ప్రతి ఏడాది చైత్ర శుద్ధ ఏకాదశిని కామదా ఏకాదశిగా జరుపుకుంటాం.
కామదా ఏకాదశి రోజు ఉపవాసం ఉండి, శ్రీహరిని పూజించి కొన్ని విశేషమైన నైవేద్యాలు సమర్పించడం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయట! శ్రీరామ నవమి తర్వాత వచ్చే ఏకాదశి కావడం వల్ల ఈ ఏకాదశి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారికి తెలిసి, తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ పర్వదినాన శ్రీహరిని పూజించి, విశేషమైన దానధర్మాలు చేయడం వల్ల శ్రీహరి అనుగ్రహం లభిస్తుందని, భక్తుల కోరికలన్నీ తీరి మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం.
కామదా ఏకాదశి రోజు ఉపవాసం ఉండి, శ్రీహరిని పూజించి కొన్ని విశేషమైన నైవేద్యాలు సమర్పించడం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయట! శ్రీరామ నవమి తర్వాత వచ్చే ఏకాదశి కావడం వల్ల ఈ ఏకాదశి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారికి తెలిసి, తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ పర్వదినాన శ్రీహరిని పూజించి, విశేషమైన దానధర్మాలు చేయడం వల్ల శ్రీహరి అనుగ్రహం లభిస్తుందని, భక్తుల కోరికలన్నీ తీరి మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం.
నిర్జల ఉపవాసం
కొంతమంది నిష్టాగరిష్టులు నీటిని కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు. అయితే ఇవన్నీ ఉపవాసం చేసే వారి ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు, పిల్లలు మితంగా సాత్వికాహారం తీసుకోవచ్చని పెద్దలు చెబుతారు. అంటే పండ్లు, పాలు వంటివి అన్నమాట
ఏకాదశి జాగారం ఎలా చేయాలి
ఏకాదశి ఉపవాసం చేసే వారు జాగరణ చేయాలన్న నియమమేమి లేదు. జాగారం చేయగలిగిన వాళ్ళు చేయవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది. జాగారం పేరిట వ్యర్ధ ప్రసంగాలు చేయరాదు. జాగారం చేయాలనుకునే వారు భక్తితో శ్రీమన్నారాయణుని భజనలు కీర్తనలు పూజలు చేస్తూ కాలక్షేపం చేయాలి. అలా కుదరనప్పుడు జాగారం చేయకపోవడమే మేలు!
ద్వాదశి పారణ - అతిథి దేవోభవ!
ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి ఘడియలు రాగానే స్నానం చేసి శుచిగా వంట చేసి మహా నైవేద్యాన్ని దేవునికి నివేదన చేయాలి. అనంతరం అతిథికి భోజనం పెట్టాలి. ఒకవేళ అతిథి లేకపోతే ఇంటి బయట ఏదైనా జీవికి ఆహారాన్ని విడిచి పెట్టి తర్వాత ఉపవాస దీక్ష చేసిన వారు భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి.
ఉపవాసం ఇలా చేస్తేనే ఫలితం
ఏకాదశి ఉపవాసం చేసే వారు ఉపవాసం సమయంలో దానగుణం, దయ గుణం కలిగి ఉండాలి. ఎవరితోనూ కోపంగా మాట్లాడకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. మద్య మాంసాలు తీసుకోకూడదు. ఆహారంలో ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం. బ్రహ్మచర్యం పాటించాలి. సహనం లేనివారు. నిష్ఠ లేనివారు ఉపవాసం చేయకపోవడమే మంచిది.
భక్తి ప్రధానం
ఏకాదశి ఉపవాసానికి భక్తే ప్రధానం. భక్తి లేకుండా ఎంత పెద్ద పూజలు చేసినా, ఎన్ని ఉపవాసాలు, జాగారాలు చేసినా ఫలితం ఉండదు. భగవంతుడు కోరుకునేది భక్తి మాత్రమే. నిర్మలమైన మనస్సుతో దృష్టిని భగవంతునిపై కేంద్రీకరించే శక్తి ఉన్నవారు మాత్రమే ఏకాదశి ఉపవాసం చేయాలి. భక్తిశ్రద్ధలతో ఏకాదశి ఉపవాసం చేస్తే అనంతకోటి పుణ్య ఫలం లభిస్తుంది.
ఈ దానాలు శ్రేష్టం
కామదా ఏకాదశి రోజు అన్నదానం, వస్త్రదానం, తిలదానం చేయడం వల్ల సత్ఫలితాలు ఉంటాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని శాస్త్రం చెబుతోంది.
కామదా ఏకాదశి వ్రత కథ
పూర్వం రత్నాపురం అనే రాజ్యాన్ని పుండరీకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యంలో గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసలు రాజ్య సభలో పాటలు పాడుతూ, నాట్యాలు చేస్తూ రాజును సంతోషపరిచేవారు. ఈ గంధర్వులలో లలితుడు అనే గంధర్వుడు, తన భార్య లలితతో చాలా అనోన్యంగా, ప్రేమగా ఉండేవాడు. ఒక రోజు లలితుడు రాజ్యసభలో రాచకార్యంలో ఉన్నప్పుడు అతని సతీమణి ఆ సభలో కనిపించదు.
లలితుని శపించిన రాజు
లలితుడు తన భార్య లలిత కనిపించకపోయేసరికి ఆమె ఆలోచనలో పడి పరధ్యానంలో తాను చేస్తున్న నాట్యగానాలపై శ్రద్ధ పెట్టలేకపోతాడు. అది గమనించిన రాజు గంధర్వుడిపై ఆగ్రహించి "నీ అందం, నీ నాట్యకళ నశించి బ్రహ్మ రాక్షసుడవై పొమ్మని" శపిస్తాడు. అప్పుడు ఆ గంధర్వుడు చూస్తుండగానే భయంకరమైన ఆకారం కలిగిన రాక్షసుడిగా మారిపోయాడు. అది తెలుసుకున్న గంధర్వుడి భార్య లలిత ఎంతో బాధపడి దుఃఖంతో తన భర్తను తీసుకోని అడవుల్లోకి ప్రయాణమైంది.
శ్రింగి మహర్షిని ఆశ్రయించిన లలిత
లలిత బ్రహ్మ రాక్షసునిగా మారిన తన భర్తతో కలిసి వింధ్యాచల అడువుల్లో ప్రయాణిస్తుండగా, ఆమెకు శ్రింగి ఆశ్రమం కనపడుతుంది. లలిత ఆ ఆశ్రమంలోకి వెళ్లి శ్రింగి మహర్షితో జరిగిన కథ అంతా చెప్పి, తన భర్తకు శాపవిమోచనం కలిగి తన బాధలు పోవడానికి ఏదైనా ఉపాయం చెప్పమని ప్రాధేయపడింది. అప్పుడు శ్రింగి మహర్షి కామదా ఏకాదశి మహత్యాన్ని గురించి వివరించాడు.
కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన లలిత
కామదా ఏకాదశి వ్రత మహాత్యం విన్న గంధర్వుడి భార్య లలిత సంతోషించి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో ఆచరించి, ఉపవాసం వ్రతం చేసి ద్వాదశి రోజు వాసుదేవ భగవానుని మనసులో తలచుకుంటూ "స్వామీ! నేను భక్తి శ్రద్దలతో నీ వ్రతాన్ని ఆచరించాను. నా భర్తను మీరే ఏ విధంగానైనా కాపాడాలి" అని మనసులో తలచుకొని నమస్కరించి తన పక్కనే ఉన్న భర్త వైపు చూడగా అప్పటి వరకు భయంకరమైన రాక్షసుని ఆకారంలో ఉన్న ఆ గంధర్వుడు తిరిగి తన పూర్వ ఆకారాన్ని పొందాడు. ఆనాటి నుంచి వారు ప్రతి ఏడాది కామదా ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ చివరకు మోక్షం పొందారు.
కామదా ఏకాదశి వ్రత ఫలం
భక్తిశ్రద్ధలతో, నియమనిష్టలతో కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే మనం తెలియక చేసే పాపాలన్నీ పటాపంచలై పోయి, మోక్షం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారు ఈ వ్రతకథను చదువుకుని పూజాక్షితలను శిరస్సున వేసుకుంటే వ్రతఫలం సంపూర్ణంగా దక్కుతుంది.
2025: ఏప్రిల్ 08.
No comments:
Post a Comment