Ishta Kameswari Temple: శ్రీ ఇష్టకామేశ్వరి దేవి ఆలయం - శ్రీశైలం

నల్లమల అడవుల్లో ఉన్న ఇష్ట కామేశ్వరి ఆలయం గురించి అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. మహిమాన్వితమైన ఇష్టకామేశ్వరి దేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో తప్ప దేశంలో మరెక్కడా ఇలాంటి ఆలయం కనిపించదు.

అందరికీ ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శన భాగ్యం దొరకదు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప అమ్మవారి దర్శనం చేసుకోలేమని భక్తుల నమ్మకం. 

అతి కొద్ది మంది మాత్రమే ఇష్ట కామేశ్వరి అమ్మవారి దర్శనానికి వెళ్తారు. అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఎలాంటి కోరికలు అయిన నెరవేరుతాయి అన్ని నమ్మకం. అందుకు మన మనసులో కోరికను అమ్మవారికి చెప్పి అమ్మవారి నుదుటన బొట్టు పెట్టాలి.

మన చేతితో అమ్మవారి నుదురు తాకగానే నిజంగా మనిషి నుదురులాగా మెత్తగా తగిలి అనిర్వచనీయమైన అనుభూతితో ఒళ్ళు జలదరిస్తుంది.

ఒకప్పుడు ఇష్ట కామేశ్వరి అమ్మవారి ఆలయం చేరుకోడానికి సరైన దారి కూడా ఉండేది కాదు. కొండల మీద జీపు ప్రయాణం అత్యంత ప్రమాదంతో కూడిన సాహసం. అందుకే పూర్వం అడవుల్లోని సిద్ధులచే అమ్మవారు పూజలందుకునేది. ఇప్పుడు కొంత మెరుగైన రవాణా సౌకార్యాలు అందుబాటులోకి వచ్చాక సామాన్య భక్తులు కూడా ఇష్ట కామేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లి తమ కోరికలు అమ్మవారికి నివేదించి ఆ అమ్మ అనుగ్రహాన్ని పొందుతున్నారు.

చతుర్భుజాలతో దర్శనమిచ్చే అమ్మవారు రెండు చేతులతో తామర మొగ్గలను, మరో రెండు చేతుల్లో శివలింగాన్ని, రుద్రాక్షమాలను ధరించి తపస్సు చేస్తున్నట్లుగా దర్శనమిస్తారు. ఓ గుహలో ఉన్న దేవాలయంలో వెలసి ఉన్న ఇష్ట కామేశ్వరి అమ్మవారిని దీపపు వెలుగు మధ్య దర్శించుకోవాలి. ప్రశాంతమైన ఈ ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక భావన కలిగిస్తాయి. ఇక్కడ పరిసరాల్లో కూర్చుకుని కాసేపు ధ్యానం చేస్తే మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. ఈ అడవుల్లో స్థానికంగా నివసించే చెంచులు అమ్మవారికి నిత్య పూజలు చేస్తుంటారు.

శ్రీశైలం కూడలి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అడవుల మధ్య ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఉంటుంది. ఇక్కడికి ప్రయాణం ఎంతో సాహసంతో కూడుకుని ఉంటుంది. ఎటువంటి కార్లు వెళ్లలేని ఈ ప్రదేశానికి శ్రీశైలం నుంచి పరిమిత సంఖ్యలో కొన్ని జీపులు మాత్రమే నడుస్తాయి. 

No comments