భగవంతుని సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడానికి కొంత సమయం పడుతుంది. ఆ మాత్రం పారాయణం చేసే శక్తి, సమయం లేనివారికోసం అష్టోత్తరశతనామ స్తోత్రాలు ఉన్నవి. ఆలయాల్లో, గృహాల్లో అర్చన చేసేటప్పుడు ఈ స్తోత్రాలే ఉపయోగింపబడుతున్నవి. వీనిని చెప్పుకోవడానికి ఒక పది నిమిషాలు పట్టవచ్చు. అయితే, ఇంకా సులభంగా, తక్కువ సమయంలో భగవన్నామాలను అనుసంధానం చేయడం కోసం ఉన్నవే భగవంతుని 'కేశవాది ద్వాదశనామాలు.
కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర' అనే నామాలే ఈ 12 నామాలు.
ఈ 12 నామాలు పలుచోట్ల ఉపయోగపడు తున్నాయి. ఉత్తరభారతంలో అయితే, ఈ 12 నామాలే సంవత్సరంలోని 12 మాసాలకు పేర్లుగా వ్యవహరింప బడుతున్నాయి. ఈ క్రమంలో మార్గశిరమాసమే 'కేశవ' నామంతో వ్యవహరింపబడే మొదటి మాసం. ఈ మాసం నుండి ఆరంభించి క్రమంగా 12 నెలలు 12 నామాలతో నిర్దేశింపబడుతున్నాయి. చివరి మాసం అయిన కార్తికమాసం 'దామోదర’మాసమని పిలువబడుతున్నది.
మన ఇళ్లలో భగవదారాధన చేసేటప్పుడు. మంత్రపుష్ప సమయంలో ఈ పన్నెండు నామాలతో ఆరంభించి అర్చన చేయడం, చివరిలో కూడా ఈ 12 నామాలను చెప్పడం సంప్రదాయంగా వస్తున్నది.
భగవదాలయాలలో ఆగమానుసారంగా బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన తరువాత, ద్వాదశా రాధన అనే ఒక కార్యక్రమం చేస్తారు. ఇందులో ఈ 12 ఆరాధనలు ద్వాదశనామ పూర్వకంగానే సంకల్పం చేసి, చేస్తారు.
శ్రీవైష్ణవుడైనవాడు ప్రతి ఒక్కడూ తన శరీరంలో నుదుటి నుండి ఆరంభించి పన్నెండు ఊర్ధ్వపుండ్రాలను ధరించాలి అని నియమం. ఈ 12 పుండ్రాలు కేశవాది ద్వాదశనామ పూర్వకం గానే ధరించాలి అనే నియమం కూడా ఉంది. 'ఫాలభాగం'లో ధరించే పుండ్రానికి కేశవనామం 'ఉదరం మధ్య'లో నారాయణ నామం, 'హృదయం'లో మాధవనామం, 'కంఠప్రదేశం'లో గోవింద నామం, ‘ఉదరానికి కుడివైపున' విష్ణునామం, 'కుడిచేయి భుజం'పై మధుసూదననామం, 'కంఠానికి కుడివైపున' త్రివిక్రమనామం, 'ఉదరానికి ఎడమవైపున' వామననామం, 'ఎడమభుజం'పై శ్రీధర నామం, 'కంఠానికి ఎడమవైపున' హృషీకేశనామం, ‘వెనుక వైపు నడుమభాగం'లో పద్మనాభనామం, 'కంఠానికి వెనుక వైపున' దామోదర నామం- అని ఈ విధంగా మన శరీరంలో 12 చోట్ల ధరించే 12 పుండ్రాలకు 12 నామాలు నిర్దేశించారు పూర్వాచార్యులు.
No comments:
Post a Comment