తిరుమలలో చైత్రశుద్ధ నవమి శ్రీరాముని జన్మదినమైన శ్రీరామనవమిరోజు విశిష్ట ఉత్సవంగా జరుపబడుతున్నది. ఆ ఉత్సవాన్నే "శ్రీరామనవమి ఆస్థానం” అంటారు.
శ్రీరామనవమి పండుగరోజున ఉదయం ఆనంద నిలయంలో ప్రతిరోజు మాదిరే సుప్రభాతం జరిగిన తర్వాత భోగశ్రీనివాసమూర్తికి, శ్రీవేంకటేశ్వరస్వామివారి మూల విరాణ్మూర్తి బంగారుపాదపద్మాలకు ఆకాశగంగా తీర్థజలాలతో అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత ప్రత్యేకంగా శ్రీసీతారామ లక్ష్మణ హనుమంతుని పంచలోహ ఉత్సవమూర్తులకు కూడ ఏకాంతంగా అభిషేకం జరుపబడుతుంది. అభిషేకం అయిన తర్వాత ఈ శ్రీరాముని విగ్రహాలకు పట్టువస్త్రాలతో, విశేష ఆభరణాలతో, పుష్పమాలలతో అలంకారం జరుగుతుంది.
శ్రీరామనవమినాటి సాయంత్రం బంగారువాకిలిముందు శ్రీసీతారామలక్ష్మణుల మూర్తులను ఒక పల్లకిపై వేంచేపు చేసి సర్వాభరణాలతో, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరిస్తారు. పిదప మరొక పీఠంపై హనుమంతుని కూడా వేంచేపు చేస్తారు. శ్రీరామనవమి పండుగ సాయంత్రం శ్రీరాములవారిని మాత్రం బంగారు హనుమద్వాహనంపై వేంచేపు చేసి తిరుమల పురవీధుల్లో ఊరేగింపు జరుగుతుంది.
ఉత్సవానంతరం ఆలయంలో బంగారువాకిలి దగ్గర బంగారుసర్వభూపాలవాహనంలో శ్రీసీతారామలక్ష్మణులకు, ఆస్థానం జరుగుతుంది. వీరి ప్రక్కన మరొక పల్లకిపై దక్షిణాభి ముఖంగా ఆంజనేయస్వామిని కూడ వేంచేపు చేస్తారు. ఇలా సర్వభూపాలవాహనంలో కొలువుదీరి ఉన్న శ్రీసీతారామలక్ష్మణ హనుమంతులకు అర్చకులు, పూజానివేదనలు చేసి వారిపై కుంకుమాక్షతలను ఆరోపణచేస్తారు. అనగా అక్షతలు చల్లుదురు. తరువాత శ్రీరామచంద్రుల వారి అనుజ్ఞతో శ్రీమద్రామాయణంలో శ్రీరామజననవృత్తాంతాన్ని పౌరాణికులు శ్రావ్యంగా పఠిస్తూ వివరిస్తారు. పురాణ పఠనం అయిన తరువాత పౌరాణికులకు తాంబూల సత్కారం జరుపబడుతుంది. ఆ తర్వాత శ్రీసీతారామ లక్ష్మణహనుమంతులకు ఘనంగా నివేదన హారతులు సమర్పించ బడతాయి. ఆ తర్వాత ప్రసాదవినియోగం అయిన తర్వాత శ్రీసీతారామలక్ష్మణ హనుమంతులను ఆనందనిలయంలో ప్రవేశ పెట్టడంతో శ్రీరామనవమినాటి ఆస్థానంమనంగా పూర్తి అవుతుంది.
No comments:
Post a Comment