శ్రీ కోదండరామస్వామి ఆలయం బుచ్చిరెడ్డిపాళెంలో నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.
1715వ సంవత్సర ప్రాంతంలో తమిళనాడు రాష్ట్రంలోని 'తిరుత్తణి'కి సమీపంలో 'రణవత్తూరు' అనే గ్రామంలోదొడ్ల అన్నారెడ్డి అనే రైతు నివసిస్తూ ఉండే వాడు. వ్యవసాయం చేసుకుని జీవిస్తూ ఉండేవాడు. ఒకసారి కరువురావడంతో ఆ ప్రాంతం నుంచి అనేకమంది వలసవెళ్ళారు. అటువంటి పరిస్థితుల్లో అన్నారెడ్డి తన గ్రామం నుంచి బుచ్చిరెడ్డిపాలెంకు చేరి స్థిరనివాసం ఏర్పరచు కున్నాడు.వ్యవసాయం చేసుకుంటూనే మరోవైపు అవసరమైనవారికి సహాయం చేస్తూ అనతికాలంలోనే గొప్పవాడిగా పేరు పొందాడు. అప్పటికి ఈ ప్రాంతం ఆర్కాటు నవాబు పాలనక్రింద ఉండేది.రానురాను అన్నారెడ్డి విషయం నవాబుకు తెలిసింది. నవాబు అన్నారెడ్డిని బుచ్చిరెడ్డి పాలెంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలకు పాలనాధికారిగా నియమించాడు.
ఈ పదవి వంశపారంపర్యంగా అన్నారెడ్డి తర్వాత ఆయన కుమారుడికి, అనంతరం అతని మనుమడు దొడ్ల రామిరెడ్డికి లభించింది. రామిరెడ్డి తాతను మించిన మంచివాడుగా ప్రజలందరిచేతా పిలువబడడంతోపాటు గొప్ప దైవభక్తుడుగా కూడా పేరుపొందాడు.
అటువంటి రామిరెడ్డికి ఒకనాడు స్వప్నంలో శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్కరించి బుచ్చిరెడ్డిపాలెంలో ఒక ఆలయాన్ని నిర్మించి అందులో తనను ప్రతిష్ఠించమని ఆదేశించాడు. దీనితో రామిరెడ్డి ఆలయాన్ని నిర్మింపజేసేందుకు నిర్ణయించుకుని 1765వ సంవత్సరంలో ఆలయనిర్మాణాన్ని ప్రారంభించారు.
సుమారు 20 సంవత్సరాలకాలం ఆలయ నిర్మాణానికి పట్టింది. 1785వ సంవత్సరంలో ఆలయంలో ప్రతిష్ఠా కార్యక్రమాలను నిర్వహింపజేయడంతోపాటు రామిరెడ్డి నిత్యపూజలు, ఉత్సవాలు జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
తర్వాతికాలంలో ఇతర దేవతామూర్తులతోపాటు ఆలయ ప్రాంగణంలో శ్రీ శ్రీనివాసస్వామి, ఆళ్వారులను తిరుమల నుంచి తీసుకునివచ్చి ప్రతిష్ఠింపజేశారు. కాగా, నేటికి రామిరెడ్డి వంశస్థులే ఆలయ ధర్మకర్తలుగా ఉండి ఆలయనిర్వహణ చేయడంతోపాటు ఆలయాభివృద్ధికి విశేషంగా కృషిచేస్తూ ఉండడం విశేషం.
ఆలయ విశేషాలు
బుచ్చిరెడ్డిపాలెం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం విశాలమైన ప్రాంగణంలో ప్రధాన ఆలయం, ఉపాలయాలు, పుష్కరిణిలతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటూ దర్శనమిస్తుంది.
ఆలయంలోకి ప్రవేశించే ప్రధాన ద్వారంపైన గోపురం నిర్మించబడింది. ఈ గోపురం వంద అడుగుల ఎత్తును కలిగి ఏడు అంతస్తులతో, పైభాగంలో తొమ్మిది కళశాలతో భారత, రామాయణ, భాగవత పురాణగాథలకు సంబంధించిన శిల్పకళతో నయనానందకరంగా దర్శనమిస్తుంది. ఈ గోపురద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించగానే ప్రధాన ఆలయం దర్శనమిస్తుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా ధ్వజ స్తంభం, బలిపీఠం ఉన్నాయి. ప్రధాన ఆలయం ముఖ మండపం, అంతరాలయం, గర్భాలయాలను కలిగి ఉంది.
ముఖమండపం నుంచి అంతరాలయానికి ప్రవేశించే ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు జయ, విజయులు కొలువుదీరి స్వామివారిని నిత్యం సేవిస్తూ దర్శన మిస్తారు.
ఇక ప్రధాన గర్భాలయంలో శ్రీరామచంద్రమూర్తి, శ్రీసీతాదేవి, శ్రీ లక్ష్మణస్వామి సమేతుడై కొలువుదీరి దివ్యమనోహర రూపంతో దర్శనమిస్తారు.
మామూలుగా రామాలయాల్లో శ్రీరాముడికి కుడి వైపున లక్ష్మణమూర్తి, ఎడమవైపున శ్రీ సీతాదేవి కొలువు దీరి ఉంటారు. అయితే ఈ ఆలయంలో శ్రీరాముడికికుడివైపున శ్రీ సీతాదేవి, ఎడమవైపున శ్రీ లక్ష్మణమూర్తి కొలువుదీరి ఉండడం విశేషం. ఈ విధంగా శ్రీరాముడి కుడివైపున కొలువుదీరి ఉన్న సీతాదేవిని దర్శించుకోవడం వల్ల ఐశ్వర్యప్రాప్తి కలుగుతుందనీ, ఇహంలో సౌఖ్యం పరంలో మోక్షం సిద్ధిస్తాయని చెప్పబడుతోంది. అంతేకాకుండా కుడివైపున శ్రీసీతాదేవిని కలిగిఉన్న శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకోవడం వల్ల ఇష్టార్థాలు నెరవేరుతాయనీ, శుభఫలితాలు కలుగుతాయని కథనం. అంతరాలయంలో శ్రీసీతా, లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తులతోపాటు శ్రీ చక్రత్తాళ్వారును భక్తులు దర్శించవచ్చు.
ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాల్లో క్షేత్రపాలకుడైన శ్రీలక్ష్మీ నరసింహస్వామి, శ్రీగోదాదేవి, శ్రీమహాలక్ష్మీదేవి, శ్రీవరదరాజస్వామి, శ్రీప్రసన్న ఆంజనేయ స్వామి మొదలైన దేవతామూర్తులను, వైష్ణవ ఆళ్వారులను భక్తులు దర్శించుకోవచ్చు. ఆలయ సమీపంలో పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించడంవల్ల శుభఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
పూజలు - ఉత్సవాలు
ప్రతిరోజూ పూజలు జరిగే బుచ్చిరెడ్డిపాలెం శ్రీకోదండ రామస్వామివారికి ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా చైత్రశుద్ధ అష్టమిమొదలు బహుళ పాడ్యమి వరకు తొమ్మిదిరోజులపాటు బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుపుతాయి.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ వాహనసేవలతో పాటు స్వామివారి కళ్యాణం, రథోత్సవం కన్నుల పండువగా జరుగుతాయి.ఈ ప్రధానమైన ఉత్సవాలతోపాటు వైశాఖమాసంలో నృసింహజయంతి, హనుమజ్జయంతి సందర్భంగానూ, ధనుర్మాసం, భీష్మఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ఉగాది, సంక్రాంతి, దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు.
వసతి రవాణా సౌకర్యాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నెల్లూరు పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో 'బుచ్చిరెడ్డిపాలెం' ఉంది. బుచ్చిరెడ్డిపాలెంలో భక్తులకు వసతి సౌకర్యాలు లభిస్తాయి. అయితే నెల్లూరు పట్టణం నుంచి వెళ్ళి దర్శించుకుని రావడం మంచిది. నెల్లూరు నుంచి బుచ్చిరెడ్డిపాలెంకు విరివిగా బస్సు సౌకర్యాలు ఉన్నాయి. కడప-నెల్లూరు మార్గంలో ఉన్న బుచ్చిరెడ్డిపాలెంకు రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాంతాలన నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి.
భక్తుల హృదయాలయంగా విరాజిల్లుతూ ఉన్న బుచ్చిరెడ్డిపాలెం శ్రీకోదండ రామాలయాన్ని దర్శించి భక్తులు తరించవచ్చు.
No comments:
Post a Comment