చైత్ర శుద్ధ అష్టమి రోజున అశోకాష్టమిగా జరుపుకుంటాం.
అశోకాష్టమి విశిష్టత
అశోకం అంటే శోకాన్ని తొలగించేది అర్ధం. ఈ రోజున దుర్గాదేవిని శక్తిరూపంలో, పరమశివుని లింగరాజు రూపంలో పూజించడం సంప్రదాయం. దక్షిణాదిన అంతగా కనిపించని ఈ పండుగను ముఖ్యంగా ఒడిశాలో ఘనంగా జరుపుకుంటారు. భువనేశ్వర్‌లోని ప్రసిద్ధ లింగరాజ ఆలయంలో ఒక ముఖ్యమైన ఉత్సవం. ఈ పవిత్రమైన రోజున భక్తులు శక్తి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆమె అనుగ్రహం పొందడానికి ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేస్తారు. ఒడిశా ప్రజలు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. అశోకాష్టమి రోజు భువనేశ్వర్‌లోని ప్రసిద్ధ లింగరాజ ఆలయంలో జరిగే రథయాత్రలో పాల్గొనడానికి ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తారు.
అశోకాష్టమి వెనుక ఉన్న పౌరాణిక గాధ
అశోకాష్టమికి సంబంధించి అనేక ఇతిహాసాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒక కథనం ప్రకారం రావణాసురుని శక్తి దేవత అనుగ్రహం ఉండడం వల్ల రాముడు రావణుని సంహరించలేకపోతాడు. అప్పుడు రావణాసురుని తమ్ముడు విభీషణుడు శక్తిని ప్రార్ధించమని రామునికి సూచిస్తాడు. విభీషణుని సూచన మేరకు శ్రీరాముడు భువనేశ్వర్‌లోని లింగరాజ ఆలయంలో చైత్రశుద్ధ పాడ్యమి నుంచి 7 రోజుల పాటు శక్తిని, శివుడిని పూజించి వారి అనుగ్రహం కోసం ప్రార్థించాడు.
శ్రీరాముని అనుగ్రహించిన శక్తి
శ్రీరాముడు 7 రోజులు పూజలు చేసిన అనంతరం ఎనిమిదవ రోజున శక్తి దేవత రాముని అనుగ్రహించి, బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి రాక్షసుడిని సంహరించమని ఆదేశించింది. శక్తి అనుగ్రహంతో శ్రీరాముడు రావణాసుర సంహారం చేసాడని ప్రతీతి. శ్రీరామునికి శక్తి బ్రహ్మాస్త్రాన్ని ప్రసాదించింది అశోకాష్టమి రోజునే కాబట్టి శ్రీరాముడి విజయానికి చిహ్నంగా, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ మరుసటి రోజే శ్రీరామనవమి కాబట్టి అశోకాష్టమి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ఒడిశా ప్రజలు అశోకాష్టమిని భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.
విష్ణుమాసంగా పేరొందిన చైత్రమాసంలో విష్ణువు పరిపూర్ణ మానవ అవతారంగా శ్రీరాముడిగా ఈ భూమిపై జన్మించాడు. శ్రీరామునితో చైత్రమాసంలో ఎన్నో విశేషాలు ముడిపడి ఉన్నాయి. అందులో అశోకాష్టమి కూడా ఒకటి. వసంత నవరాత్రులలో ఎనిమిదవరోజు జరుపుకునే అశోకాష్టమిని మనం కూడా భక్తిశ్రద్ధలతో జరుపుకుందాం.
2025: ఏప్రిల్ 05
No comments:
Post a Comment