Srisailam Bramaramba Devi: శ్రీ భ్రమరాంబ దేవి - శ్రీశైలం

శ్రీశైలం భూమండలానికి కేంద్రస్థానం. ఇది జ్యోతిర్లింగక్షేత్రమే కాదు, అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరవది కూడా. ఇక్కడ సతీదేవి శరీరభాగాల్లో కంఠభాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి. మల్లికార్జునస్వామివార్కి పశ్చిమభాగంలో వెనుకవైపు అమ్మవారు కొలువై ఉంది. స్కాందపురాణాంతర్గతమైన శ్రీశైలఖండంలో ఈ అమ్మవారి విశేషాలు దాదాపు 20 అధ్యాయాలతో భ్రమరాంబికోపాఖ్యానం పేరుతో ఉన్నాయి.

పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు తనకు సకల దేవ, యక్ష, గంధర్వ, పురుష, స్త్రీ, మృగ, జంతుజాలంతో మరణం కలుగరాదని బ్రహ్మతో వరం పొందాడు. వరగర్వంతో భక్తులు సకలలోకాలవారినీ హింసించసాగాడు. దీంతో అందరూ అమ్మవారిని శరణు వేడుకున్నారు. అప్పుడు అమ్మవారు భ్రమరరూపం ధరించి అరుణాసురుణ్ణి సంహరించి లోకాలను కాపాడింది. అరుణాసురసంహారం తరువాత భక్తుల విన్నపంతో శ్రీగిరిపై స్థిరంగా వెలిసింది. అమ్మవారి మూలమూర్తి స్థితరూపంలో (నిలుచుని) ఎనిమిది చేతులతో కుడివైపు చేతులలో త్రిశూలం, చురకత్తి, గదా, ఖడ్గం వంటి ఆయుధాలు, ఎడమవైపు మహిషముఖాన్ని బంధించి, విల్లు, డాలు, పరిఘలను ధరించి ఎడమకాలిని మహిషం (దున్నపోతు) వీపుపై అదిమిపెట్టిత్రిశూలంతో కంఠభాగంలో పొడుస్తూ మహిషాసురమర్దిని వలె కనిపిస్తుంది. అయితే అమ్మవారి ఈ ఉగ్రరూపాన్ని అమ్మవారి కుడిభుజములో అంబులపొది వుంటుంది. దర్శించిన తట్టుకోలేరు కనుక సౌమ్యరూప అలంకరణతో ఏడాది పొడుగునా ఉంటుంది. సంవత్సరానికోసారి జరిగే కుంభోత్సవం సందర్భంగా అమ్మవారు ముఖకవచం లేకుండా భక్తులకు దర్శనమిస్తుంది.

ఈ ఉగ్రరూపాన్ని విజయదశమినాడు ఉత్సవమూర్తికి అలంకరించి భక్తులు దర్శించుకునే వీలు కల్పిస్తారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆమె అనుగ్రహన్ని పొంది ధన్యులవుతారు.

దూర్వాసమహర్షి, గర్గమహర్షి, ఆదిశంకరులు సైతం భ్రమరాంబాష్టకాన్ని సంస్కృతభాషలో రచించారు. శ్రీగిరిభ్రమరాంబికా అనే మకుటంతో సాగే భ్రమరాంబాష్టకం తెలుగునాట ఎంతో ప్రసిద్ది.

కాగా 15 శతాబ్దానికి చెందిన గౌరన కవి రచించిన నవనాథ చరిత్ర, హరిశ్చంద్రోపాఖ్యానం కావ్యాలు ఎంతో ప్రసిద్ధం. ఈ కవి తనకు శ్రీశైలభ్రమరాంబా అనుగ్రహముతోనే కవితాశక్తి అలవడిందని చెప్పుకున్నాడు.

ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి తెలుగు ప్రాంతాలనుండే గాక కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఉత్తరభారత దేశ ప్రాంతాల నుండి భక్తులు పెద్దసంఖ్యలో వస్తారు.

ఛత్రపతి శివాజీ భ్రమరాంబాదేవి దర్శనం చేసుకుని ఆలయానికి ఉత్తర గోపురం కట్టించాడు. ఇది శివాజీగోపురం పేరుతో ప్రసిద్ధిపొందింది. భ్రమరాంబాదేవి ఛత్రపతిశివాజీకి ఖడ్గం ప్రసాదించింది, ఆ ఖడ్గం స్వీకరించిన ఉత్సాహంతో హిందూధర్మ సామ్రాజ్య స్థాపనయే లక్ష్యంగా ఆయన ఎన్నో విజయయాత్రలు చేశాడు.

శివాజీకి ఖడ్గం ప్రసాదిస్తున్న భ్రమరాంబాదేవి విగ్రహం ఆలయ ఆవరణలో గల నాగులకట్ట వద్ద భక్తులు దర్శించవచ్చు.

కన్నడప్రజలు భ్రమరాంబాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా, మల్లికార్జునస్వామిని అల్లుడుగా భావించి పూజించే సంప్రదాయం నేటికీ ఉంది.

No comments