Magha Puranam Telugu: మాఘ పురాణం 2వ అధ్యాయం- వ్రత మహత్యంతో స్వర్గానికి వెళ్లిన దంపతులు కథ - HINDU DHARMAM

Latest Posts

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday, January 30, 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 2వ అధ్యాయం- వ్రత మహత్యంతో స్వర్గానికి వెళ్లిన దంపతులు కథ


కైలాసంలో పరమ శివుడు పార్వతితో "ఉమాదేవి! మాఘ స్నానం మహత్యం ఎంత చెప్పినా తనివితీరదు. పూర్వం మాఘ స్నానం ఆచరించి ఓ బ్రాహ్మణ స్త్రీ తన భర్తతో కలిసి స్వర్గానికి చేరుకున్న కథను చెబుతాను వినుము" అంటూ ఇలా చెప్పసాగెను.

బ్రాహ్మణ స్త్రీ వృత్తాంతం

పూర్వం సౌరాష్ట్ర ప్రాంతమందు బృందారకమనే గ్రామంలో సుదేవుడను బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదవేదాంగాలను చదివిన సుదేవుడు ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని సమస్త వేదసారాలను గ్రహించిన అనేకమంది శిష్యులతో కలిసి సదాచారవంతుడై జీవిస్తూ ఉండేవాడు. ఈ బ్రాహ్మణునికి సునంద అనే యవ్వనవతియైన అపురూప సౌందర్యవతియైన కుమార్తె ఉండేది. సుదేవుడు ఇంతటి సౌందర్యవతి అయిన కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయాలా అని నిరంతరం ఆలోచిస్తుండేవాడు.

సుమిత్రునితో కలిసి అరణ్యానికేగిన సునంద

ఒకనాడు గురువుగారి పూజ కోసం, హోమం కోసం పూవులు, సమిధలు తేవడానికి సుదేవుని శిష్యులలో ఒకడైన సుమిత్రుడు అరణ్యానికి బయల్దేరాడు. ఆశ్రమంలో బంతాట ఆడుకుంటున్న సునంద ఆడుకుంటూ ఆడుకుంటూ సుమిత్రునితో పాటు అరణ్యానికి వెళ్లింది. అరణ్యంలో చాలా దూరం వెళ్లాక కావలసినవి సేకరించిన తర్వాత అలసిపోయిన సుమిత్రుడు ఓ ప్రదేశంలో సేదతీరాడు.

ముగ్ద మనోహర ప్రదేశం

సుమిత్రునితో కలిసి వెళ్లిన సునంద ఆ ప్రాంత సౌందర్యానికి ముగ్ధురాలైంది. ఆ ప్రాంతమంతా విరబూసిన చెట్లతో, స్వచ్ఛమైన నీటితో నిండిన సరస్సులతో, తామర పువ్వులతో నిండిన కొలనులతో చూడచక్కగా ఉంది. వసంత శోభను తెలియజేసే పక్షుల కిలకిలరాలతో ఆ ప్రాంతం సందడిగా ఉంది. ఎన్నడూ చూడని అంతటి ప్రకృతి సౌందర్యాన్ని చూసిన సునంద మనసు ఒక్కసారిగా చెదిరింది. యుక్త వయసులో ఉన్న ఆమె కామవికారానికి లోనైంది.

సుమిత్రుని ప్రేరేపించిన సునంద

పూర్వజన్మ పాపమో, ప్రకృతి ప్రేరేపణో తెలియదు కానీ సునంద సుమిత్రునితో అనరాని మాటలు అనింది. తనతో కలిసి సంగమించమని కోరింది. కానీ సుమిత్రుడు అందుకు ఒప్పకోలేదు. గురువు కుమార్తె చెల్లెలుతో సమానమని, ఆమె చెప్పినట్లుగా చేస్తే సూర్య చంద్రులు ఉన్నత వరకు కర్మఫలం అనుభవించాల్సి వస్తుందని నచ్చ చెప్పాడు. గురువుగారు ఎదురు చూస్తుంటారు త్వరగా ఫలపుష్పాలు, సమిధలు తీసుకొని ఇంటికి వెళ్తామని సుమిత్రుడు ఎంత చెప్పినా సునంద వినిపించుకోదు.

సునంద మొండి వైఖరి

సుమిత్రునితో సునంద " సుమిత్రా! అయాచితంగా వచ్చే డబ్బును, విద్యను, బంగారాన్ని, అమృతం, కోరి వచ్చిన కన్యను కాదనడం మూర్ఖత్వం. నేను చెప్పినట్లు వినకపోతే ఈ అరణ్యంలోనే ఆత్మాహుతి చేసుకుంటాను. నేను లేకుండా నువ్వు ఒంటరిగా ఆశ్రమానికి తిరిగి వెళ్తితే నా తండ్రి శపిస్తాడు కాబట్టి మన కాసేపు సరస సల్లాపాలతో ఆనందంగా గడిపి తరువాత ఆశ్రమానికి వెళ్దాం" అని ప్రలోభపెట్టింది.

సునందకు లొంగిపోయిన సుమిత్రుడు

గత్యంతరం లేని విషమ పరిస్థితిలో సుమిత్రుడు ఆమెతో కలిసి ఆ వనంలో భోగాలు అనుభవించాడు. అనంతరం ఫలపుష్పాలు, సమిధలు తీసుకొని ఆశ్రమానికి తిరిగి వెళ్లారు.

సునంద వివాహం- వైధవ్యం

తరువాత కొంతకాలానికి సునంద తండ్రి సుదేవుడు ఆమెను ఓ కశ్మీర బ్రాహ్మణునికి ఇచ్చి వివాహం జరిపించాడు. వివాహం జరిగిన కొంతకాలానికే కర్మవశాత్తు సునంద భర్త మరణించాడు. వైధవ్యంతో పుట్టింటికి తిరిగి వచ్చిన సునందను చూసి సుదేవుడు మిక్కిలి దుఖిచాడు. తన కుమార్తెకు ఇంతటి దుఃఖం కలగడానికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ రోజులు గడపసాగాడు.

సుదేవుని ఆశ్రమానికి మహర్షి రాక

ఒకరోజు గొప్ప వ్రతనిష్ఠ కలవాడు, సమస్త ప్రాణులయందు దయ కలవాడు అయిన దృఢవ్రతుడనే మునీశ్వరుడు సుదేవుని ఆశ్రమానికి వచ్చాడు. కుమార్తె వైధవ్యంతో దుఃఖంతో ఉన్న సుదేవుని చూసి మునీశ్వరుడు అతని దుఃఖానికి కారణం అడుగగా సుదేవుడు మునీశ్వరునితో "ఓ మహర్షీ! నీ రాకతో నా ఆశ్రమం పావనమైంది. నా కుమార్తె చిన్న వయసులోనే వైధవ్యాన్ని అనుభవిస్తోంది. ఆమె దుఃఖాన్ని చుస్తే నాకు కూడా ఎంతో బాధగా ఉంది. ఈమెకు ఈ స్థితి కలగడానికి పూర్వజన్మలో ఈమె ఏ పాపం చేసింది? ఇందుకేమైనా పరిహారం ఉందా" అని అడిగాడు.

దివ్యదృష్టితో విషయం గ్రహించిన మహర్షి

అప్పుడు మహర్షి తన దివ్యదృష్టితో జరిగినదంతా తెలుసుకొని సుదేవునితో ఇలా అన్నాడు "ఓ మునీశ్వరా! నీ కుమార్తె గతజన్మలో క్షత్రియ కన్య. విదర్భ దేశాధిపతిని వివాహం చేసుకోండి. కానీ ఈమె దుష్ట బుద్ధితో జరాసక్తితో జారుల మాటలకు ప్రలోభపడి తన భర్త నిద్రిస్తున్న సమయంలో కత్తితో సంహరించింది. అటు తరువాత అదే కత్తితో పొడుచుకొని తాను కూడా మరణించింది. ఇలా ఆమె గతజన్మలో ఏకకాలంలో హత్య, ఆత్మహత్య అనే రెండు పాపాలు చేసింది. అలాగే ఈ జన్మలో సోదరుని వరసైన నీ శిష్యుని వశపరుచుకొని చేయరాని పాపం చేసింది. అందుకే ఆమెకు ఈ దుస్థితి పట్టింది. అయితే ఈమె అంతకు 14 జన్మల ముందు మాఘ మాసంలో నదీ స్నానం చేసి గౌరీ దేవి వ్రతం చేసిన పుణ్యానికి మహాత్ముడువైన నీ ఇంట పుట్టింది" అని చెప్పాడు.

సుదేవుని ఆగ్రహం

జరిగినదంతా విన్న సుదేవుడు చెవులు మూసుకొని 'హరీ హరీ! ఎంత పాపం జరిగింది! నా కుమార్తె ఇంతటి పాపాత్మురాలా! అని చింతించసాగాడు. కొంతసేపటికి తేరుకున్న సుదేవుడు ఆమె పాపాలు పోయి, ఆమె భర్త తిరిగి జీవించే ఉపాయం చెప్పమని మహర్షిని కోరాడు.

మాఘవ్రత మహత్యాన్ని చెప్పిన మహర్షి

సుదేవుని మాటలకు మహర్షి 'ఓ మునీశ్వరా! మాఘమాసంలో సూర్యుడు మకరరాశిలో ఉండగా సూర్యోదయ కాలంలో ఆమెచేత నదీస్నానం చేయింపుము. తరువాత ఆ నదీ తీరంలోనే ఆమెచేత ఇసుకతో గౌరీదేవి ప్రతిమను చేయించి సువాసినులతో కలిసి ధూపదీప నైవేద్యాలతో గౌరీదేవిని పూజించాలి. ఈ విధంగా మాఘమాసం మొత్తం నీ కుమార్తె మాఘవ్రతాన్ని ఆచరిస్తే ఆమె గతజన్మ పాపాలు పోయి ఆమె భర్త కూడా తిరిగి జీవిస్తాడు.' అలాగే మాఘశుద్ధ తదియ రోజు రెండు కొత్త చేటలు తెచ్చి అందులో చీర రవికె పసుపు కుంకుమ పండ్లు, సువాసిని అలంకరణ ద్రవ్యాలు ఉంచి ఒక ముత్తైదువును పూజించి ఆమెకు ఏడుసార్లు ప్రదక్షిణ చేసి ఈ మూసి వాయనాన్ని ఆమెకు సమర్పించి, తరువాత ఆమెకు షడ్రసోపేతమైన భోజనాన్ని పెట్టి సంతృప్తి పరిస్తే ఈ జన్మలో ఆమె నీ శిష్యునితో కలిసి చేసిన పాపం పోతుంది"అని చెబుతాడు.

మాఘ వ్రతంతో మోక్షం

సుదేవుడు మునీశ్వరుడు చెప్పినట్లుగా తన కుమార్తె చేత మాఘ వ్రతాన్ని, చేటల నోము వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో చేయిస్తాడు. మహిమాన్వితమైన మాఘవ్రత మహత్యంతో ఆమె పూర్వజన్మ, ప్రస్తుత జన్మ పాపాలు నశించాయి. ఆమె భర్త కూడా తిరిగి జీవించాడు. ఇహలోకంలో అనేక భోగాలు అనుభవించిన ఆమె మరణానంతరం భర్తతో కలిసి మోక్షాన్ని పొందింది. అనంతరం సుదేవుడు కూడా మాఘస్నానం చేసి ముక్తిని పొందాడు.

ఈ కథను చెబుతూ పరమ శివుడు పార్వతితో "పార్వతీ ఎవరైతే మాఘ మాసంలో నదీస్నానం చేసి, మాఘవ్రతాన్ని ఆచరిస్తారో వారి సమస్త పాపాలు పోయి మోక్షాన్ని పొందుతారు" అని చెప్పాడు. ఇతి స్కాందపురాణే! మాఘమాస మహాత్యే! ద్వితీయాధ్యాయ సమాప్తః 

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages