Masani Amman Temple: శ్రీ మాసాని అమ్మ ఆలయం - అనైమలై - హిందూ ధర్మం

ధర్మం, ఆచారాలు, ఆధ్యాత్మికత

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Tuesday, March 18, 2025

demo-image

Masani Amman Temple: శ్రీ మాసాని అమ్మ ఆలయం - అనైమలై

Responsive Ads Here

 

masani%20amman%20temple

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో, పొల్లాచికి 14 కి.మీ.ల దూరంలో అనైమలై అనే ఊరులో ఉంది ఈ ఆలయం. అందుకే అనైమలై మాసాని అమ్మ దేవాలయం అని కూడా అంటారు. 

ఈ ఆలయంలో అమ్మవారు  వెల్లకిలా పడుకున్నట్లు దర్శనమిస్తుంది. దాదాపు 15 అడుగుల పొడుగున్న ఈ మూర్తి నాలుగు చేతులు, వాటిలో కపాలం, పాము, డమరుకం, త్రిశూలం ధరించి ఉంటుంది.

ఆలయ విశేషాలు 

ఈ ఆలయంలో చాలా విశేషాలున్నాయి. ఆలయ నిర్మాణమే ఒక పెద్ద విశేషం. ఈ ఆలయం స్మశాన భూమిలో నిర్మితమయింది. అందుకనే ఆ అమ్మవారిని అక్కడి ప్రజలు మాసాని అమ్మ అని పిలిచేవారు. తర్వాత ఆ పేరే ఆలయానికి స్థిరపడిపోయింది. అమ్మవారి విగ్రహం వెల్లకిలా పడుకున్నట్లు ఉంటుంది. పడుకున్న భంగిమలో ఉన్న అమ్మవారి విగ్రహం భారత దేశంలో ఇంకే అమ్మవారి ఆలయంలో లేదు. అమ్మవారి పాదాల దగ్గర ఒక రాక్షసుడు ఉంటాడు. అక్కడే రెండు అడుగుల ఎత్తున్న అమ్మవారి విగ్రహం నుంచున్నట్లు ఉంటుంది.

ఈ అమ్మవారి గురించి అనేక కధలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ అమ్మవారిని ఒక సదాచార సంపన్నుడు ప్రతిష్టించాడు. ఒకసారి మగుదాసురన్ అనే క్రూర రాక్షసుడు ఆ ఊరి ప్రజలని నానా హింసలు పెట్టి తన బానిసలుగా చేసుకున్నాడు. అతని ఆగడాలు మితిమీరేసరికి ఆ ప్రజలు భరించలేకపోయారు. అక్కడ అన్నెమలైలో నివసించే ఒక పూజారి అమ్మవారి కోసం ఒక దీపం ఏర్పరిచి, అక్కడే ఉన్న స్మశానభూమినుంచి కిరోసిన్ తెచ్చి దానిని వెలిగించాడు. ఆ దీపం కాంతిలోంచి తేజో రూపంగా సాక్షాత్కరించిన మాసాని అమ్మ ఆ రాక్షసుణ్ణి చంపింది. రాక్షసుణ్ణి అంతం చేసి ప్రజలకు న్యాయం చేసిందిగనుక ఆ రోజునుంచి ఆ తల్లిని న్యాయ దేవతగా కొలువసాగారు.

ఇంకొక కధనం ప్రకారం సీతాన్వేషణలో ఉన్న రాముడికి ఇక్కడ స్మశాన భూమిలో మాసాని అమ్మ దర్శనమిచ్చి ఆయన అన్వేషణలో జయం కలుగుతుందని ఆశీర్వదించింది అంటారు. ఇంకొక కధ ప్రకారం శ్రీరామచంద్రుడు సీతని వెతుకుతూ వచ్చి ఇక్కడ ఒక రాత్రి నిద్రించాడుట. తర్వాత తను పూజ చేసుకునేందుకు ఒక అమ్మవారి విగ్రహాన్ని మట్టితో తయారు చేసి పూజించాడుట. ఆవిడే ఈవిడంటారు.

MASANI_AMMAN

ఇంకొక కధ ప్రకారం పూర్వం ఆ ప్రాంతాన్ని కొంగునాడు అనేవారు. దానికి రాజు కూట్రు నన్నన్. అతనికి ఒక మామిడి తోట ఉండేది. ఆయనకు ఆ తోట ప్రాణప్రదమైనది. ఆ తోటలోని మామిడి పళ్ళు తనుతప్ప ఇంకెవరూ తినకూడదని ఆజ్ఞాపించాడు. ఒక సారి ఆయన మామిడిపళ్ళను కోస్తుంటే ఒక పండు జారి పక్కనే ఉన్న నదిలో పడింది. ఆ నదిలో స్నానం చేస్తున్న ఒక యువతి ఆ పండుని చూసి తిన్నది. అది తెలిసిన రాజు ఆమెని నిర్దయగా చంపించాడు. ఏ తప్పు చేయని ఆ యువతి క్రూరుడైన రాజు తనకు చేసిన అన్యాయంపై పోరాడుతూ దేవతగా విలసిల్లింది. అన్యాయంపై పోరాడిన యువతిగనుక అందరికీ న్యాయం చేస్తుంది. తమిళంలో మాసాని అంటే మరుభూమి. ఇంకొక కధనం ప్రకారం రాజు ఆ యువతిని చంపించిన తర్వాత ఆమె బంధువులు, ఆ గ్రామ ప్రజలు ఆమెని మరుభూమిలో పాతిపెట్టి, అక్కడే చిన్న ఆలయం కట్టారు. తర్వాత ఆ రాజుని చంపేశారు. మామిడిపండు కోసం మృత్యువు కోరల్లో చిక్కుకున్న ఆమెని మాసాని మా అని పిలిచేవారు. తర్వాత మాసానియమ్మన్ అయింది.

ఈ ఆలయంలో ఇతర దేవతలతోబాటు ముఖ్యంగా పూజింపబడే దేవతలు నీతి కాల్, మహామునియప్పన్. నీతి కాల్ సర్ప దేహంతో ఉన్న ఒక చిన్న రాతి విగ్రహం. ఈవిడను న్యాయ దేవతగా కొలుస్తారు. ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడుగానీ, తమవారి మోసంతో ఆస్తులు పోగొట్టుకున్నా, వస్తువులు పోయినా తమని అన్యాయం చేసిన వాళ్ళకి శిక్ష పడాలని ఇక్కడ ఉన్న రోలులో ఎండు మిర్చి రుబ్బి ఆ విగ్రహానికి పూస్తే 90 రోజులలోపు ఖచ్చితంగా వారి వస్తువులు వారికి దొరుకుతాయని, న్యాయం జరుగుతుందనీ ఇక్కడివారి గట్టి నమ్మకం. కొందరు తమ కోరికలు చీటీ మీద రాసి అక్కడ దేవత చేతికి కడతారు.

అంతే కాదు. యవ్వనంలోకి అడుగు పెడుతున్న బాలికలు, ఋతు క్రమంలో బాధపడే యువతులు ఈ అమ్మవారిని పూజిస్తే వారి ఆరోగ్యం చక్కబడుతుందని విశ్వాసిస్తారు.

ఇక్కడికి మంగళవారం, శుక్రవారం అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ అమ్మవారికి తమిళ మాసం తాయ్ లో 18 రోజులపాటు ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. భక్తుల రోగాలు నివారించే ధన్వంతరిగా, న్యాయ నిర్ణేతగా, భక్తులపాలిటి కల్పవల్లిగా ఈ దేవత భాసిల్లుతోంది.

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages