భక్తుల హృదయాల్లో ఆధ్యాత్మిక అనుభూతులు నింపే సుప్రసిద్ధ పంచారామ క్షేత్రాల్లో సోమారామం ఒకటి. దేశంలో ఉన్న స్పటికలింగాల్లో ఇది ఒకటి. రాజమండ్రికి 59 కి.మీ. దూరంలో, విజయవాడకు 91 కి.మీ. దూరంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి 2 కి.మీ. దూరంలో ఉన్న ఈ ఆలయ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
చంద్ర ప్రతిష్ఠిత లింగం
సోమారామంలో లింగమును చంద్రుడు ప్రతిష్ఠించినట్లుగా ఆలయ స్థలపురాణం ద్వారా మనకు తెలుస్తుంది. సోముడు అంటే చంద్రుడు. చంద్ర ప్రతిష్ఠిత లింగం కాబట్టి ఈ క్షేత్రాన్ని సోమేశ్వరక్షేత్రమని పిలుస్తారు. సోమారామంలో ప్రతి కార్తికమాసంలో బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి.
రంగులు మారే శివలింగం
భక్త సులభుడైన శివయ్య ఇక్కడ సోమేశ్వరస్వామి పేరుతో నిత్య పూజలందుకుంటూ ఉంటాడు. దేవాలయంలో ఉన్న శివలింగం అమావాస్య నాడు నలుపు వర్ణంలోను, పౌర్ణమి రోజున గోధుమ వర్ణంలో దర్శనమివ్వడం ఈ ఆలయ ప్రత్యేకత. చంద్రుడు ప్రతిష్టించిన కారణంగానే, ఆయనని అనుసరిస్తూ ఈ శివలింగం రంగుమారుతూ ఉంటుందని చెబుతుంటారు. ఇది శతాబ్దకాలంగా జరుగుతోందని ఇక్కడి పూజారులు చెబుతున్నారు. ఈ మార్పులను గమనించాలంటే అమావాస్యతో పాటు పౌర్ణమి రోజున దేవాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది.
ఆలయ విశేషాలు
ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు కింది అంతస్తులోనూ, పక్కన పార్వతి దేవి అమ్మవారు ఉంటారు. పై అంతస్తులో అన్నపూర్ణాదేవి ప్రతిష్ఠితమై ఉంది. ఇలా శివుడి పైన అమ్మవారు ఉండటం దేశంలో మరెక్కడా లేదని చెబుతారు.
పంచనందీశ్వర దేవాలయం
ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్ధన స్వామి. దేవాలయం ముందు భాగంలో రెండు నందులు ఉండగా ధ్వజస్తంభం వద్ద మరో నంది ఉంటుంది. అటుపై ఆలయ ప్రాంగణంలో ఒక నంది, దేవాలయం ఎదురుగా ఉన్న చంద్ర పుష్కరిణిలో మరో నంది ఉంటుంది. అందువల్లే ఈ క్షేత్రానికి పంచనందీశ్వర దేవాలయం అని కూడా పేరు.
చంద్ర పుష్కరిణి
ఈ క్షేత్రంలోని చంద్ర పుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు పటాపంచలవుతాయని విశ్వసిస్తూ ఉంటారు.
చారిత్రక ప్రాశస్త్యం
తూర్పు చాళుక్యరాజైన చాళుక్య భీముడు ఈ దేవాలయాన్ని మూడో శతాబ్దంలో నిర్మించాడు. ఈ దేవాలయానికి ప్రాకారాలను, గోపురాన్ని నిర్మించాడనడానికి చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి. అందువల్లే ఈ క్షేత్రానికి భీమారామం అనే పేరు కూడా ఉంది.
పూజోత్సవాలు
ప్రతి ఏడాది ఇక్కడ మహా శివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాలు అయిదు రోజులపాటు జరుగుతాయి. అలాగే దేవీనవరాత్రులు కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు. ఇక కార్తీకమాసంలో ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి శివలింగం రంగులు మారడం వెనుక ఉన్న మిస్టరీ ఇప్పటికి చేధించలేకపోయారు.
No comments:
Post a Comment