ప్రస్తుత కాలంలో సూళ్ళూరుపేటగా పిలుస్తున్న ఈ పట్టణానికి పూర్వనామం శుభగిరి. ఈ గ్రామానికి పడమరవైపుగా ప్రవహించే నది ఒకరోజు సాయంత్రం ఆ గ్రామంలోని పశువుల కాపర్లు నదిలో దిగి ఉల్లాసంగా స్నానం చేస్తున్నారు. ఇంతలో వారిలో ఒకతను హఠాత్తుగా సుడిగుండంలో చిక్కుకున్నాడు. ఆ సుడిగుండం అతన్ని నది లోపలికి ఈడ్చుకుని అడుగుభాగానికి తీసుకువెళ్ళింది. సుడిగుండం నుండి బయటపడటానికి అతను విశ్వప్రయత్నం చేస్తూండగా, ఒక బండరాయి చేతికి తగిలింది ప్రాణా పాయస్థితిలో వున్న అతను ఆ బండ రాయిని గట్టిగా పట్టుకొని సుడికి ఎదురు తిరగగా ఒక్క ఉదుటన అతనికి అసరాగా వున్న బండరాయితో సహా ఒడ్డుకు విసిరి వేయబడ్డాడు.
సుడిగుండంలో మునిగిన అతని కోసం స్నేహితులు అత్రుతగా వెదుకుతుండగా హఠాత్తుగా, ఒక్క ఉదుటన ఒడ్డుకు విసిరివేయబడ్డ అతడిని వారు సంభ్రమాశ్చర్యాలతో చూశారు. అతను సుడిగుండం నుండి బయటపడటానికి తనకు సహాయపడ్డ బండరాయిని గురించి స్నేహితులకు వివరించాడు. అందరూ కలసి బండరాయిని ఒడ్డుకు చేర్చి ఆ బండరాయిని పరిశీలించగా అది ఓ స్త్రీమూర్తి విగ్రహం అని తెలుసు కుని, నది ఒడ్డునే ఆ విగ్రహాన్ని పడుకో బెట్టి, తమ ఇళ్లకు వెళ్ళిపోయారు.
మరునాడు గ్రామపెద్దలు, పశువుల కాపరులను వెంటతీసుకొని ఆ విగ్రహం వద్దకురాగా ఆశ్చర్యకరంగా క్రితం రోజు పడుకోబెట్టిన విగ్రహం దక్షిణాభిముఖంగా నిట్టనిలువుగా నిలబెట్టిన భంగిమలో వుండటం గమనించి, సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అందరూ భక్తిప్రపత్తులతో నమస్కరించి, శోభాయమానంగా వున్న విగ్రహాన్ని గ్రామంలోకి తర లించి, గుడి నిర్మించాలని సంకల్పించి విగ్రహం తరలించేందుకు ప్రయత్నించారు. వారు ఎంతగా ప్రయత్నించినా విగ్రహాన్ని ఇసుమంతైనా కదిలించలేకపోయారు.
ఆ రోజుకు విగ్రహం తరలించే కార్యక్రమాన్ని నిరమించుకొని మరునాడు మళ్ళీ ప్రయత్నిద్దామని భావించి, తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు ఆనాటి రాత్రి గ్రామపెద్దల్లో ఒకరికి అమ్మవారు కలలో కనిపించి ఒడ్డున ఎక్కడైతే స్వయంభూగా వెలసియున్నానో అక్కడే నన్ను పూజించుకోండి" అని ఆజ్ఞాపించి అదృశ్యమైంది. అమ్మవారి అజ్ఞ మేదట గ్రామస్తులు అక్కడే ఒక చక్కటి గుడి నిర్మించి, తలుపులు ఏర్పాటు చేయాలని భావించి, దానికి కావలసిన కొయ్య సామాగ్రి తెచ్చి, వడ్రంగినే పని ప్రారంభించారు. పనిపూర్తయిన పిదవ తలుపుచెక్కలు దేవాలయం వెనుకవున్న చెట్టు మొదల్లో నిలబెట్టి, చీకటి పడటంతో ఆరోజు పని ఆపివేసి, వారి యిండ్లకు వెళ్లిపోయారు.
ఆనాటి రాత్రి అమ్మవారు గ్రామ పెద్దకు మరోసారి కలలో కనిపించి "నా గుడికి తలుపులు ఏర్పాటు చేయవద్దు. నా భక్తులు సన్ను సర్వవేళలా దర్శించు కోవటానికి ఎటువంటి ఆటంకం కలిగించవద్దు" అని చెప్పి అదృశ్యమైంది.
ఆ సంగతి తెలిసిన గ్రామస్తులు మరునాడు ఆలయం వద్దకు వచ్చి గత రాత్రి తలుపులు తయారుచేసి పెట్టిన చెక్కలను పరిశీలించగా ఆ చెక్కలు చిగురించివున్నాయి. నిలబెట్టి వున్న తలుపులు చిగురించి చెట్టుగా మారిన వృత్తాంతానికి ఆలయ ఆవరణలో ఈశాన్యదిక్కులో నేటికీ వున్న పెద్దచెట్టే ప్రత్యక్ష సాక్ష్యం.
ఈనాటికి కూడా అమ్మవారి గుడికి తలుపులు లేవు. శ్రీ చెంగాళమ్మ అమ్మ వారిని భక్తులు 24 గంటలూ దర్శించుకోవచ్చు. అమ్మవారి దర్శనార్థం భక్తులు శుక్ర, ఆది, మంగళ వారాలలో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి మొక్కుబడులు చెల్లించుకొని, ఇక్కడే వంట చేసుకొని భోజనం చేయటం ఇక్కడి ఆచారం. అనాదికాలం నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. అమ్మవారి సన్నిధిలో విశేష సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. దేవస్థానంలో భక్తులకు తగిన వసతి సౌకర్యాలు వున్నాయి.
ప్రతి 7 సంవత్సరాలకు ఒక్కసారి అమ్మవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
Comments
Post a Comment