ఆంధ్రప్రదేశ్లో పంచ భావనారాయణ క్షేత్రాలు ఉన్నాయి. అవి వరుసగా పొన్నూరు, సర్పవరం, బాపట్ల, భావదేవరపల్లి, పట్టసం. వీటిలో పొన్నూరులో భావనారాయణ స్వామి ఆలయం ప్రఖ్యాతి చెందినది. 'పొన్నూరు'లో వెలసిన స్వామి 'సాక్షి' భావనారాయణ స్వామిగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు.
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో పొన్నూరు ఉంది. పొన్నూరు అనే పదం 'పొన్, ఊరు' అనే రెండు పదాల కలయిక వల్ల వచ్చింది. 'పొన్' అంటే బంగారం అని 'ఊరు' అంటే గ్రామం అని అర్థం. అందుకే ఈ గ్రామాన్ని బంగారు గ్రామం, స్వర్ణపురి పేర్లతో కూడా పిలుస్తారు. ఇక్కడ భావనారాయణ స్వామి, సాక్షి భావనారాయణ స్వామిగా మారడం వెనుక ఓ ఆసక్తి కరమైన కథనం ఉంది.
సంతానం కోసం కాశి దర్శించిన కేశవయ్య
పూర్వం పొన్నూరులో కేశవశర్మ అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి సంతానం లేదు. దీంతో సంతానం కోసం అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించేవాడు. ఈ యాత్రల్లో తన కుటుంబ సభ్యలతో పాటు మేనల్లుడైన గోవిందుడిని కూడా వెంటబెట్టుకొని వెళ్లేవాడు. ఈ క్రమంలోనే కేశవయ్య కాశీని సందర్శిచి అక్కడ నారాయణుడి దేవాలయంలో తనకు సంతాన ప్రాప్తి కలిగించాలని వేడుకొన్నాడు.
గోవిందుని కోరిక
అదే సమయంలో అక్కడే ఉన్న కేశవశర్మ మేనల్లుడు గోవిందుడు ఈసారి నీకు ఆడపిల్ల ఖచ్చితంగా కలుగుతుంది. అలా జరిగితే తనకు ఇచ్చి వివాహం చేయాల్సిందిగా కోరాడు. ఇందుకు కేశవశర్మ సరేనన్నాడు. ఇలా కొంతకాలం గడిచింది. నారాయణుడి అనుగ్రహంతో కేశవశర్మ దంపతులకు పండంటి ఆడపిల్ల పుట్టింది. ఆమెకు అక్క లక్ష్మి అని పేరుపెట్టాడు. ఆమెకు యుక్త వయసు కూడా వచ్చింది.
ఇచ్చిన మాట తప్పిన కేశవశర్మ
గోవిందుడు పుట్టుకతో గూనివాడు. అందుచేత గూనివాడైన గోవిందుడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయాడనికి కేశవయ్య నిరాకరించాడు. తనకి ఇచ్చి పెళ్లి చేస్తానని భావనారాయణ స్వామి సాక్షిగా మాట ఇచ్చిన విషయాన్ని గోవింద శర్మ గుర్తుచేస్తాడు. గోవింద శర్మకి పిల్లను ఇవ్వడం ఇష్టం లేని కేశవ శర్మ, తప్పించుకోవడం కోసం భావనారాయణ స్వామినే సాక్ష్యంగా తీసుకురమ్మని అంటాడు.
నారాయణుని సాక్ష్యం చెప్పమని వేడుకున్న గోవిందుడు
దీంతో గోవిందుడు కాశీలోని నారాయణుడిని దేవాలయం వద్దకు వెళ్లి స్వామి ముందు తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొని బాధపడ్డాడు. "నీ సమక్షంలోనే కేశవయ్య తనకు కూతురును ఇచ్చి వివాహం చేస్తానని చెప్పాడు కదా? ఇప్పుడు నీవే వచ్చి ఈ విషయం చెప్పి తనకు తన మామ కూతురుతో పెళ్లి అయ్యేలా చూడాలి" అని ప్రార్థించాడు.
సాక్ష్యమిచ్చిన భావనారాయణుడు
తన భక్తునికి న్యాయం జరిపించడానికి నారాయణుడు అతనితో పాటు పొన్నూరు వచ్చి తన ఆలయంలో జరిగిన విషయం మొత్తం అక్కడివారికి తెలిపి గోవిందుడి వివాహం జరిపించాడని పురాణ కథనం. ఆనాటి నుంచి ఇక్కడే నారాయణుడు సాక్షి భావనారాయణుడిగా కొలువై ఉండిపోతాడు. అందువల్లనే ఇక్కడి భావనారాయణుడిని 'సాక్షి' భావనారాయణుడిగా భక్తులు పిలుచుకుంటూ ఉంటారు. కొలుచుకుంటూ వుంటారు.
దర్శనఫలం
పొన్నూరు భావనారాయణ స్వామిని దర్శించుకోడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. వివాహ సంబంధ విషయాల్లో ఇబ్బందులు పడేవారు ఈ స్వామివారిని సందర్శించుకొంటే ఆ సమస్యలు తీరుతాయని భక్తులు నమ్మకం.
ఇతర ఉపాలయాలు - పూజోత్సవాలు
నిత్యం భక్తులతో కళకళలాడుతుండే ఈ ఆలయ ప్రాంగణంలో విశాలాక్షీ సమేత విశ్వేశ్వరుడు, చెన్నకేశవ స్వామి, లక్ష్మీ నరసింహుడు, వినాయకుడు, దాసాంజనేయ స్వామి ఆలయాలు కూడా దర్శించుకోవచ్చు. రోజూ స్వామికి త్రికాల సంధ్య పూజలు జరుగుతాయి. ఆదివారాలలో విశేషమైన అభిషేకాలు జరుగుతాయి. ప్రతి ఏడాది వైశాఖ మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి.
No comments:
Post a Comment