మాఘ శుద్ధ పాడ్యమి నుండి మాఘ గుప్త నవరాత్రులు జరుపుకుంటారు. ఇవి తంత్ర సాధనకు చాలా ముఖ్యమైనవి.
ఈ తొమ్మది రోజులపాటు దుర్గమాతను ఆరాధిస్తారు.నవరాత్రుల్లో ముందుగా కలశ స్థాపన చేస్తారు. నవరాత్రి తొలి రోజు నీరు లేదా ముడి బియ్యంతో నిండిన కలశాన్ని, కొబ్బరి, మామిడి ఆకులతో అలంకరించి దుర్గాదేవిని ఆరాధించే స్థలంలో ఉంచుతారు. అనంతరం ఆ మాతకు ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తారు.
ఈ ఆరాధన కోరికలు నెరవేర్చు కోవడం కోసం, విజయాలు సాధించుకోవడానికి ప్రత్యేకంగా చేస్తారు. గృహస్థులు ఈ నవరాత్రులలో సాత్విక దేవిని మాత్రమే పూజించాలి. తామసిక పూజను తాంత్రికులు, అఘోరీలు మాత్రమే చేస్తారు. గుప్త నవరాత్రుల ధ్యాన కాలంలో తపస్సు, కర్మలు, ధ్యానం మొదలైన వాటిని రహస్య మార్గంలో పఠించడంవల్ల జీవితంలో వచ్చే అన్ని అడ్డంకులు తొలగిపోతాయని విశ్వసిస్తారు.
ఈ నవరాత్రుల్లో సాధకులు ఉపవాసం పాటిస్తారు. మాఘ గుప్త నవరాత్రులు భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా జరుపుకుంటారు. మాఘ గుప్త నవరాత్రులలో భక్తులు సూర్యోదయానికి ముందే లేచి, స్నానం చేయాలి. పూజా గదిని శుభ్రం చేసి, అలంకరించుకోవాలి. దుర్గామాత విగ్రహాన్ని ఎర్రటి వస్త్రంపై ఉంచి, బియ్యం, రంగురంగుల పూలు ఉంచి ధూప దీపాలతో పూజించాలి. అమ్మవారికి బిందెలు. గాజులు సమర్పించాలి. ఈ తొమ్మిది రోజులు రోజుకొక అమ్మవారిని పూజించాలి.
తొలిరోజు కలశ స్థాపన, శైలపుత్రి పూజ.
రెండవ రోజు - బ్రహ్మచారిణి పూజ.
మూడవ రోజు - చంద్రఘంట పూజ
నాలుగవ రోజు - కూష్మాండ పూజ
ఐదవ రోజు - స్కందమాత పూజ
ఆరవ రోజు - కాత్యాయని పూజ
ఏడవ రోజు - కాలరాత్రి పూజ
ఎనిమిదవ రోజు -మహాగౌరీ పూజ, సంధి పూజ
తొమ్మిదవ రోజు - సిద్ధిదాత్రి పూజ
ఈ 9 రోజుల పాటు సాగే మాఘ గుప్త నవరాత్రులలో భక్తులు ఉపవాసం చేస్తారు. ఉపవాసం చేయడానికి ఆరోగ్య పరిస్థితులు సహకరించనివారు పాక్షిక ఉపవాసంకూడా పాటించవచ్చు. పండ్లు, పాల ఉత్పత్తులను తినవచ్చు. నవరాత్రులు అయిపోయే వరకు 108 సార్లు 'దుర్గా మంత్రం' పఠించడం చాలా శ్రేయస్కరం. భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఈ నవరాత్రులు పాటిస్తే దుర్గాదేవి ఆశీర్వాదం లభిస్తుంది.
2025: జనవరి 30 నుండి ఫిబ్రవరి 07 వరకు
No comments:
Post a Comment