రంగ పంచమిని హోలీ పండుగ అయిదు రోజుల తర్వాత జరుపుకుంటారు.ఇది రంగులతో ముడిపడి ఉన్న మరొక పండుగ.
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రంగపంచమిని జరుపుకుంటారు. మహారాష్ట్రలో మత్స్యకారులకు ఇది చాలా ముఖ్యమైన పండుగ. వారు ఈ పండుగను షిమ్తో పేరుతో జరుపుకుంటారు. ఈ రోజున ఆట పాటలతో సందడి చేస్తారు.
మధ్యప్రదేశ్, ఉత్తర భారతదేశంలోని అనేక ఇతర ప్రాంతాలలో ఈ పండుగను ఎంతో పవిత్రంగా, వైభవంగా జరుపుకుంటారు.
ఈ పండుగ పవిత్రాగ్నిలో అన్ని రకాల తామసిక, రాజసిక గుణాల నుండి శుద్ధి పొందుతామని ప్రజలు విశ్వసిస్తారు. ఈ సమయంలో పర్యావరణం సానుకూలతతో నిండి ఉంటుంది. అనుకూల శక్తులు అందరినీ చుట్టుముడతాయి. హోళికా దహనం ద్వారా వచ్చే మంటలు, ఈ రోజున చల్లుకునే ప్రకృతిలో లభించే సహజమైన రంగులు దేవతలను ఆవాహన చేయడంలో సహాయపడతాయి.
ఈ పండుగలో వనమూలికలతో తయారు చేసిన రంగులు, సహజంగా ప్రకృతిలో లభించే రంగులనే ఎక్కువగా వాడతారు. ఇవి ఆధ్యాత్మిక అభివృద్ధి మార్గంలో ఉన్న అడ్డంకులు తొలగిస్తాయని చెబుతారు. ఈ ప్రత్యేక రోజున ప్రజలు తమ కుటుంబాలు, బంధువులు, స్నేహితులతో రంగులు ఆడుకుంటూ గడుపుతారు. భక్తులు శ్రీకృష్ణుడు, రాధాదేవిని పూజిస్తారు.
రంగ పంచమి వేడుకలకు మరో కోణం కూడా ఉంది. పంచ తత్వాలను ఈ పండుగ జాగృతం చేస్తుందని పండితులు చెబుతారు. భూమి, కాంతి, నీరు, ఆకాశం, గాలి అనే పంచభూతాలతో మానవ శరీరం కూడా నిండి ఉంది. రంగ పంచమి పండుగ జీవితంలో సమతుల్యతను పునరుద్ధరించడానికి సహాయపడే ఈ పంచ భూతాలను ప్రేరేపిస్తుందని శాస్త్ర వచనం.
2025: మార్చి 19
No comments:
Post a Comment