చుట్టూ పచ్చిక బయళ్లు, ఆపై జలజల పారే సెలయేళ్లు, కడప జిల్లాలోని చిట్వేలి మండలంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన గుండాలకోనలో గుండాల ఈశ్వరుడు ఎండ్రకాయ రూపంలో ప్రత్యక్షంగా దర్శనం ఇస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చిట్వేలి మండలం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో కొండ కోనల నడుమ దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఈ గుండాల కోన ఉంది.
ఏడాది పొడుగునా జలకళ
గుండాలకోనలోకి సుమారు 30 అడుగుల ఎత్తు నుంచి నీరు ఉద్ధృతంగా వచ్చి చేరుతుంది. గుండాల కోనలో వర్షాకాలంలోనేకాదు, వేసవికాలంలో కూడా నీరు పుష్కలంగా ప్రవహిస్తుంది. ఇప్పటి వరకు ఈ గుండం లోతు చూసిన వారు లేరని స్థానికుల కథనం.
గుండాల కోన విశిష్టత
ఏడాది పొడుగునా సందర్శకులతో రద్దీగా ఉండే ఈ క్షేత్రాన్ని కార్తీక మాసంలోనూ, శివరాత్రి పర్వ దినాలలోనూ భక్తులు విశేషంగా దర్శిస్తారు.
విశ్వామిత్ర ప్రతిష్ఠిత లింగం
విశ్వామిత్రుడు ప్రతిష్ఠించిన గుండాలేశ్వరస్వామి ఆలయ ప్రాంతమే గుండాల కోనగా ప్రసిద్ధి చెందింది.
మహిమాన్వితం గుండాలకోన
ఈ గుండంలో మునిగితే సర్వపాపాలు తొలగిపోతాయని, దెయ్యాలు వదులుతాయని, సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ గుండం పక్కనే గుహ ఉంటుంది. ఈ గుహలో గుండాల ఈశ్వరుడు ఎండ్రకాయ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు. గుహ ద్వారంలో భక్తులు పూజలు చేసి, ఫలాలు ఉంచుతారు. వాటిని ఎండ్రకాయలోనికి తీసుకుపోతే తమ కోర్కెలు నెరవేరినట్లుగా భక్తులు భావిస్తారు. సంతానం లేని మహిళలు ఈ గుండం సమీపంలోని వృక్షాలకు మొక్కుబడిగా ఊయలలు కడుతారు.
మంత్రముగ్ధులను చేసే ప్రకృతి సౌందర్యం
ఎత్తైన కొండల మధ్యలో భీకర శబ్దం చేస్తూ నీటి ప్రవాహం, సెలయేళ్ల గలగలలు ఆకాశాన్ని తాకినట్టుండే మహావృక్షాలు, పచ్చదనంతో ఈ ప్రాంతమంతా ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఆలయ చరిత్ర
ప్రకృతి అందాలకు నెలవైన ఈ గుండాల కోన దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మనుమరాలైన ఈశ్వరమ్మను వివాహం చేసుకోగోరి నిరాకరణకు గురైన రంగరాజు కొంతకాలం ఈ గుండాల కోనలో తపస్సు చేశాడట. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఎండ్రకాయ రూపంలో భక్తులకు దర్శనమిస్తానని చెప్పినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.
అష్టైశ్వర్యాలు ప్రసాదించే కోనమల్లేశ్వరుడు
ఈ ఆలయంలోని కోన మల్లేశ్వరుని ఒక్కసారి దర్శిస్తే జన్మాంతరాల నుంచి అనుభవిస్తున్న దారిద్య్రం పటాపంచలై పోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం.
ప్రమాదకర ప్రయాణం
గుండాల కోన కర్కటేశ్వర స్వామిని దర్శించాలంటే ఎన్నో ప్రయాసలకోర్చి భక్తులు 8 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. కానీ దట్టమైన అడవుల్లో దారి తప్పి క్రూరజంతువులకు బలైన సంఘటనలు కూడా లేకపోలేదు. అందుకే భక్తులు అటవీ అధికారుల అనుమతి తీసుకుని వారి సహాయంతో ప్రయాణం సాగించటం మంచిదని స్థానికులు చెబుతారు.
No comments:
Post a Comment