Magha Puranam Telugu: మాఘ పురాణం 14వ అధ్యాయం - నైమిశారణ్యంలో భీకర కలహం- మార్కండేయుని ప్రవచనంతో శాంతించిన మునుల కథ - HINDU DHARMAM

Latest Posts

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday, February 11, 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 14వ అధ్యాయం - నైమిశారణ్యంలో భీకర కలహం- మార్కండేయుని ప్రవచనంతో శాంతించిన మునుల కథ

 

గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షుల సంవాదం

గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షితో పదునాల్గవ అధ్యాయాన్ని ఈ విధంగా చెప్పసాగెను.

మాఘ పురాణం పదునాల్గవ అధ్యాయం

నైమిశారణ్యం విశిష్టత

నైమిశారణ్యం ఉత్తరప్రదేశ్‌లోని సీతాపుర్‌ జిల్లాలో లఖ్​నవూకు 94కి.మీ. దూరంలో ఉంది. గోమతినది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం వేలాది సాధుసన్యాసులు తపమాచరించే పవిత్ర ప్రదేశం. వేదవ్యాసుడు నైమిశారణ్యంలోనే మహాభారతాన్ని రచించినట్టు తెలుస్తోంది. మహా భారతం, రామాయణం, వాయుపురాణం, వరాహపురాణాల్లో నైమిశారణ్య ప్రస్తావన ఉంది. నైమిశారణ్యం సాక్షాత్తు శ్రీమన్నారాయణుని స్వరూపం. ఇక్కడ విష్ణువు వనరూపంలో పూజలందుకుంటున్నాడు.

నైమిశారణ్యంలో మునుల కలహం

పూర్వం ఎందరో మునీశ్వరులు ఆవాసమైన గౌతమి నదీతీరంలోని నైమిశారణ్యంలో మహామహులైన మునీశ్వరులు చర్చించుకుంటుండగా హఠాత్తుగా వారి మధ్య వారిలో ఎవరు గొప్పవారన్న చర్చ మొదలై అది కలహానికి దారి తీసింది.

మునుల ప్రగల్భాలు

మునులందరూ ఎవరికివారు తామే గొప్పవారమని ప్రకటించుకోసాగారు. ముందుగా భృగు మహర్షి లేచి "నేను తపోనిష్ఠుడను, యోగీశ్వరులలో మొదటివాడను కాబట్టి నేనే గొప్పవాడినని" అన్నాడు. తరువాత గౌతముడు లేచి "నేను వయసు చేత పెద్దవాడిని కాబట్తి నేనే గొప్పవాడినని" అన్నాడు. అలాగే రోమనుడు, గార్గ్యుడు, మాండవ్యుడు, శంతనుడు, పౌలస్త్యుడు, శౌనకుడు ఎవరికి వారు తామే గొప్పవారమని అందరికంటే అధికులమని ప్రకటించుకోసాగారు. ఈ వివాదం ముదిరి కలహానికి దారితీసింది.

మునుల మధ్య యుద్ధం

మునుల మధ్య వివాదం పెరిగి కామక్రోధాలను జయించిన ఆ మునులు కూడా క్షణికావేశానికి లోనై యుద్ధానికి దిగారు. ముందుగా కొందరు మునులు భృగు మహర్షిని సమీపించి ఆయన జటలు పీకి ముష్టితో (పిడికిలితో) పొడిచారు. మరికొందరు గౌతముని గడ్డం పీకి హింసించగా గౌతముడు కూడా వారిని తన పిడికిళ్లతో పొడిచాడు. మిగిలిన వృద్ధులైన గార్గ్య, మాండవ్య మునులు యుద్ధం చేయడానికి వయోభారంతో శరీరం సహకరించక తమ ప్రత్యర్థుల శాలువాలు, కౌపీనాలు చించి వేశారు. దండకమండలాలను విరిచివేసారు. వారంతా విప్రులు కనుక వారి వద్ద ఉన్న దండకమండలాలనే ఆయుధాలుగా చేసుకొని పోరాడసాగారు.

నారదుని రాక

నైమిశారణ్యంలో మునులు ఈ విధంగా యుద్ధం చేస్తున్న సమయంలో కలహప్రియుడు నారదుడు అక్కడకు వచ్చి వారి మధ్య కలహాన్ని మరికొంచెం పెంచి, ఈ విషయాన్ని శ్రీహరికి చెప్పడానికి వైకుంఠానికి వెళ్లాడు. నారదుడు వైకుంఠంలో శ్రీహరికి నైమిశారణ్యంలో మునుల యుద్ధం గురించి వివరించాడు.

