Thiruparankundram Murugan Temple: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం - తిరుప్పరంకుండ్రం

తిరుప్పరంకుండ్రం తమిళనాడులో గల మధురై మీనాక్షి అమ్మవారి దేవాలయానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో రెండవది తిరుప్పరంకుండ్రం. ఈ క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇంద్రుని కుమార్తె అయిన దేవసేనతో కల్యాణం జరిగింది. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఒక్క క్షేత్రంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారు కూర్చుని దర్శనమిస్తారు. మిగతా అన్నిచోట్ల స్వామి నిలబడిన మూర్తినే మనం చూస్తాం.

ఆలయ స్థల పురాణం

సుబ్రహ్మణ్యుడి భార్యలు అయిన శ్రీ వల్లి, దేవసేనలు ఇద్దరూ శ్రీ మహా విష్ణువు కుమార్తెలు. వీరి అసలు పేర్లు అమృత వల్లి, సుందర వల్లి. ఒక రోజు వల్లి, దేవసేనలు ఇద్దరూ సుబ్రహ్మణ్యుడి వద్దకు వచ్చి వారిని కల్యాణం చేసుకోమని అడుగుతారు. స్వామి అమృత వల్లితో “నిన్ను ఇంద్రుడు తన కూతురిగా పెంచుతాడు. తరువాత కాలంలో నిన్ను వివాహం చేసుకుంటాను" అని అభయం ఇస్తారు. అలాగే సుందర వల్లిని కూడా అనుగ్రహిస్తారు స్వామి.

ఇంద్రుని కలిసిన అమృతవల్లి

కొంతకాలం తర్వాత అమృత వల్లి చిన్న ఆడ శిశువుగా మారి, మేరు పర్వతం దగ్గరకి వెళ్లి, ఇంద్రుడిని కలిసి "నేను శ్రీ మహా విష్ణువు కుమార్తెను, నన్ను పెంచవలసిన బాధ్యత మీకు ఉంది" అని చెబుతుంది. ఈ మాట విన్న ఇంద్రుడు ఎంతగానో సంతోషించి వెంటనే తన వద్దనున్న ఐరావతాన్ని ఈ బిడ్డ ఆలనా పాలనా చూడమని ఆజ్ఞాపిస్తాడు. అమృతవల్లికి పెళ్లీడు వచ్చేవరకు ఆ ఐరావతం ఎంతో ప్రేమతో పెంచుతుంది. తమిళంలో 'యానై' అంటే ఏనుగు. అమృత వల్లిని దేవతల ఏనుగు అయిన ఐరావతము పెంచడం వల్లనే, ఆమెకి దేవయాని అని పేరు కూడా వచ్చిందని అంటారు.

గిరిజన నాయకుని సంరక్షణలో సుందరవల్లి

మరికొంత కాలానికి మహావిష్ణువు మరో కుమార్తె సుందర వల్లి శివముని అనే మునీశ్వరుని యొక్క తేజస్సు వలన అయోనిజగా పుడుతుంది. ఆమెను నంబి అనే భిల్ల నాయకుడు అంటే గిరిజనుల నాయకుడు పెంచుకుంటారు. తరువాత కాలంలో ఆమెను సుబ్రహ్మణ్యుడు వివాహం చేసుకుంటారు. అది వల్లీ కల్యాణ ఘట్టం.

మహర్షి కుమారులకు శాపం

ఒకానొక సమయంలో పరాశర మహర్షి ఆరుగురు కుమారులు శరవణ తటాకములో చేపలుగా ఉండమని శాపాన్ని పొందుతారు. తమ శాప విమోచనం కోసం వారు సుబ్రహ్మణ్యుని ఆరాధించడం మొదలు పెడతారు. సుబ్రహ్మణ్యుడు తాను తిరుప్పరంకుండ్రం వచ్చినప్పుడు వారికి శాప విమోచనం కలుగుతుందని అభయమిస్తాడు.

తిరుప్పరంకుండ్రంకు విచ్చేసిన సుబ్రహ్మణ్యుడు

తిరుచెందూర్​లో కుమారస్వామి సూర పద్మం అనే రాక్షసుడిని సంహారం చేసి, దేవతలందరినీ రాక్షస బాధల నుంచి విముక్తులను చేసి, ఆ దేవతలందరితో కలిసి, తిరుప్పరంకుండ్రం వస్తారు. స్వామి రాకతో పరాశర మహర్షి కుమారులకు శాపవిమోచనం కలిగి, స్వస్వరూపం వచ్చి, వారు స్వామిని ఆ క్షేత్రములో కొలువుండమని ప్రార్థిస్తారు. వారి ప్రార్థనకు మెచ్చిన షణ్ముఖుడు అంగీకరించగా, అక్కడ విశ్వకర్మ ఒక చక్కని ఆలయం నిర్మిస్తారు.

