చిత్తూరు జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో వేదనారాయణ స్వామి ఆలయం ఒకటి. ఇది చిత్తూరు జిల్లా నాగలాపురంలో ఉంది.
ఆలయ విశిష్టత
నాగలాపురం వేదనారాయణ స్వామి ఆలయాన్ని పల్లవుల కాలంలో నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఈ ఆలయంలో సాక్షాత్తూ గోవిందుడు మత్స్యావతారంలో వెలసి ఉండడం విశేషం. బ్రహ్మాండ పురాణం ప్రకారం త్రిమూర్తుల్లో విష్ణువు లోకపాలకుడు. దుష్ట శిక్షణా శిష్ట రక్షణ కోసం ఎన్నో అవతారాలను ధరించాడు. వాటిల్లో మొదటి అవతారం వేదాలకు పునర్జన్మను ప్రసాదించిన మత్స్యావతారం. అయితే స్వామి మత్స్యరూపంలోనే స్వయంభువుగా వెలసిన క్షేత్రం చిత్తూరులోని నాగలాపురం. ఇక్కడ స్వామి వారు శ్రీదేవీ భూదేవీ సమేతుడై కొలువుదీరి పూజలందుకుంటున్నాడు.
స్థల పురాణం
మనిషి పుట్టుక నుంచి మరణం వరకూ ధర్మబద్ధంగా ఎలా జీవించాలో నిర్దేశించిందే వేదం. అలాంటి వేదాలను సంరక్షించడానికి విష్ణుమూర్తి ఎత్తిన అవతారమే మత్స్యావతారం. సోమకాసురడనే రాక్షసుడు బ్రహ్మ దేవుని వద్ద ఉన్న వేదాలను అపహరించి సముద్ర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. వేదాలు లేకుండా జీవసృష్టి చేయడం కష్టమని భావించిన బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలతో కలిసి వైకుంఠపురం చేరుకుంటాడు. జరిగిన విషయాన్ని విన్నవించి, ఈ విపత్తు నుంచి కాపాడమని విష్ణుమూర్తిని వేడుకుంటాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు మత్స్యరూపాన్ని దాల్చి సముద్రంలో దాగున్న సోమకాసురుడితో భీకర యుద్ధం చేస్తాడు. కొన్ని సంవత్సరాలు కొనసాగిన ఈ యుద్ధంలో చివరికి సోమకాసురుడిని సంహరించిన విష్ణుమూర్తి వేదాలను బ్రహ్మదేవుడికి తిరిగి అప్పగిస్తాడు.
సముద్ర గర్భంలోకి వెళ్లిన స్వామి
వేదాపహరణ జరిగిన సమయంలో సోమకాసుర సంహారం కోసం సముద్ర గర్భంలోకి వెళ్లిన స్వామి ఎన్ని రోజులకీ తిరిగి రాకపోవడం వల్ల అమ్మవారు కూడా భూలోకానికి పయనమవుతుంది. భూమ్మీద విష్ణుమూర్తి శిలారూపధారుడై ఉన్నాడని తెలుసుకుని, అక్కడికి చేరుకుని స్వామివారికి అభిముఖంగా శిలారూపంలో నిలిచిపోయిందని ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. ఆనాటి సంఘటనకు సాక్ష్యంగా నేటికీ ఆలయంలో స్వామివారు పడమరకు అభిముఖంగా దర్శనమిస్తే, వేదవల్లి అమ్మవారు తూర్పునకు అభిముఖంగా దర్శనమిస్తుంది. నారాయణుడు వేదాలను తిరిగి ఇచ్చిన స్థలం కావడం వల్ల ఈ ప్రాంతం వేదపురి, వేదారణ్యక్షేత్రం, హరికంఠాపురంగా ప్రసిద్ధి చెందింది.
సూర్య పూజోత్సవం
శ్రీ మహావిష్ణువు మత్స్యావతార రూపంలో సముద్రంలో సంవత్సరాల తరబడి యుద్ధం చేసి వచ్చినందున స్వామి దివ్య శరీరానికి వెచ్చదనం కలిగించేందుకు సూర్య భగవానుడు తన కిరణాలను స్వామివారి మీద ప్రసరింపచేడమే సూర్య పూజోత్సవం. ఏటా మార్చి 23, 24, 25 వ తేదీలలో ఈ ఆలయంలో సూర్య పూజోత్సవము వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవంలో ప్రధాన రాజగోపురం నుంచి 630 అడుగుల దూరంలో ఉన్న మూలవిరాట్‌పై సూర్యకిరణాలు నేరుగా ప్రసరిస్తాయి. మొదటి రోజు స్వామి వారి పాదాలపై, రెండో రోజు నాభిపై, మూడో రోజు స్వామి శిరస్సుపై సూర్యకిరణాలు ప్రసరించి స్వామి దివ్య రూపాన్ని మరింత తేజోవంతం చేస్తాయి.
ఆలయ విశేషాలు
చోళరాజుల తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టు ఆలయ ఉత్తర గోపురం మీది శాసనం తెలియజేస్తోంది. రాయలనాటి శిలా నైపుణ్యం ప్రదర్శితమయ్యేలా ఆలయ గోడలను తీర్చిదిద్దారు. పంచ ప్రాకారములతో, సప్త ద్వారాలతో, అత్యంత కళాత్మకమైన శిల్ప కళతో, సుందర ఆలయంగా తీర్చి దిద్ది, పునర్మించిన రాయల వారు ఎన్నో దానాలు చేసి ఈ గ్రామానికి తన తల్లి నాగమాంబ పేరిట నాగమాంబాపురంగా నామకరణం చేశాడు. కాలక్రమంలో ఇది నాగలాపురం అయ్యింది.
ఇతర ఉపాలయాలు
ఆలయ ప్రాంగణంలో అనేక ఉప ఆలయాలు, దేవతా మూర్తులతో అలరారుతున్నవి. 15వ శతాబ్దంలో చోళరాజు ఈ ఆలయ ప్రాంగణంలోనే శివకేశవులకు అభేదాన్ని తెలుపుతూ వేదనారాయణస్వామితో పాటు దక్షిణామూర్తి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాడు.
పూజోత్సవాలు
ప్రతి ఏడాది మార్చి 23, 24, 25 వ తేదీలలో సూర్య పూజోత్సవము వైభవంగా జరుగుతుంది. మార్చి 26, 27, 28 వ తేదీలలో మూడు రోజుల పాటు తెప్పోత్సవాలు జరుగుతాయి. ఏప్రిల్ నెలలో పౌర్ణమి నుండి 10 రోజులు బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి. ప్రతిరోజు మూడు పూటలా నిత్య పూజలు జరుగుతాయి. ఈ ఆలయం 1967 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలోకి వచ్చింది. ఆనాటి నుంచి ఇక్కడ నిత్య, వార, పక్ష, మాస, సంవత్సరోత్సవాలు కన్నుల పండువగా జరుగుచున్నాయి.
వేదనారాయణ స్వామి ఆలయంలో జరిగే సూర్య పూజోత్సవం కనులారా చూసిన వారి జన్మ ధన్యమని, ఈ దర్శనం మోక్షదాయకమని శాస్త్ర వచనం.
No comments:
Post a Comment