శ్రీహరి ప్రబోధ

నారదుడు చెప్పిన మాటలు విన్న శ్రీహరి నారదునితో "ఓ మునిశ్రేష్ఠా! నా మాయచేతనే మునులు ఈ విధంగా కలహించుకుంటున్నారు. మునులలోని ఈర్ష్య అసూయలను మాయోపాయం చేత పోగొట్టాలి. కాబట్టి ఎప్పుడూ అయిదు సంవత్సరాల బాలురిగానే ఉండే సనకసనంద సనత్సుజాతులను అక్కడకు పంపుతాను. వీరితో పాటు గొప్ప మేధావి, చిరంజీవి అయిన మార్కండేయుడు అక్కడకు వస్తాడు. మార్కండేయునికి సనకసనంద సనత్సుజాతులకు మధ్య జరిగే సంవాదంతో మహర్షులలో పరివర్తన కలుగుతుంది. నీవు కూడా అక్కడకు వెళ్లి జరిగేది చూడు" అన్న శ్రీహరి మాటలకు నారదుడు వడివడిగా నైమిశారణ్యానికి వెళ్లాడు.

సనకసనందనాదులకు మార్కండేయుని స్వాగత సత్కారాలు

శ్రీహరి ఆజ్ఞానుసారం మార్కండేయుడు నైమిశారణ్యానికి వచ్చి మునులను శాంతింపజేయ ప్రయత్నించెను. మార్కండేయుని మృదు వాక్కుల ప్రభావం చేత మునులు శాంతించారు. కొంతసేపటికి బ్రహ్మజ్ఞాన సంపన్నులు అయిన సనకసనందనాది మునులు అక్కడకు వచ్చారు. వారు ఎప్పటికి అయిదు సంవత్సర బాలుర వలే ఉంటారు. కానీ వారి బ్రహ్మజ్ఞానం అపారం. మార్కండేయుడు వారికి ఎదురేగి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి, తగురీతిలో సత్కరించి, వారికి పాదాభివందనం, వారి పాదాలు కడిగి ఆ నీళ్లు తన శిరస్సున చల్లుకున్నాడు.

సనకసనందనాదుల సందేహం

చిన్నవారమైన తమకు పాదాభివందనం చేసిన మార్కండేయుని చూసి సనకసనందనాదులు ఈ విధంగా అన్నారు. "మహానుభావా! నీవు వృద్ధుడవు! బ్రహ్మాది దేవతల చేత స్తుతింపబడేవాడవు. అలాంటి నీవు ఈ సభలో బాలురమైన మాకు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి, పాదాభివందనం ఎందుకు చేశావు"? పెద్దలు చిన్న పిల్లలకు ఇలాంటివి చేయకూడదు కదా! అంటున్న సనకసనందనాదులతో మార్కండేయుడు ఇలా అన్నాడు.

మార్కండేయుని ప్రవచనం

ఓ ముని వల్లభులారా! మీరు బ్రహ్మజ్ఞానులు. ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి లేకుండా సదా శ్రీహరి నామస్మరణతో కాలం గడిపేవారు. ప్రతి జీవికి ప్రతి రోజూ ఆయుష్షు ఎంతోకొంత తగ్గిపోతూ ఉంటుంది. వయసులో పెద్దవారైనా ఎంత బ్రహ్మ జ్ఞానాన్ని సంపాదించినా శ్రీహరి మీద భక్తి లేకపోతే ఏమి లాభం? అలాంటి వారు ఎన్నడూ పూజనీయులు కాలేరు. మీరు వయసులో చిన్నవారైనా శ్రీహరి భక్తిలో అందరికంటే ఉన్నత స్థానంలో ఉన్నారు. అందుకే మీరు సదా పూజనీయులు. శ్రీహరిని పూజించక, శ్రీహరి కధలను వినకుండా కోటి కల్పాలు జీవించినా ఏమి ప్రయోజనం? అలాంటివారు ఎన్నటికీ ఉత్తములు కాలేరు. విష్ణు కథను విననివారు వృద్ధుడైనా బాలునితో సమానం. శ్రీహరి కథలను వింటూ, చెబుతూ ఉండేవారు బాలురైనా దేవతలచే పూజించే వారు అవుతారు. అందుకే మీరు ఐదేండ్ల బాలురైన మాకు గురువులతో సమానం. మేము మీకు శిష్యులం!" అని మార్కండేయుడు పలికిన మాటలు విని సనకసనందనాదులు ఆ ఆశ్రమంలోని మునులకు శ్రీహరి కథామృతమును పంచిపెట్టారు. తరువాత వారు, వారితో పాటు నారదుడు వైకుంఠానికి వెళ్లి శ్రీహరికి జరిగినదంతా వివరించారు.

శాంతించిన మునులు

అప్పుడు శ్రీహరి వ్యాసుని అంశతో వేదవేదాంతమును సూతునికి వివరించాడు. సూతుని వలన నైమిశారణ్యంలో మునులందరూ హరికథలు విని సంతృప్తి చెందారు. హరికథ మహత్యంతో మునులందరూ వారి కలహాన్ని వీడి శాంతించారు.

గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షితో " చూశావుగా! జహ్నువూ! ఈ విధంగా విష్ణు కథలను వినడం ద్వారా శాంత స్వభావులైన మునుల కథను విన్నా చదివినా ముక్తిని పొందుతారు" అంటూ పదునాల్గవ అధ్యాయాన్ని ముగించాడు. 

ఇతి స్కాంద పురాణే! మాఘమాస మహాత్యే! చతుర్దశాధ్యాయ సమాప్తః

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages