. మీరివురు కూడా నా అంశలే! అంటూ బ్రహ్మదేవునితో విష్ణువు ఓ బ్రహ్మదేవా! నీవు ప్రభుడవు! అన్ని ప్రాణులను సృష్టించుచున్నావు నా గర్భమందుండి నా నాభికమలమున ఉద్భవించావు. నీవు సురాలను, మునులను కూడా రక్షించి వారిచేత వందనములు అందుకునే గొప్పవాడివి" అని బ్రహ్మను స్తుతించిన విష్ణువు శివుని గొప్పతనాన్ని కూడా ఈ విధంగా చెప్పసాగెను" అంటూ గృత్స్నమదమహర్షి జహ్నుమహర్షితో "ఓ జహ్నువూ! శ్రీహరి విశ్వరూపం ధరించిన ఈ కథను మాఘమాసంలో విన్నవారికి చదివిన వారికి మాఘవ్రతం చేసిన ఫలితం దక్కుతుందని చెబుతూ గృత్స్నమదమహర్షి పదిహేనవ అధ్యాయాన్ని ముగించాడు.
ఇతి స్కాందపురాణే! మాఘమాస మహాత్యే! పంచదశాధ్యాయ సమాప్తః
No comments:
Post a Comment