Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం
కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలో గాణగాపురం క్షేత్రం ఉంది.
ఆలయ స్థల పురాణం
అత్రి మహర్షి భార్య మహా సాధ్వి అనసూయమ్మ పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులను అనసూయ పసి బాలురుగా మార్చి వేయగా లక్ష్మి సరస్వతి పార్వతి అనసూయను ప్రార్ధించి తమ పతులను తిరిగి పొందగా అప్పుడు త్రిమూర్తుల అనుగ్రహంతో అత్రి అనసూయలకు త్రిమూర్తుల అంశగా దత్తుడిగా జన్మిస్తాడు. ఆ దత్తాత్రేయుని రెండవ అవతారమే శ్రీ నరసింహ సరస్వతిగా అవతరించినట్లుగా కథనం. అలా అవతరించిన శ్రీ నరసింహ సరస్వతి కాశీకి వెళ్ళి కృష్ణ సరస్వతి స్వామి దగ్గర సన్యాస దీక్షను చేపట్టి దేశమంతా తీర్ధ యాత్రలు చేస్తూ చివరకు కర్ణాటకలోని గాణగాపురంకు వచ్చి 23 సంవత్సరాలు అక్కడే ఉండి చివరకు తన పాదుకలను అక్కడే వదిలేసి శ్రీశైలంలోని కదళీ వనంలో అవతార పరిసమాప్తి గావించాడని పురాణగాథ.
పాదుకలకు పూజ
అలా నరసింహ సరస్వతి స్వామి వారు గాణగాపురంలో విడిచి వెళ్లిన పాదుకలను నిర్గుణ పాదుకలు అని అంటారు. నిర్గుణం అంటే ఎలాంటి ఆకారం లేనిదని అర్ధం. ఇలాంటి నిర్గుణ పాదుకలు ఒక్క గాణగాపురంలో తప్ప ప్రపంచంలో ఎక్కడ చూడలేం. ఈ పాదుకలనే స్వామిగా భావించి పూజలు జరుపుతారు.
గాణగాపురం లోని స్వామి పాదుకలు రాతితో తయారు చేసినవాని భావిస్తారు కానీ నిజానికి ఈ పాదుకల లోపల ఏముందో ఎవరికీ తెలియదు. ఇప్పటి వరకు వాటిని పరీక్షించడానికి కూడా ఎవరూ సాహసించలేదు. అందుకు కారణం ఏమిటంటే ఆ పాదుకలు ముట్టుకుంటే మెత్తగా దూది వలే ఉంటాయని, పాదుకలను స్పృశిస్తే నిజంగా మనిషి పాదాలు ముట్టుకున్న అనుభూతిని చెందుతారని విశ్వాసం.
పరమ పవిత్రం సంగమ స్నానం
గాణగాపురంలో దర్శనం చేయడానికి ఒక పద్ధతి ఉంది. క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడ ప్రవహించే బీమా - అమరాజ నది సంగమం లో స్నానం చేయాలి. ఇక్కడ ఒడ్డున గురుచరిత్ర పారాయణ చేసుకోవడానికి వీలుగా బల్లలు అమర్చి ఉంటారు. సంగమ స్నానం అనంతరం నరసింహ సరస్వతి నిర్గుణ పాదుకలను, స్వామిని కిటికీలో నుంచి దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత కల్లేశ్వరస్వామిగా పిలిచే పరమేశ్వరుని దర్శించుకోవాలి.
ఇతర ఉపాలయాలు
గాణగాపురంలో నరసింహ సరస్వతి ఆలయం ప్రాంగణంలో పంచముఖ గణపతి, ఆంజనేయుడు, నవగ్రహాలు తదితర దేవతామూర్తులను దర్శించుకోవచ్చు.
కుజ దోషం నాగ దోషం శని దోష నివారణ క్షేత్రం
నాగ కుజ ఇతర గ్రహ దోషాలున్నవారు, మానసిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ ఆలయంలో పూజలు జరిపించి ఒక రాత్రి నిద్రిస్తే అన్ని దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటి దోషాలున్నవారు ఈ ఆలయ ప్రాంగణంలో స్వయంభువుగా వెలసిన శనీశ్వరునికి తైలాభిషేకం చేయించుకుంటే సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం.
గాణగాపురంలో ఈ నాటికీ నరసింహ సరస్వతి స్వామి వారు ఏదో ఒక రూపంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు భిక్షకు వస్తారని అక్కడి ప్రజలు నమ్ముతారు. అందుకే ప్రతి ఇంట్లో తమ శక్తి కొద్దీ రొట్టెలు, కిచిడీ, పాయసం వంటి పదార్థాలు తయారు చేసి సిద్ధంగా ఉంచుతారు. ఈ క్షేత్రాన్ని దర్శించడానికి వెళ్లిన భక్తులు కూడా అయిదు ఇళ్లలో భిక్షను స్వీకరించడం కూడా ఆనవాయితీ. భక్తుల రూపంలో స్వామే భిక్షకు వచ్చారని అక్కడి గృహస్తులు నమ్ముతారు.
ఎలా చేరుకోవాలి?
దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కర్ణాటకలోని గుల్బర్గా కు రైలు, బస్సు సౌకర్యాలున్నాయి.
Comments
Post a Comment