Kondagattu Hanuman Temple: శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం - కొండగట్టు

 

తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ దర్శనం సకల కార్యసిద్ధి కలిగిస్తుంది అని భక్తుల నమ్మకం. 

ఈ ఆలయానికి 300 సంవత్సరాల చరిత్ర ఉంది.

ఈ ఆలయాన్ని సంతానం కోరుకునే వారు సందర్శిస్తే చక్కని సంతానం పొందుతారు.

స్థల పురాణం 

ఈ ఆలయ స్థల పురాణం పరిశీలిస్తే త్రేతా యుగంలో రామ రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోగా, హనుమ లక్ష్మణుని కోసం సంజీవని తేవడానికి బయలుదేరుతాడు. హనుమ సంజీవనిని తీసుకొని వచ్చేటప్పుడు మార్గమధ్యలో అనగా ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశం అయిన ముత్యంపేట గ్రామం వద్ద కొంత భాగము విరిగిపడిందట. ఆ భాగాన్నే కొండ గట్టుగా ప్రస్తుతంగా పిలుస్తున్నారు.

సుమారు 400 సంవత్సరాల క్రితం సింగం సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చినప్పుడు అతడి ఆవుల మందలోని ఒక ఆవు తప్పిపోయిందట. సంజీవుడు ఆ అవును వెతుకుతూ అలసి సేద తీరడానికి ఒక చింత చెట్టు కింద విశ్రమించాడంట. అప్పుడు అతడికి స్వప్నంలో ఆంజనేయస్వామి సాక్షాత్కరించి తానిక్కడ కోరంద పొదలో ఉన్నానని, తనకు ఎండ, వాన, ముళ్ల నుంచి రక్షణ కల్పించమని చెబుతారట. అలాగే సంజీవుని ఆవు జాడ కూడా తెలిపి అదృశ్యమయ్యాడట.

వెంటనే నిద్ర నుంచి మేల్కొన్న సంజీవుడు ఉలిక్కిపడి చుట్టూ తన ఆవు కోసం పరిశీలించి చూడగా శ్రీ ఆంజనేయుడు కనిపించాడట. భక్తిభావం నిండిన మనసుతో సంజీవుడు కంటి వెంట కారుతున్న ఆనందాశ్రువులతో స్వామి వారి పాదాలు కడిగి చేతులెత్తి నమస్కరించాడట. అదే సమయంలో దూరం నుంచి ఆవు 'అంబా' అంటూ పరిగెత్తుకు వచ్చిందంట. వెంటనే సంజీవుడు చేతి గొడ్డలితో కోరంద పొదను తొలగించగా, శంఖు చక్ర గదాలంకరణతో శ్రీ ఆంజనేయ స్వామి వారు విశ్వరూపం, పంచ ముఖాల్లో ఒకటైన నారసింహ వక్త్రంతో ఉత్తరాభిముఖంగా ఉన్న రూపాన్ని చూసి ముగ్ధుడయ్యాడట. ఆ తర్వాత సంజీవుడు తన సహచరులు, గ్రామస్థుల సహకారంతో హనుమంతుడికి చిన్న ఆలయం నిర్మించారట. కొండగట్టు ఆలయ క్షేత్ర పాలకుడిగా శ్రీ బేతాళ స్వామి వెలసి ఉన్నారు.

ఈ కొండగట్టుపై కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళ స్వామి ఆలయం, సీతమ్మ కన్నీటి ధార, కొండల రాయుడి గుట్ట తదితర ప్రదేశాలు చూడదగినవి.

No comments