ఉగాదితో ప్రారంభమయ్యే వసంతంలో ఐదవరోజున వస్తుంది లక్ష్మీపంచమి. ఈరోజున లక్ష్మీదేవిని పూజచేసిన వారికి ధనధాన్యాదులు కలుగుతాయని పెద్దలు తెలుపుతారు.
చైత్రశుద్ధపంచమి శ్రీపంచమి. ఈనాడు లక్ష్మీపూజను ఆచరించాలి. మానవుల దారిద్య్రబాధలను తొలగించేందుకు నారాయణుని ఆదేశంతో బ్రహ్మలోకం నుండి మానవలోకానికిఅందిచబడినదే ఈ లక్ష్మీపూజ. ఈ వ్రతాన్ని ఆచరించినవారి ధనం స్థిరంగా నిలచి ఉంటుందని “హేమాద్రివ్రతఖండం” స్పష్టం చేసింది.
ఈ వ్రతాచరణలో భాగంగా, బంగారమువంటి కాంతితో, శ్రీమహావిష్ణువుయందు అనురాగం కలిగినది, బంగారు, వెండి పుష్పముల మాలికలు ధరించినది, చంద్రునివలె సకలలోకాలకు ఆహ్లాదం కలిగించునది అయిన శ్రీమహాలక్ష్మిని ఆవాహన చేసి భక్తితో పూజాదికాలు నిర్వహించాలి.
అమ్మవారికి తెల్లనిరంగు పువ్వులతో పూజలు, క్షీరాన్నం,నేతి పిండివంటలు, చెరుకు,అరటిపండ్లు నివేదన చేస్తే మంచిఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు. చైత్ర శుద్ధ పంచమి రోజు తమ పెద్దవారిని గుర్తుచేసుకుంటూ బీదవారికి అన్నసంతర్పణ చేస్తే తత్ఫలితంగా వారి పెద్దలు పుణ్యలోకాలకు చేరుతారని “వ్రతచూడామణి” వివరిస్తోంది.
ఒకానొక సందర్భంలో సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు బిల్వదళాలతో పరమశివుడ్ని అర్చించగా సంతసించిన శివుడు సర్వదేవతలచేత పూజించబడే వరాన్ని విష్ణుమూర్తికి ప్రసాదించాడట. ఆనాటినుండి బిల్వవృక్షం శ్రీవృక్షంగా, బిల్వఫలం శ్రీఫలంగా ఖ్యాతిగాంచాయని పురాణోక్తి. అంతటి ప్రశస్తి ఉన్నదికాబట్టే ఈనాడు ఈవృక్షం పవిత్రవృక్షంగా పూజింపబడుతోంది. అటువంటి మారేడుచెట్టుక్రింద చైత్రశుద్ధపంచమినాడు లక్ష్మీదేవిని అర్చించినవారికి జన్మజన్మల దారిద్య్రం తొలగి లక్ష్మీప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం. మారేడువృక్షం మొదట్లో ప్రతిమారూపకంగాగాని, లేదా ఒక కలశంపై గాని అమ్మవారిని ఆవాహనచేసి యథాశక్తిగా పూజిస్తే చక్కటి ఫలితాలను పొందవచ్చు.
ఈ చైత్రశుద్ధపంచమి నాడు ఆచరించవలసిన వాటిలో సర్పారాధన కూడా ఒకటి. వాసుకి, తక్షక, ఐరావత, ధనంజయ, కర్కోటక, శంఖపాల, గుళిక మరియు అనంత అనబడే ఎనిమిది రకాల నాగదేవతలను ఆరాధించాలి. వారికి పాలు, నెయ్యి నివేదన చేసి ప్రార్థించాలి.
ఆసక్తికరమైన మరోవ్రతాన్ని చతుర్వర్గ చింతామణి తెలియజేస్తోంది. అదే హయపూజా విధానం. హయం అంటే గుర్రం దీనిలో భాగంగా ఉచ్చైశ్రవాన్ని పూజిస్తారు. దేవతలు-రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని మధిస్తుంటే దానిలోనుండి ఆవిర్భవించిందే ఈ ఉచ్చైశ్రవం. ఇది అశ్వజాతికి మూలాధారం వంటింది. ఒకనాటి రాజులకాలంలో అశ్వాలను విరివిగా ఉపయోగించేవారు కాబట్టి ఈ ఉచ్చైశ్రవవ్రతం హయపంచమి వ్రతంగా విరివిగా ఆచారంలో ఉండేదని తెలుస్తోంది.
No comments:
Post a Comment