సుబ్రహ్మణ్యుడు దేవయానిల కల్యాణం

అదే సమయంలో దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవయానిని పెళ్ళిచేసుకోమని సుబ్రహ్మణ్యుని అర్ధిస్తారు. దేవయానిగా పిలుచుకునే అమృతవల్లియే ఈ దేవసేన! ఇంద్రుడు చతుర్ముఖ బ్రహ్మకు, శ్రీ మహా విష్ణువుకి తన ఈ కోర్కెని తెలియజేస్తాడు. వారి కోరికను సుబ్రహ్మణ్యునికి తెలుపగా, స్వామి అంగీకరిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి వారికి, దేవయానికి కల్యాణం ఈ తిరుప్పరంకుండ్రంలోనే జరిగింది.

కల్యాణాల క్షేత్రం

తిరుప్పరంకుండ్రంలో దేవసేన సుబ్రమణ్య స్వామి వారి కల్యాణం జరగడం వల్లనే, ఇప్పటికీ ఎంతో మంది వివాహాలు స్వామి సన్నిధిలో జరుపుకుంటారు. రాక్షస సంహారం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామి కల్యాణం జరగడం వల్ల ఈ క్షేత్రం చాలా చాలా విశేషమైనది.

ఆలయ విశేషాలు

తిరుప్పరంకుండ్రంలో ముఖ్యమైన విశేషం ఏమిటంటే, ఈ ఆలయం మొత్తాన్ని ఒకే కొండ రాతితో చెక్కారు. ఆలయంలోకి ప్రవేశించగానే, నలభై ఎనిమిది స్తంభాలు, ఒక్కో స్తంభం మీదా ఒక్కో భగవన్మూర్తి ఉంటుంది. ఈ స్తంభాల మీద దుర్గా దేవి, విఘ్నేశ్వరుడు, పార్వతీ దేవిని శివునికి అప్పగిస్తున్న శ్రీ మహా విష్ణువుతో కూడిన శివ కల్యాణ ఘట్టం చిత్రీకరించి ఉంటాయి.

సింహాసనంపై కూర్చున్న భంగిమలో సుబ్రహ్మణ్యుడు

ఆలయ మండపం దాటి లోపలికి వెడితే, ముందుగా స్వామి వారి వాహనం మయూరం, విఘ్నేశ్వర వాహనం మూషికము, శివుని వాహనము నందీశ్వరుడు దర్శనమిస్తారు. ఇంకా పైకి మెట్ల మీదుగా వెడితే గర్భాలయం కనిపిస్తుంది. గర్భాలయంలో సుబ్రహ్మణ్య స్వామి సింహాసనంలో కూర్చుని ఉంటారు. ఆయనకి ఎడమవైపు దేవసేన, కుడి వైపు నారద మహాముని క్రింద కూర్చుని ఉంటారు.

అభిషేకాలు లేని స్వామి

తిరుప్పరంకుండ్రం క్షేత్రంలో స్వామికి అభిషేకం చేయరు. కేవలం ఆయన శక్తి శూలమునకు మాత్రమే అభిషేకాలు జరుగుతాయి. ఇక్కడ వెలసిన విఘ్నేశ్వర స్వామి 'కర్పగ వినాయగర్' అనే పేరుతో భక్తులను అనుగ్రహిస్తుంటాడు. ఆ ప్రక్కనే మహాదేవుడు లింగ స్వరూపంలో ఉంటారు. దుర్గా అమ్మవారు మధ్యలో ఉంటారు. దుర్గాదేవికి ఎడమవైపు వినాయకుడు, కుడి వైపు సుబ్రహ్మణ్యుడు ఉంటారు. శివలింగం ఎదురుగా పెరుమాళ్, అంటే శ్రీ మహా విష్ణువు కూడా ఉంటారు.

కుజ దోషాలు, సర్ప దోషాలు పోగొట్టే క్షేత్రంగా తిరుప్పరంకుండ్రం ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యుని దర్శించుకుంటే వివాహం కాని వారికి వివాహం, సంతానం లేనివారికి సంతానం కలుగుతాయని విశ్వాసం

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి