తమిళ మాసం అయిన పెరటాశి మాసంలో తిరుమల శనివారాలు జరుపుకుంటారు. ఈ మాసం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వస్తుంది.
ఈ మాసంలోని శనివారాలు పవిత్రంగా భావించి విష్ణు ఆలయాలలో భక్తులు ప్రతేక్య పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలోనే తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరగడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.చాల మంది భక్తులు ఈ మాసంలో కేవలం శాకాహారం మాత్రమే స్వీకరిస్తారు.
శ్రీమహావిష్ణువు శ్రీవేంకటాచలపతిగా అవతరించిన మాసమే పెరటాసి. ఈ మాసంలో శ్రవణ నక్షత్రంలో తిరుమలేశుడు అవతరించినట్లు శ్రీవేంకటాచల మహత్యం చెబుతోంది.
ప్రత్యేకించి శనివారం ఆయనకు ఎంతో ప్రీతి. పెరటాసిలో శనివారాలు నాలుగు లేక ఐదు వస్తాయి. వీటిలో మూడవ శనివారాన్ని తమిళులు చాలా విశేషంగా భావించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ మాసంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారికి పిండి దీప సమర్పణ ఎంతో విశేషంగా జరుపుకుంటారు.
ఈ మాసంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాల వైభవాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి బ్రహ్మోత్సవం తిరుమలలో విశేషంగా, వైభవంగా జరుగుతుంది.
ఈ మాసంలో ముఖ్యంగా కొంతమంది శ్రీ వైష్ణవుల తిరుమాళిగల్లో (ఇళ్ళల్లో) శనివారాలలో శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం పెద్దల నుంచి వచ్చినటువంటి ఆనవాయితీగా జరుపుకుంటున్నాము.
పెరటాసి వ్రతం చేసేవారు పాటించాల్సిన నియమాలు
పెరటాసి మాసంలో శనివారాలు పిండి దీపం చేసుకునే వారు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
- ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలారా స్నానం చేసి శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతం పఠించాలి.
- 30 రోజులపాటు నుదుటన తిరు నామం ధరించాలి.
- నిత్య పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలి.
- ఏకభుక్తం, భూశయనం, బ్రహ్మచర్యం తప్పనిసరి. మద్యమాంసాలు ముట్టరాదు.
- ప్రతిరోజూ వేంకటేశ్వరుని ఆలయం సందర్శించాలి.
శ్రీనివాసునికి ప్రతిరోజూ పూజ తర్వాత చక్ర పొంగలి కానీ, కట్టు పొంగల్ కానీ నివేదించాలి.పరమ పవిత్రమైన పెరటాసి మాసంలో శ్రీనివాసుని భక్తిశ్రద్ధలతో పూజిద్దాం.
సెప్టెంబర్ 21
సెప్టెంబర్ 28
అక్టోబర్ 05
అక్టోబర్ 12
ఈ నాలుగు శనివారాలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆలయంలో కాని ఇంట్లో కాని పిండిదీపంతో దీపారాధన చేయాలి.
ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళ లో ఈ ఆచారం కనిపిస్తుంది.
2024: సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు.
Comments
Post a Comment